Gaganyaan: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం: ఇస్రో ఛైర్మన్‌

గగన్‌యాన్‌ (Gaganyaan) ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని ఇస్రో  (ISRO) ఛైర్మన్‌ సోమనాథ్‌ (Somanath) అన్నారు. 2035 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ స్పేస్‌ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

Published : 22 Oct 2023 17:08 IST

తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చేపడుతున్న ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ (Gaganyaan) ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించే యోచనలో ఉన్నామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ (Somanath) అన్నారు. మహిళా ఫైటర్‌ టెస్టు పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలను ఈ కీలక ప్రాజెక్టులో భాగం చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మానవ రహిత గగన్‌యాన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఫీమేల్‌ హ్యూమనాయిడ్‌ను పంపిస్తామన్నారు. ఇది మనిషిని పోలి ఉండే రోబో. గగన్‌యాన్‌ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడం. అక్కడ మూడు రోజులపాటు వారిని ఉంచి తిరిగి తీసుకురావడం. 

పాలస్తీనాకు భారత్‌ మానవతా సాయం.. 6.5 టన్నుల సామగ్రితో బయల్దేరిన విమానం

ఈ ప్రాజెక్టులో మహిళలను భాగం చేస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ చెబుతూ ‘అందులో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో అది సాధ్యమయ్యేందుకు తగిన అభ్యర్థులు దొరకాలి. ప్రస్తుతానికి ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవారిని ఫైటర్‌ టెస్టు పైలట్‌ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నాం. వారు వివిధ కేటగిరీల నుంచి ఉన్నారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్‌ టెస్టు పైలట్లు అందుబాటులో లేరు. వారు ముందుకొస్తే ఓ మార్గం సుగమం అవుతుందని’ సోమనాథ్‌ వ్యాఖ్యానించారు. 

గగన్‌యాన్‌లో ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం నెలకొల్పడానికి రెండో ఎంపిక శాస్త్రీయ కార్యకలాపాలతో కూడుకున్నదని చెప్పారు. ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగామిగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. దాంతో మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. 2035 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ స్పేస్‌ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన తొలి టెస్ట్‌ వెహికల్‌ (టీవీ-డీ1) ప్రయోగం కాస్త ఆలస్యమైనా విజయవంతమైంది. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రాకెట్‌ బయలుదేరిన ఒకటిన్నర నిమిషాల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్‌ స్థితిని ప్రదర్శించారు. దాంతో రాకెట్‌ పైభాగంలోని క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ రాకెట్‌ నుంచి వేరైంది. వాహనం 17 కి.మీ. ఎత్తులో ఉండగా క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూమాడ్యూల్‌ విడిపోయాయి. తర్వాత పారాచూట్లు విచ్చుకోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా బంగాళాఖాతాన్ని తాకింది. తీరానికి పది కిలోమీటర్ల దూరంలో భారతీయ నౌకాదళం దాన్ని స్వాధీనం చేసుకుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని