Period leave: నెలసరి వైకల్యం కాదు: పిరియడ్ లీవ్‌పై స్మృతి ఇరానీ వ్యాఖ్య

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు నెలసరి సెలవులు(menstrual leave) ఇస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని మహిళా ఉద్యోగులకు ఈ సెలవులు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా మరోసారి స్మృతి ఇరానీ(Smriti Irani) స్పందించారు. 

Updated : 14 Dec 2023 10:52 IST

దిల్లీ: మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు(menstrual leave) ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) వ్యతిరేకించారు. రాజ్యసభలో ఎంపీ మనోజ్‌ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. 

‘మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. ఆమె జీవితంలో అదొక సహజ ప్రక్రియ. ఈ నెలసరి సెలవులు (menstrual leave ).. పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చు’ అని ఇరానీ(Smriti Irani) వెల్లడించారు. అలాగే నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని తెలిపారు. అలాగే 10-19 ఏళ్ల  అమ్మాయిల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నెలసరి శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న ‘ప్రమోషన్ ఆఫ్ మెన్‌స్ట్రువల్ హైజీన్‌ మేనేజ్‌మెంట్(ఎంహెచ్‌ఎం) స్కీమ్’ గురించి ప్రస్తావించారు.

Period Leave: ఎక్కడ.. ఎన్ని రోజులు?!

ఈ సెలవు అంశంపై సోమవారం పార్లమెంట్‌లో ఒక నివేదిక ప్రవేశ పెట్టారు. దానిని ఆరోగ్యశాఖ సమీక్షించాల్సి ఉంది. ఈ క్రమంలోనే మంత్రి స్పందించారు. కొద్దిరోజుల క్రితం కూడా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానం ఇస్తూ.. ‘అన్ని సంస్థల్లో వేతనంతో కూడిన నెలసరి సెలవు(menstrual leave)ను తప్పనిసరిగా ప్రకటించాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో లేవు. రుతుస్రావం అనేది స్త్రీలలో ఒక శారీరక ప్రక్రియ. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా నయంచేసుకోవచ్చు’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని