Toll tax: 1 నుంచి టోల్‌ మోత?.. 5-10 శాతం పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వెళ్లే ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఛార్జీలను 5 నుంచి 10శాతం మేర పెంచేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Updated : 06 Mar 2023 07:24 IST

నెల పాసుల ధరలూ పెరిగే అవకాశం

దిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వెళ్లే ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఛార్జీలను 5 నుంచి 10శాతం మేర పెంచేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారం ఏటా టోల్‌ ధరలను సవరిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితులు, వినియోగదారుల సంఖ్య, గతంలో వసూలైన రుసుముల అధారంగా నిర్ణయం తీసుకుంటారు. టోల్‌ వసూళ్ల విషయంలో మార్పులు చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. మార్చి చివరి వారం నాటికి దీనిపై నిపుణుల అభిప్రాయాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కార్లకు, సాధారణ వాహనాలకు ఎంత రుసుము వసూలు చేయాలి? భారీ వాహనాలకు ఎంత వసూలు చేయాలో అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేలో 10 శాతం?

ఇటీవల దౌసా వరకు ప్రారంభమైన దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గంలోనూ టోల్‌రేట్లు పెంచే అవకాశముంది. ప్రస్తుతం ఈ మార్గంలో కిలోమీటరుకు రూ.2.19 వసూలు చేస్తున్నారు. దీనిపై కనీసం 10 శాతం మేర టోల్‌ఛార్జీలను పెంచే అవకాశముంది. ప్రస్తుతం రోజుకు దాదాపు 20 వేల వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. రానున్న 6 నెలల్లో ఈ సంఖ్య 50 వేల నుంచి 60 వేలకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా.

* టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాణిజ్యేతర వాహనదారులు ప్రస్తుతం నెలవారీ పాసుకు రూ.315 చెల్లించి ఎన్నిసార్లయినా ప్రయాణం చేసుకునే వీలుంది. తాజాగా వీటి ధరలను కూడా 10శాతం మేర పెంచే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని