G 20: జమ్ముకశ్మీర్‌లో సదస్సు.. 26/11 తరహా కుట్రకు పన్నాగం!

జీ20 (G20) టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. చివరి నిమిషంలో భద్రతాపరమైన మార్పులు చేశారు.

Published : 21 May 2023 20:16 IST

దిల్లీ: జమ్ము కశ్మీర్‌లో (Jammu Kashmir) సోమవారం నుంచి నిర్వహించనున్న జీ20 (G20) టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాల్లో అత్యవసరంగా భద్రతాపరమైన మార్పులు చేశారు. ఈ సమావేశమే లక్ష్యంగా పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) ప్రేరేపిత ఉగ్రవాదులు 26/11 తరహా దాడులకు పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈ మేరకు చివరి నిమిషంలో కీలక మార్పులు చేశారు. మే 22 నుంచి 24వరకు జమ్ముకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ పట్టణంలోని జీ20 సదస్సు జరగనుంది. ఈ మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకొని క్షణ్ణంగా తనిఖీలు నిర్విహించాయి.

తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చి ఐఎస్‌ఐ ఉగ్రవాదుల కోసం పని చేస్తున్న వ్యక్తిని భద్రతాబలగాలు అదుపులోకి తీసుకొని ప్రశ్నించాయి. అతడు సదస్సు నిర్వహించనున్న కన్వెన్షన్‌ సెంటర్‌లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతడు చెప్పిన వివరాలను బట్టి ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడేందుకు అవకాశం ఉన్నట్లు తెలుసుకున్న బలగాలు ఆగమేఘాల మీద భద్రతాచర్యల్లో మార్పులు చేపట్టాయి. ముంబయి దాడుల తరహాలో కొందరు ఉగ్రవాదులు సదస్సు జరిగే ప్రాంతంలోకి చొరపడి కాల్పులు జరిపేందుకు పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గుల్‌మార్గ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోయలో ఎలాంటి రూమర్స్‌ చెలరేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్‌ నెట్‌వర్క్‌లను నిశితంగా పరిశీలిస్తూ..అంతర్జాతీయ కాల్స్‌పై దృష్టిపెట్టారు.  

ఉగ్రవాదుల దాడుల్లో ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు (ఓజీడబ్ల్యూ) కీలకంగా వ్యవహరిస్తారు. వీరు స్థానికంగా ఉంటూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తారు. వారికి అవసరమైన నగదు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వ్యక్తి కూడా ఓజీడబ్ల్యూగా పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి అండతోనే హిజాబ్‌ ఉల్‌ ముజాహిదీన్‌, జైష్‌ ఎ మహ్మద్‌ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. జీ20 సదస్సు నేపథ్యంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఫరూక్‌ అహ్మద్‌ వనీని భద్రతాబలగాలు ముందస్తుగా అరెస్టు చేశాయి. తాజాగా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని