Adah Sharma: ఆ ఇంటిని కొనుగోలు చేశారా..? అదాశర్మ ఏమన్నారంటే..

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)తో ఇటీవల కాలంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి అదాశర్మ (Adah Sharma). కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ యువ నటుడి ఇంటిని ఆమె కొనుగోలు చేసినట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 06 Apr 2024 11:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) ఇంటిని నటి అదాశర్మ (Adah Sharma) కొనుగోలు చేశారంటూ కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. సరైన సమయం వచ్చిన్నప్పుడు తప్పకుండా మాట్లాడతానని చెప్పారు.

‘‘ప్రస్తుతానికి నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. విషయం ఏదైనా సరే మాట్లాడటానికి ఒక సరైన సమయం అంటూ ఉంటుంది. ఆ ఇల్లు చూడటానికి వెళ్లినప్పుడు మీడియా నాపై ఎంతో ఫోకస్‌ పెట్టింది. అందుకు నేను సంతోషిస్తున్నా. వ్యక్తిగతంగా నేనొక ప్రైవేట్‌ పర్సన్‌ని. ఈ భూమ్మీద లేని ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడటం సమంజసం కాదు. ఆయన గొప్ప చిత్రాల్లో నటించారు. ఆయన గౌరవాన్ని కాపాడటం నా ముఖ్య ఉద్దేశం. మరణించిన వ్యక్తిపై కామెంట్లు చేయడం సరైన పద్ధతి కాదు’’ అని ఆమె అన్నారు.

‘హార్ట్‌ ఎటాక్‌’తో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు నటి అదాశర్మ. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘గరం’, ‘క్షణం’, ‘కల్కి’ చిత్రాల్లో నటించారు. గతేడాది విడుదలైన ‘కేరళ స్టోరీ’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదా నటిస్తోన్న ‘ది గేమ్ ఆఫ్ గిర్గిత్’ ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

‘ఎం.ఎస్‌.ధోనీ’, ‘రబ్తా’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘ఛిఛోరే’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2020 జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల మానసిక కుంగుబాటుకు గురి కావడంతోనే ఆయన మృతి చెందారని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని