Lakshadweep: జిన్నా కుట్రను బద్దలు కొట్టి.. లక్షద్వీప్‌ను భారత్‌లో కలిపిన పటేల్‌

లక్షద్వీప్‌ను భారత్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఎంతగానో కృషి చేశారు.

Updated : 11 Jan 2024 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ప్రపంచంలో ఏ దేశానికైనా సముద్ర ఆధిపత్యం అపరిమిత శక్తిని ఇస్తుంది. భారత్‌కు మూడు వైపులా సముద్రం ఉండటం అంతర్జాతీయ వేదికపై భౌగోళికంగా, రాజకీయంగా రాణించేందుకు దోహదపడుతోంది. అండమాన్, లక్షద్వీప్‌ (Lakshadweep)లు భారత్‌కు వ్యూహాత్మక స్థావరాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రెండు దీవుల సమూహాలను భారత్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ (Sardar Vallabhbhai Patel) ఎంతగానో కృషి చేశారు.

1947 ఆగస్టు 15న భారత్‌, పాకిస్థాన్‌లుగా రెండు దేశాలు అవతరించాయి. దేశీయంగా అనేక సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యేదే లేదని భీష్మించాయి. పటేల్‌ రంగంలోకి దిగి, ఒక్కొక్క సంస్థానాన్ని విలీనం చేయడంలో తలమునకలుగా ఉన్నారు. అదే సమయంలో జిన్నా ‘లక్షద్వీప్‌’పై కన్నేశాడు. పాక్‌ తీరం నుంచి అది చాలా దూరంలో ఉంది. భారత్‌లోని మలబార్‌ తీరానికి సమీపంలో ఉంది. ఈ అంశం ఆధారంగా భారత్‌లోనే ఉండాలని పటేల్ తీర్మానించారు.

నిమిషానికి 11 ఓడలు.. భారత్‌ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!

జిన్నా కూడా వేగంగా పావులు కదపడం మొదలుపెట్టాడు. పాక్‌ నౌకాదళాన్ని అక్కడకు వెళ్లమని ఆదేశాలు ఇచ్చాడు. దీన్ని పసిగట్టిన పటేల్‌.. మన నౌకాదళానికి చెందిన కొందరు సిబ్బందిని లక్షద్వీప్‌ వెళ్లమని ఆదేశించారు. వెంటనే మన వాళ్లు అక్కడకు చేరుకున్నారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కొద్దిరోజుల తరువాత అక్కడకు చేరుకున్న పాక్‌ నౌకాదళం భారత జాతీయ జెండాను చూసి వెనక్కు జారుకుంది.

మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా..

అనంతరం లక్షద్వీప్‌ను మద్రాస్‌ ప్రెసిడెన్సీలో విలీనం చేశారు. 1956లో కొత్తగా ఏర్పాటు చేసిన కేరళ రాష్ట్రంలో కలిపారు. అదే ఏడాది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1971లో లక్షద్వీప్‌గా పేరు మార్చారు. అంతకు ముందు లక్కదీవ్‌, మినికోయ్‌, అమిన్‌ దీవిగా వ్యవహరించేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని