Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్‌ మజుందార్‌ షా

Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా వెల్లడించారు.

Updated : 18 Mar 2024 12:13 IST

దిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌ ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల (Electoral Bonds) ద్వారా విరాళాలివ్వలేదని కంపెనీ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా (Kiran Mazumdar Shaw) సోమవారం వెల్లడించారు. అయితే, తాను వ్యక్తిగత హోదాలో కొన్ని బాండ్లను కొనుగోలు చేసి మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌ సహా మరికొన్ని పార్టీలకు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారాలకు చట్టబద్ధమైన సొమ్ముతో నిధులను సమకూర్చాలనే విధానం కింద నామమాత్రపు విరాళాలు అందజేసినట్లు చెప్పారు.

గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్టోరల్‌ బాండ్ల  (Electoral Bonds) ద్వారా కిరణ్‌ మజుందార్‌ ప్రతినెలా రూ.5 కోట్ల విరాళమిచ్చారని ఇటీవల ‘ఎక్స్‌’లో ఓ యూజర్‌ పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె ‘మీ లెక్కలు తప్పు’ అని సమాధానమిచ్చారు. మరోసారి గణించాలని కోరారు. దీంతో ఆమె మొత్తం రూ.6 కోట్లు ఇచ్చినట్లు మరో యూజర్‌ తెలియజేశాడు. అయితే, ఇతర మాధ్యమాల ద్వారా ఏమైనా ఇచ్చి ఉంటే వెల్లడించాలన్నాడు. ‘‘నేనెప్పుడూ పారదర్శకంగా ఉంటా. మీరు చూస్తున్నది మాత్రమే నిజం’’ అంటూ పరోక్షంగా తాను రూ.6 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ధ్రువీకరించారు.

సింహభాగం భాజపాకే..

ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న వాటి వివరాలను ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. భాజపాకు మొత్తంమీద రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు తెలిపింది. మొత్తం రాజకీయ పార్టీలకు లభించిన వాటిలో దీనికి 66 శాతం దక్కాయి. కాంగ్రెస్‌కు రూ.1,864.45 కోట్లు అందాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.1,494.28 కోట్లు, భారాస రూ.1,408.20 కోట్ల మేరకు విరాళాలు అందుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని