MK Stalin: అప్పటిదాకా గవర్నర్‌గా ఆయన్నే కొనసాగించండి.. కేంద్రంపై స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు

తన వ్యాఖ్యలతో డీఎంకే ఎన్నికల ప్రచారానికి గవర్నర్‌ సాయం చేస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు.

Published : 27 Oct 2023 18:05 IST

చెన్నై: తమిళనాడు (Tamil Nadu) గవర్నర్‌పై సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2024 లోక్‌సభ ఎన్నికల వరకు గవర్నర్‌గా ఆర్‌.ఎన్‌. రవిని కొనసాగించాలని అన్నారు. డీఎంకే ఎన్నికల ప్రచారానికి గవర్నర్‌ సాయం చేస్తున్నారని స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెన్నైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ద్రవిడం అంటే ఏంటి? అని ప్రతిసారీ అడుగుతున్న వ్యక్తినే గవర్నర్‌గా కొనసాగించాలని నా ఉద్దేశం. దానివల్ల ద్రవిడ సంస్కృతి గురించి మనం చేస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. లోక్‌సభ ఎన్నికల వరకు గవర్నర్‌ను మార్చొద్దని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరుతున్నా. గవర్నర్‌ స్థానంలో ఉండి ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, రాష్ట్ర ప్రజలు ఆయన మాటల్ని పట్టించుకోవడంలేదు’’ అని స్టాలిన్‌ విమర్శించారు. 

‘ఆ పాత ఫోన్‌ను 2014లోనే వదిలేశారు’.. కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌.ఎన్‌. రవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆయన విబేధిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాజ్‌భవన్‌ వద్ద పెట్రోల్‌ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చారని రాజ్‌భవన్‌ వర్గాలు ఆరోపించాయి. మరోవైపు తనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగిన పోరాటాలు, రాజకీయ ప్రముఖుల విమర్శలువంటి వాటితో కేంద్ర హోంశాఖకు సమగ్ర నివేదిక పంపాలని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి నిర్ణయించినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని