ఆ ప్రభావం వీళ్లపై లేదు!! 

కొందరు కథానాయికలు వెండితెరపై అలా మెరిసి ఇలా కనుమరుగవుతారు. మరికొందరు ఏళ్లు గడిచినా అగ్ర నాయికలా కొనసాగుతుంటారు.

Updated : 24 Mar 2021 10:58 IST

హవా కొనసాగిస్తున్న నాయికలు

కొందరు కథానాయికలు వెండితెరపై అలా మెరిసి ఇలా కనుమరుగవుతారు. మరికొందరు ఏళ్లు గడిచినా అగ్రస్థానంలో కొనసాగుతుంటారు. ఒక్క భాషకే పరిమితం కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ హవా చూపుతుంటారు. ఫేడ్‌ ఔట్‌ అనే పదానికి మేం దూరమంటూ.. వయసు ప్రభావం మా మీద లేదంటూ ఆశ్చర్యంలో పడేస్తారు. ఈ జాబితాలో నిలిచిన భామలపై ఓ లుక్కేద్దాం...

వన్నె తరగని తార.. నయన్‌

ఈ విషయంలో అందరి కంటే ముందుంటుంది నయనతార. ‘మనస్సినక్కరే’ అనే మలయాళ చిత్రంతో 2003లో నటిగా మారిన నయన్‌ 2006లో వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మి’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇన్నేళ్లయినా అత్యధిక పారితోషకం అందుకుంటూ.. ఇటు తెలుగు అటు తమిళ చిత్రాలతో బిజీగా ఉంటోంది.  ప్రస్తుతం తమిళంలో ‘కాతువాకుల రెండు కాదల్‌’ చిత్రంతోపాటు పలు ప్రాజెక్టులకు సంతకం చేసిందామె. గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నాయికా ప్రాధాన్య చిత్రాల్లోనూ నటించి తనదైన ముద్ర వేస్తోంది.

స్వీటీ ఎప్పుడూ సూపర్‌

నాగార్జున కథానాయకుడిగా 2005లో వచ్చిన ‘సూపర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అనుష్క శెట్టి.  నటిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ అనతి కాలంలోనే అగ్ర నాయిక జాబితాలో చేరింది. ‘అరుంధతి’తో నాయికా ప్రాధాన్య కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారడమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని రూపొందించేందుకు దర్శక-నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది. ఇటీవలే ‘నిశ్శబ్దం’ చిత్రంతో అలరించిన స్వీటీ మరో రెండు తెలుగు చిత్రాలు ప్రకటించనుందని సమాచారం.

కలర్‌తో కట్టిపడేసే నటి మిల్క్‌ బ్యూటీ..

‘చాంద్‌ సా రోషన్‌ చెహ్రా’ అనే హిందీ చిత్రంతో 2005లో తెరంగ్రేటం చేసింది తమన్నా. అదే ఏడాది తెలుగులో ‘శ్రీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ‘హ్యాపీడేస్‌’ చిత్రం తర్వాత తమన్నా కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. నాయికగా కొనసాగుతూనే ప్రత్యేక గీతాల్లో నర్తించి కేక పెట్టించిందీ బ్యూటీ. గత పదిహేనేళ్లుగా విభిన్న పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ స్టార్‌ కథానాయికగానే వెలుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘సీటీమార్‌’, సత్యదేవ్‌ సరసన ‘గుర్తుందా శీతాకాలం’లో నటిస్తుంది. నితిన్‌ హీరోగా రూపొందుతున్న ‘అంధాదున్‌‌’ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.

వెండితెర చందమామ

2004లో ‘క్యూ హో గయా నా’ అనే హిందీ చిత్రంలోని ప్రత్యేక పాత్రతో తన నట ప్రస్థానం మొదలు పెట్టింది కాజల్‌ అగర్వాల్‌.  లక్ష్మిగా 2007లో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. ‘చందమామ’ చిత్రంలోని నటనకు ప్రశంసలు అందుకుంది. ‘మగధీర’తో టాప్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ‘మోసగాళ్లు’ చిత్రంతో సందడి చేసిన కాజల్‌.. ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ సరసన ‘భారతీయుడు 2’, నాగార్జున, ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది.

తొలి చూపులోనే ఇష్టంగా మారింది

2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది శ్రియ. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు పోషించింది. యువ కథానాయకులు, అగ్ర కథానాయకులందరితోనూ నటించిన పేరుంది శ్రియకు. కొన్ని చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి కనువిందు చేసింది. మధ్యలో ‘పవిత్ర’ అనే నాయికా ప్రాధాన్య చిత్రాన్ని చేసింది. చాలా కాలం తర్వాత ‘మనం’ చిత్రంతో ఫామ్‌లోకి వచ్చింది. పెళ్లైనా తన క్రేజ్‌ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. ‘గమనం’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అతిథిగా దర్శనమివ్వబోతుంది.

ప్రియమైన ప్రియమణి..

‘ఎవరే.. అతగాడు’ అంటూ 2003లో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ప్రియమణి. నటనకు ప్రాధాన్యమున్న కథలు ఎంపిక చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ ప్రారంభించి ఇన్నేళ్లయినా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’లో ఓ కీలక పాత్రలో, వెంకటేష్‌ కథానాయకుడుగా వస్తున్న ‘నారప్ప’లో నాయికగా అలరించేందుకు సిద్ధమైంది.

త్రిష..

1999లో నటిగా మెరిసింది త్రిష. ‘జోడీ’ చిత్రంతో ఆ అవకాశం అందుకుంది. ‘నీ మనసు నాకు తెలుసు’తో నాయికగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో దర్శనమిచ్చి స్టార్‌ కథానాయికగా మారింది. ‘ఆచార్య’లో నాయికగా ఎంపికైనా వ్యక్తిగత కారణాలతో ఆ చిత్రం నుంచి తప్పుకొంది. ప్రస్తుతం ‘పొన్నియన్‌ సెల్వన్‌’తో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

పండులాంటి నాయిక హన్సిక..

2003లో బాలనటిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన హన్సిక ‘దేశ ముదురు’తో 2007లో టాలీవుడ్‌లో కాలుమోపింది. తొలి సినిమాతోనే యువతను ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ప్రేమ కథల్లో నటిస్తూ యువకుల కలల రాణిగా మారింది.  ప్రస్తుతం ‘మహా’ అనే తమిళ చిత్రం చేస్తోంది.

ఇలియానా ..

‘దేవదాసు’ చిత్రంతో 2006లో కథానాయికగా కెరీర్‌ ప్రారంభించింది ఇలియానా. తర్వాత ‘పోకిరి’తో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకొంది. తొలినాళ్ల నుంచి  తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ గోవా బ్యూటీ కాస్త విరామం ఇచ్చి.. ‘ది బిగ్‌ బుల్‌’, ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ చిత్రాలతో బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని