Salaar: ‘సలార్‌’లో నాకంటే పెద్ద విలన్‌ ఉన్నాడా?.. అనుకున్నా: జగపతి బాబు

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’. ఇందులో విలన్‌గా నటించిన జగపతి బాబు పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 22 Dec 2023 02:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘సలార్‌’ (Salaar)లో నాకంటే పెద్ద విలన్‌ ఉన్నాడా..? అని అనుకున్నా’’ అని నటుడు జగపతి బాబు (Jagapathi Babu) అన్నారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఆ సినిమాలోని ‘ఖాన్సార్‌’ కాన్సెప్ట్‌ చెప్పినప్పుడు ఆ సందేహం కలిగిందని చెప్పారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన ఈ పాన్‌ ఇండియా సినిమాలో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రం డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ సంగతులేంటో ఆయన మాటల్లోనే..

15 ఏళ్ల క్రితమే బీజం పడింది.. ‘సలార్‌’ గురించి ఈ విశేషాలు తెలుసా?

‘‘మీ దర్శకత్వంలో నటించాలని ఉందని ప్రశాంత్‌ నీల్‌కు చెబుతుండేవాడిని. దాన్ని గుర్తుపెట్టుకున్న ఆయన ఓ రోజు ఫోన్‌ చేసి ‘సలార్‌’లో ప్రతినాయకుడి పాత్ర గురించి చెప్పారు. ఇందులో నేను పోషించిన రాజమన్నార్‌ పాత్ర తీరు, లుక్‌ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో.. ఖాన్సార్‌ అనే కోటను మనిషిలా భావించడమనే కాన్సెప్ట్‌ నన్ను ఆకట్టుకుంది. అయితే, ఖాన్సార్‌ గురించి తొలిసారి విన్నప్పుడు అతడెవరు? ఈ సినిమాలో నాకంటే పెద్ద విలన్‌ ఉన్నాడా? అని అనుకున్నా. ఖాన్సార్‌కు నేనే రాజునని తర్వాత తెలిసింది. ప్రభాస్‌కు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఇలాంటి వారు అరుదు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అద్భుతమైన నటుడు. దర్శకుడు ప్రశాంత్‌, ఛాయాగ్రాహకుడు భువన్‌ గౌడ ఎంత పెద్ద సన్నివేశమైనా సింగిల్‌ షాట్‌లోనే తీస్తారు. వాళ్లు చెప్పింది నటులు ఫాలో అయితే చాలు అవుట్‌ పుట్‌ బాగుంటుంది. ‘సలార్‌’ పార్ట్‌ 2లో నా క్యారెక్టర్‌ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నా’’ అని జగపతి బాబు పేర్కొన్నారు.

‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సినిమానే ‘సలార్‌’. శ్రుతి హాసన్‌ (Shruti Haasan), ఈశ్వరీ రావు, టీనూ ఆనంద్‌, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. శత్రువులుగా మారే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని