Gas: పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌ ధరలు పెరిగాయి. సిలిండర్‌పై రూ.25.50 పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

Updated : 01 Jul 2021 10:59 IST

దిల్లీ: ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు వంటిట్లో ఉంటే గ్యాస్‌ బండ కూడా వినియోగదారులకు గుదిబండలా మారుతోంది. గత కొద్దిరోజులుగా వంటగ్యాస్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై రూ. 25, వాణిజ్య సిలిండర్‌పై రూ. 84ను పెంచుతూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లో రానున్నట్లు తెలిపాయి. 

తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో 14.2 కేజీల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 834.50కు చేరింది. ముంబయిలోనూ ఇదే ధర ఉండగా.. కోల్‌కతాలో వంటగ్యాస్‌ ధర రూ. 835.50, చెన్నైలో రూ. 850.50గా ఉంది. ఇక 19 కిలోల సిలిండర్‌ ధర దిల్లీలో రూ. 1,550కి చేరింది. హైదరాబాద్‌లో గృహావసరాల సిలిండర్‌ ధర రూ.887కి.. వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 1768కి పెరిగింది.

 గత ఆరు నెలల్లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 140 పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 4న తొలిసారిగా సిలిండర్‌ ధరను రూ. 25 పెంచారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15న రూ. 50, ఫిబ్రవరి 25న రూ. 25 పెరిగింది. ఆ నెలలో మొత్తంగా గ్యాస్‌ ధర రూ. 100 పెరిగింది. ఇక మార్చి 1న మరో రూ.25 పెంచారు. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఏప్రిల్‌ 1న వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ. 10 తగ్గించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని