PM Modi: ఆ అర్ధరాత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఫోన్‌ను నిరాకరించిన మోదీ

PM Modi - Imran Khan: 2019లో జరిగిన పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్‌, పాక్‌ మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి? భారత దౌత్య నీతితో పాక్‌ ఎలా భయపడింది? ఉగ్రవాదంపై తమ విధానాలను ఎలా మార్చుకోవాల్సి వచ్చింది? వంటి వివరాలను భారత మాజీ హై కమిషనర్‌ తన పుస్తకంలో వెల్లడించారు.

Updated : 08 Jan 2024 11:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: 2019లో భారత (India) వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను దాయాది పాకిస్థాన్‌ (Pakistan) బంధించి చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేశాయి. ఈ క్రమంలోనే నాటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM modi)తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారట. అందుకు మోదీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాక్‌కు భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా ఈ విషయాన్ని తన పుస్తకంలో బయటపెట్టారు.

భారత్‌, పాక్‌ మధ్య దౌత్య సంబంధాలపై ఆయన రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి? భారత దౌత్య నీతితో పాక్‌ ఎలా భయపడింది? ఉగ్రవాదంపై తమ విధానాలను ఎలా మార్చుకోవాల్సి వచ్చింది? వంటి అంశాలను అందులో పేర్కొన్నారు. వీటిల్లో కొన్నింటిని ఓ జాతీయ మీడియా సంస్థ తమ కథనంలో వెల్లడించింది.

‘‘ఫిబ్రవరి 27న అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ బంధించిన తర్వాత భారత్‌ తీవ్రంగా స్పందించింది. దాయాదిపైకి 9 క్షిపణులతో సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాక్‌ తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్‌కు అప్పటి పాక్ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. ‘ఇమ్రాన్‌ ఖాన్‌.. మోదీతో ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను వెంటనే దిల్లీలోని అధికారులకు సమాచారమిచ్చాను. అప్పుడు ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోదీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు. పాక్‌కు ఏదైనా అత్యవసరమైతే హైకమిషనర్‌ (నా) తోనే మాట్లాడాలని చెప్పాలని సూచించారు. ఆ తర్వాత పాక్‌ అధికారులు మళ్లీ నాతో సంప్రదించలేదు’’ అని అజయ్‌ తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

‘‘ఈ పరిణామాల తర్వాత కొన్ని రోజులకు ఇమ్రాన్‌ ఖాన్‌ అత్యంత సన్నిహితుడు ఒకరు నన్ను సంప్రదించారు. ఆ ఏడాది కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌ మధ్య భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఉగ్రవాద కట్టడిపై వారి విధానాలను ఖాన్‌.. మోదీకి వివరించి సర్దిచెప్తారని చెప్పారు. కానీ ఆ భేటీకి ప్రధాని హాజరుకాలేదు’’ అని అజయ్‌ వెల్లడించారు.

అభినందన్‌ వర్ధమాన్‌ను విడిపించుకునేందుకు పాక్‌వైపు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్‌ ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, దాని వల్లే అప్పటి ఖాన్‌ ప్రభుత్వం భయపడిందని అజయ్‌ తన పుస్తకంలో వివరించారు. 2019లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘‘అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టి మంచి పని చేసింది. లేదంటే వారు భయంకరమైన రాత్రిని చవిచూడాల్సి వచ్చేది’’ అని అన్నారు.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు భీకర దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా బాలాకోట్‌లో ఉగ్రశిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు చేపట్టింది. బాలాకోట్‌ ఘటన జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాక్‌ వైమానిక దళం ఎఫ్‌-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించగా.. వింగ్‌ కమాండర్‌గా ఉన్న అభినందన్‌ మిగ్‌-21 విమానంతో వెంటాడి దాన్ని నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో కిందకు దూకగా.. ఆయన పాక్‌ భూభాగంలో పడ్డారు. ఆయనను పాక్‌ జవాన్లు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్‌ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు