ISRO: ఇస్రో శాస్త్రవేత్త ముత్తువేల్‌ మనసు.. ఆకాశమంత

చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.వీరముత్తువేల్‌ తన దాతృత్వ గుణాన్ని చాటి ఆదర్శంగా నిలిచారు. తాను అందుకున్న రూ.25 లక్షల నగదు బహుమతిని పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

Updated : 12 Nov 2023 09:02 IST

రూ.25 లక్షల నగదు బహుమతిని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించిన ముత్తువేల్‌

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.వీరముత్తువేల్‌ తన దాతృత్వ గుణాన్ని చాటి ఆదర్శంగా నిలిచారు. తాను అందుకున్న రూ.25 లక్షల నగదు బహుమతిని పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు విజయవంతం కావడంతో పలువురు శాస్త్రవేత్తలను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించి, ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతిని అందించింది. ఆ మొత్తాన్ని తాను చదువుకున్న కళాశాలల పూర్వవిద్యార్థుల సంఘాలకు వితరణ చేస్తానని వీరముత్తువేల్‌ తెలిపారు.

ఈ విషయమై ఇస్రో అదనపు కార్యదర్శి సంధ్య వేణుగోపాల్‌ శర్మ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. డబ్బు విషయంలో పెద్దగా అవగాహన లేదు. దేశాభివృద్ధికి పనిచేసే గొప్ప అవకాశాన్ని ఇస్రో ఇవ్వడమే ఎంతో సంతృప్తినిస్తోంది. చంద్రయాన్‌ విజయంలో నా పాత్రకన్నా ‘మా’ పాత్రే ఎక్కువగా ఉంది. ఇది అందరి కృషి. ఇంత పెద్ద మొత్తం నగదును నేను ఒక్కడినే అవార్డుగా స్వీకరించేందుకు నా మనస్సు అంగీకరించడం లేదు. అందుకే ఈ మొత్తాన్ని పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా’ అని వీరముత్తువేల్‌ పేర్కొన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తగా నెలకు రూ.లక్ష వేతనాన్ని అందుకుంటున్న ఆయన తన ఇంటి నిర్మాణానికి రూ.72 లక్షల రుణం తీసుకున్నప్పటికీ, బహుమతిగా వచ్చిన రూ.25 లక్షలను దాతృత్వ కార్యక్రమాలకు ప్రత్యేకించారు. ఇది తనకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరముత్తువేల్‌తో పాటు రూ.25 లక్షల నగదును అందుకున్న యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్‌ డైరెక్టర్‌ ఎం.శంకరన్‌ కూడా ఆ మొత్తాన్ని తాను చదువుకున్న కళాశాలల పూర్వ విద్యార్థుల సంఘాలకు ఇస్తానని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని