ఈ సీరియ‌స్ పాత్ర స‌వాలు విసిరింది: ప్రియ‌ద‌ర్శి

 ప్రియ‌ద‌ర్శి త‌న‌లో దాగి ఉన్న మ‌రో కోణాన్ని ప‌రిచ‌యం చేసేందుకు ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్‌లో న‌టించాడు. విద్యా సాగ‌ర్ ముత్తుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సిరీస్ జూన్ 18 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది.

Updated : 30 Aug 2022 14:58 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్రియ‌ద‌ర్శి పేరు చెప్ప‌గానే ‘పెళ్లి చూపులు’ చిత్రంలోని ‘నా సావు నేను చ‌స్తా నీకెందుకు’ అనే సంభాష‌ణే గుర్తొస్తుంది తెలుగు ప్రేక్ష‌కుల‌కి. ఈ ఒక్క డైలాగ్‌తోనే హాస్య న‌టుడిగా టాలీవుడ్‌లో త‌నదైన ముద్ర వేశాడు. అలా అని ప్రియ‌ద‌ర్శి కామెడీ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాలేదు. ‘మ‌ల్లేశం’ చిత్రంతో క‌థానాయ‌కుడిగా మారాడు. ప‌లు వెబ్ సిరీసుల్లోనూ సంద‌డి చేశాడు. అయినా ఏదో వెలితిగా భావించిన ప్రియ‌ద‌ర్శి త‌న‌లో దాగి ఉన్న మ‌రో కోణాన్ని ప‌రిచ‌యం చేసేందుకు ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్‌లో న‌టించాడు. విద్యా సాగ‌ర్ ముత్తుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సిరీస్ జూన్ 18 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ప్రియ‌ద‌ర్శి పంచుకున్న విశేషాలు మీ కోసం..

* ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐ.ఎన్‌.జి) నేప‌థ్యం ఏంటి?

ఇదొక క్రైమ్ డ్రామా. ఓ మంచి వ్య‌క్తి చెడ్డ‌వాడిగా మారేందుకు ప‌రిస్థితులు ఎలా ప్ర‌భావం చూపుతాయో ఇందులో చూడొచ్చు. ఏడు ఎపిసోడ్ల‌తో ఈ సిరీస్ సాగుతుంది.

*  మీ పాత్ర గురించి ఏం చెప్తారు?

‘పెళ్లి చూపులు’ సినిమా నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన ‘జాతి ర‌త్నాలు’ వ‌ర‌కు ఎక్కువ‌గా కామెడీ పాత్ర‌ల్లోనే న‌టించాను. ఐ.ఎన్‌.జి సిరీస్ ద్వారా నాలోని విభిన్న కోణాన్ని బ‌య‌ట‌పెట్టే అవ‌కాశం ల‌భించింది. ఇప్ప‌టి వ‌ర‌కు నేను ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు.

* కామెడీ టైమింగ్‌లో మీకు మంచి పేరుంది. మ‌రి ఈ సిరీస్ అందుకు భిన్నం క‌దా?

ఈ సిరీస్‌లో నేను ఆది అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. ‘నా జీవితంలో పోగొట్టుకునేందుకు ఇంకా ఏం మిగిలి లేదు’ అని నిర్ణ‌యించుకున్న వ్య‌క్తి ఆది. ఇలాంటి వైవిధ్య‌భ‌రిత పాత్ర‌ని పోషించ‌డం నాకొక పెద్ద స‌వాలు అనిపించింది. అలాంటి వ్య‌క్తుల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు స‌మాజంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌నల్ని, సంబంధిత వార్త‌ల్ని ప‌రిశీలించాను. సీరియ‌స్‌గా క‌నిపించేందుకు ఓ న‌టుడిగా నా వంతు ప్ర‌య‌త్నం చేశాను. ఈ సిరీస్‌లో యాక్ష‌న్‌తోపాటు త‌గినంత రొమాన్స్ ఉంటుంది.

* మీకు ఇష్ట‌మైన మాధ్య‌మం.. సినిమా లేదా వెబ్ సిరీస్‌?

ఇష్టం అంటూ ఏం లేదు. ఆయా మాధ్య‌మానికి త‌గ్గ‌ట్టు న‌టించేందుకు సిద్ధంగా ఉంటాను. క‌థ చెప్పే విధానం మిన‌హా సినిమాకి, వెబ్ సిరీస్‌కి మ‌ధ్య వ్య‌త్యాసం నాకు క‌నిపించ‌లేదు. ఈ రెండు మాధ్య‌మాల్లోనూ ప్రేక్ష‌కులు న‌న్ను అంగీక‌రిస్తార‌ని భావిస్తున్నాను. ఓ న‌టుడిగా నాలోని విభిన్న కోణాల్ని ఆవిష్క‌రించే అవ‌కాశాల్ని వ‌దులుకోను. ఎప్ప‌టిలానే నాకు బాగా న‌చ్చిన కామెడీ పాత్ర‌ల్ని చేస్తుంటాను.

* ద‌ర్శ‌కుడు సురేశ్ కృష్ణ ఈ సిరీస్‌ని నిర్మించారు. ఆయ‌న‌తో ప్ర‌యాణం ఎలా సాగింది?

నిర్మాత‌గా ఆయ‌న‌కు ఉన్న విజ‌న్‌, స్ప‌ష్ట‌త న‌న్ను ఆశ్చ‌ర్యంలో ప‌డేసింది. ఆయ‌న‌తో ప్ర‌యాణం ఎంతో ఆస‌క్తిక‌రం.

* త‌దుప‌రి ప్రాజెక్టులు?

త్వ‌ర‌లోనే ‘లూస‌ర్ 2’ వెబ్ సిరీస్ ప్రారంభం కానుంది. సుశాంత్ హీరోగా తెర‌కెక్కిన ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’, శ‌ర్వానంద్‌తో క‌లిసి న‌టించిన ఓ సినిమా విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి. ప్ర‌భాస్‌తో న‌టిస్తోన్న‌ ‘రాధేశ్యామ్’ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇందులో మంచి కామెడీ పాత్ర పోషిస్తున్నాను. మ‌రికొన్ని క‌థ‌లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని