Akshay Kumar: నా పాస్‌పోర్ట్‌ చూడగానే మోదీ పేరు చెబుతారు..

భారతీయ పౌరసత్వం పొందడం ఎంతో ఆనందంగా ఉందని నటుడు అక్షయ్‌ కుమార్‌ అన్నారు. కెనాడా పౌరసత్వం వదులుకోవడం గురించి కూడా ఆయన తాజాగా ప్రస్తావించారు.

Published : 13 Oct 2023 12:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)కు ఇటీవలే భారతీయ పౌరసత్వం (Indian Citizenship) లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ పౌరసత్వాన్ని పొందినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు.

గతంలో తాను కలిగి ఉన్న కెనడా పౌరసత్వం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను తీసిన 14 సినిమాలు వరుసగా ప్లాప్‌ అయ్యాయి. దీంతో కెనడాలో ఉంటున్న నా స్నేహితుడి అక్కడకు వచ్చేయాలని విజ్ఞప్తి చేశాడు. అప్పటికే  ఇంకా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా ప్రేక్షకాదరణ పొందవనుకొని కెనడా వెళ్లిపోయాను. అక్కడకు వెళ్లిన కొన్ని రోజులకే నాకు కెనడా పౌరసత్వం వచ్చింది. అయితే, నేను అక్కడకు వెళ్లాక విడుదలైన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో నాకు ఆఫర్లు వచ్చాయి. అందుకే మళ్లీ భారత్‌కు వచ్చేశాను.  కెనడా వదిలి ఇక్కడకు వచ్చి కూడా 9 ఏళ్లు అవుతోంది. ఇక్కడి పౌరసత్వం తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆగస్టు 15న అది లభించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే, భారత్‌ పాస్‌పోర్టును కలిగి ఉండడం కూడా గొప్ప విషయం. అది కేవలం ఒక ట్రావెలింగ్‌ డాక్యుమెంట్ మాత్రమే కాదు.. నాకు ఆత్మతో సమానం. దాన్ని చూసినప్పుడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. నేను దీన్ని ఇమ్మిగ్రేషన్ ఆఫీస్‌లో చూపగానే వారంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ‘ఓహ్‌.. ఇండియన్‌.. బాలీవుడ్‌.. మోదీ..’ అని అంటారు. నేనెవరో కూడా వారికి తెలీదు. కానీ, నా పాస్‌పోర్ట్‌ చూడగానే ఎంతో గౌరవిస్తారు. దాన్ని కలిగి ఉండడం నేనెంతో గర్వంగా భావిస్తాను’’ అని చెప్పారు. అలాగే తాను గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో ఒకడిగా ఉన్నానని అక్షయ్‌ గుర్తుచేసుకున్నారు.   

రివ్యూ: ‘గాడ్‌’.. క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఓమైగాడ్‌2’ సినిమాతో విజయాన్ని అందుకున్న అక్షయ్‌.. తాజాగా ‘మిషన్‌ రాణిగంజ్‌’(Mission Raniganj)తో పలకరించారు. అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు