Facebook Love: అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు

భారత్‌ నుంచి తనను కలుసుకోవడానికి వచ్చిన వివాహిత అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆమె ఫేస్‌బుక్‌ స్నేహితుడు, పాకిస్థాన్‌ యువకుడు నస్రుల్లా (29) సోమవారం స్పష్టం చేశాడు.

Updated : 25 Jul 2023 09:42 IST

ఆమె 20న భారత్‌కు వెళ్లిపోతుంది
పాకిస్థాన్‌ యువకుడు నస్రుల్లా వెల్లడి

పెషావర్‌: భారత్‌ నుంచి తనను కలుసుకోవడానికి వచ్చిన వివాహిత అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆమె ఫేస్‌బుక్‌ స్నేహితుడు, పాకిస్థాన్‌ యువకుడు నస్రుల్లా (29) సోమవారం స్పష్టం చేశాడు. తమ మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ముగిశాక ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వెళ్లిపోనుందని వెల్లడించాడు. ‘‘ఫేస్‌బుక్‌లో పరిచయమైన అంజు పాక్‌ సందర్శనకు వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు. మా ఇంటిలో మా కుటుంబానికి చెందిన ఆడవారితో కలిసి ఆమె ప్రత్యేక గదిలో ఉంటోంది. జిల్లా యంత్రాంగం మాకు తగిన భద్రత కల్పించింది’’ అని నస్రుల్లా అప్పర్‌ దిర్‌ జిల్లా, కుల్షో గ్రామం నుంచి భారత వార్తా సంస్థకు ఫోనులో చెప్పాడు. అంజు(34), అర్వింద్‌ దంపతులు రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలో నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. దీంతో ఔషధ రంగంలో పనిచేస్తున్న అతడిని కలుసుకోవడానికి అంజు జైపూర్‌ నుంచి బయలుదేరి పాక్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తాను పాక్‌కు రాలేదని, ఈ విషయంలో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని అంజు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని