Corona: దిల్లీలో కొవిడ్‌ బుసలు.. 6 నెలల తర్వాత భారీగా కేసులు!

దిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Published : 29 Mar 2023 22:32 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలుకొడుతోంది. ఒక్కరోజులోనే 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు, రోజువారీ పాజిటివిటీ రేటు 13.89శాతానికి పెరిగినట్టు దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కొవిడ్‌ బారినపడి మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. దిల్లీలో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం 115 కొత్త కేసులు నమోదు కాగా.. నిన్న 214 కేసులు, తాజాగా ఆ సంఖ్య  300లకు పెరిగింది. 

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో దిల్లీలో గత కొన్ని రోజులుగా రోజువారీ కొవిడ్‌కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జనవరి16న సున్నా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో  ఇవాళ ఒక్కరోజే 300 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజా కేసులతో కలిపితే దిల్లీలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 20,09,361కి పెరిగింది. వీరిలో 26,526మంది మృతిచెందారు. ప్రస్తుతం దిల్లీలో క్రియాశీల కేసుల సంఖ్య 806కి చేరింది.  దిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ కొత్త వేరియంట్ XBB.1.16 విజృంభణకు దారితీసే అవకాశం లేకపోలేదని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులు తీసుకుంటే మేలని సూచిస్తున్నారు. మరోవైపు, దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సురభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. దిల్లీలోని ఆస్పత్రుల్లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు ఎక్కువేమీ లేవని.. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని