నర్సుతో ప్రధాని ఏం మాట్లాడారంటే..?

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దిల్లీ ఎయిమ్స్‌లో కరోనా టీకా వేయించుకున్నారు.

Updated : 01 Mar 2021 12:38 IST

టీకా తీసుకున్నాక కొద్దిసేపు ముచ్చటించిన మోదీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దిల్లీ ఎయిమ్స్‌లో కరోనా టీకా వేయించుకున్నారు. అర్హులందరూ టీకా తీసుకోవాలంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తనకు టీకా ఇచ్చిన నర్సుతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడే మరో నర్సు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేదా ఆయన టీకా ఇవ్వగా..కేరళకు చెందిన నర్సు రోశమ్మ అనిల్ కూడా ఆ సమయంలో పక్కనే ఉన్నారు. 

నివేదా మాట్లాడుతూ..సర్(మోదీ)కి భారత్‌ బయోటెక్ టీకా కొవాగ్జిన్‌ను అందించామని తెలిపారు. ‘సర్‌కి మొదటి డోసు ఇచ్చాము. 28 రోజుల తరవాత రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఆమె అన్నారు. ‘టీకా తీసుకున్న అనంతరం ప్రధాని మాతో ముచ్చటించారు. ‘అప్పుడే పూర్తయిందా? నొప్పి కూడా తెలియలేదు’ అంటూ సర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తరవాత మా స్వస్థలం వివరాలు అడిగి తెలుసుకున్నారు’ అని వివరించారు. మూడు మూడు సంవత్సరాలుగా దిల్లీ ఎయిమ్స్‌లో పనిచేస్తోన్న ఆమె.. ప్రస్తుతం టీకా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘పై అధికారులు నన్ను పిలిచి.. ప్రధాని మోదీ ఈ రోజు టీకా వేయించుకోవడానికి వస్తున్నారని చెప్పారు. ఈ రోజు ఉదయం వరకు నాకు ఆ విషయం తెలియదు. ఆయన్ను కలుసుకోవడం గొప్ప అనుభవం’ అంటూ ప్రధానికి టీకా అందించడంపై నివేదా ఆనందాన్ని వ్యక్తం చేశారు.  కేరళకు చెందిన రోశమ్మ మాట్లాడుతూ..‘మంచి అనుభవం. సర్ చాలా సౌకర్యంగా ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ రోజు దేశవ్యాప్తంగా రెండో దశ టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల వయస్సులోపున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీని మొదలుపెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని