Drugs Bust: పెద్దఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం.. ఆసియా చరిత్రలో తొలిసారి!

లావోస్ పోలీసులు బుధవారం రాత్రి భారీ ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ఈ మాదక ద్రవ్యాలను పట్టుకోవడం ఆసియా ప్రాంతంలోనే ఇదే మొదటిసారి!

Published : 29 Oct 2021 02:15 IST

లావోస్‌: లావోస్ పోలీసులు బుధవారం రాత్రి భారీఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర లావోస్‌లోని బోకియో ప్రావిన్స్‌లో మద్యం సీసాలు రవాణా చేస్తున్న ట్రక్కులో 5.5 కోట్లకు పైగా నిషేధిత మెథాంఫేటమిన్ (మెథ్‌) మాత్రలతోపాటు 1,537 కిలోల క్రిస్టల్ మెథ్‌ను పట్టుకున్నారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ఈ మాదక ద్రవ్యాలను పట్టుకోవడం ఆసియా ప్రాంతంలోనే ఇదే మొదటిసారని ఐరాస ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రాంతీయ ప్రతినిధి జెరెమీ డగ్లస్ వెల్లడించారు. గతేడాదిలో లావోస్ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మెథ్‌ మాత్రల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. 

ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ మాదక ద్రవ్యాల రవాణాతో తమకు ఎలాంటి సంబంధం లేదని మద్యం తయారీ సంస్థ లావో బ్రూవరీ ఓ ప్రకటన విడుదల చేసింది. థాయ్‌లాండ్, మయన్మార్‌తో సరిహద్దులు పంచుకుంటున్న లావోస్‌ దేశం.. ఇటీవలి కాలంలో మయన్మార్‌లోని సమస్యాత్మక ప్రాంతమైన షాన్ రాష్ట్రం నుంచి థాయ్‌లాండ్‌కు మధ్య మాదకద్రవ్యాల రవాణాకు గేట్‌వేగా మారింది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్న నేపథ్యంలో బోకియో ప్రావిన్స్‌ను గోల్డెన్‌ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తారు. మయన్మార్‌లో ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు, ఆర్థిక సంక్షోభం అనంతరం ఈ కార్యకలాపాలు మరింత పెరిగినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని