Amit Tiwari: నా విలనిజం చూసి నోటితో చెప్పలేని తిట్లు తిట్టారు..: అమిత్‌ తివారి

సాధారణ స్థితి నుంచి చలనచిత్ర రంగంలో తమకంటూ ప్రత్యేకతను నిలుపుకొన్న నటులు వాళ్లు..ఒకరికి నటన తెలియక ముందే సినిమాల్లో అవకాశం రావడమే కాదు..దేశంలోని పలు భాషల్లో నటించే వీలు చిక్కింది. 

Updated : 06 Apr 2022 10:39 IST

రెండేళ్లు సీరియళ్లలో నటించొద్దన్నారు.. అలీరెజా

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణ స్థితి నుంచి చలనచిత్ర రంగంలో తమకంటూ ప్రత్యేకతను నిలుపుకొన్న నటులు వాళ్లు.. ఒకరేమో నటన అంటే తెలియక ముందే సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. మరొకరు బిగ్‌బాస్‌లో ఉండగానే అగ్ర కథానాయకుడు నాగార్జునతో నటించే ఛాన్స్‌ కొట్టేశారు. బుల్లితెర, వెండితెరపై సత్తా చాటుతున్న నటులు అలీరెజా, అమిత్‌ తివారి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..!

ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అయ్యింది..? మొదటి సినిమా హీరో ఎవరు?

అమిత్‌ తివారి: దాదాపుగా 18 ఏళ్లు పూర్తయ్యింది. యాక్టింగ్ చేద్దామా..? అని ఆలోచించా. రెండు ఫొటోలు దిగా. అవి అటు ఇటూ తిరిగి హైదరాబాద్‌లో ఓ నిర్మాతకు చేరాయి. ‘ఇతను బాగున్నాడు తీసుకుందామ’నుకున్నారు. ఆ సినిమా ‘నిన్నే ప్రేమించా’. నటన నాకేం తెలియదంటే ‘బాగున్నారు. వచ్చేయండి’ అన్నారు. ఏమీ చేయకుండానే ఛాన్సు వచ్చింది. వాళ్లు చెప్పినట్టు చేశా. కానీ, ఆ సినిమా తర్వాత ఒకటి తెలిసింది. ఏమీ తెలియకుండా చేయకూడదనుకున్నా. వెంటనే ముంబయి వెళ్లి నటన, డ్యాన్సు అన్నీ నేర్చుకున్నా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇప్పుడు భోజ్‌పురి సినిమా కూడా చేస్తున్నా.

ఏంటీ ఈ మధ్య టీవీలో కనిపించడం లేదు..?

అలీరెజా: మీ ముందు(ఆలీ) కూర్చొని మాట్లాడే అవకాశం రెండేళ్ల తర్వాత లభించింది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను బ్యాన్‌ చేశారు. ఎదగాలని నాకు బాగా ఉండేది. అంతా వాళ్లదే తప్పని చెప్పను.. నా తప్పు కూడా ఉంది. అదే నేను ఎదగాలనుకోవడం. టీవీ నాకెంతో ఇచ్చింది. నా లక్ష్యానికి బాటలు వేసింది. నేను నటిస్తున్న సీరియల్‌ వాళ్లు బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి ముందుగా ఒప్పుకోకపోయినా తర్వాత సరే అన్నారు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే ‘వైల్డ్‌డాగ్’ మూవీ వచ్చింది. ‘నాకు సినిమా అవకాశం వచ్చింది. అయినా సీరియల్‌ చేస్తా’ అని వాళ్లకు చెప్పా. అప్పటికే ఆ ధారావాహికను ముగించాలని వాళ్లు అనుకుంటున్నారు. అయినా నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక పెద్ద బ్రాండ్‌ షోరూం ఓపెనింగ్‌ సమయంలో, నాగార్జున గారితో షూటింగ్‌ సమయంలోనే సీరియల్‌ షూటింగ్‌ ఉందని ఒత్తిడి చేశారు. నాకు మరో అవకాశం ఇవ్వకుండానే రెండేళ్లపాటు నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో హార్ట్‌ ఎటాక్‌ వచ్చినంత పనయ్యింది. తట్టుకోలేకపోయా. బిగ్‌బాస్‌లో వచ్చిన డబ్బుతో ఇంటికి అడ్వాన్సు ఇచ్చా. సీరియల్స్‌, సినిమా ఉందనే నమ్మకంతో ఉన్న నాకు రెండేళ్ల నిషేధం కష్టాలు తెచ్చింది. చివరికి దేవుడి దయతో నాకు మంచే జరిగింది. మూడు పెద్ద బ్యానర్లలో నటిస్తున్నా. ‘సెవన్‌’ రిలీజ్‌కు సిద్ధమైంది. పాప పుట్టిన తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది.

మీది పెద్దలు కుదిర్చినా పెళ్లా? ప్రేమ వివాహమా?

అలీరెజా: లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అనుకోవచ్చు. మా ఆవిడ వాళ్ల నాన్న, మా నాన్న ఇద్దరు స్నేహితులు. మా మామ పేరు కూడా అలీనే.  ‘ఆయన కూతురి మొబైల్‌ నంబర్‌ నీకు పంపిస్తారు. ఒకసారి మాట్లాడు’ అని నాన్న అన్నారు. పది రోజుల దాకా నేను ఫోన్‌ చేయలేదు. మా నాన్న అడిగితే ‘నాకే ఫోన్‌ చేయమను.. నేనే ఎందుకు చేయాలి’ అన్నా. గోవాలో ఉన్నప్పుడు చిన్న మేసేజ్‌ పెట్టా. అప్పటి నుంచి ఫోన్‌లో బాగానే మాట్లాడుకున్నాం. ముంబయిలో కలుసుకుందామని చెప్పా. మాటల మధ్యలో గొడవలయ్యాయి. ‘నేను పెళ్లి చేసుకోను పో’ అన్నా. మళ్లీ ఆర్నెల తర్వాత ఫోన్‌ చేశా. తర్వాత పెళ్లి, పిల్లలు అంతా సజావుగా సాగుతోంది.

అమిత్‌ మరి మీ పెళ్లి ఎలా జరిగింది?

అమిత్‌ తివారి: నాది లవ్‌ మ్యారేజ్‌. అమ్మాయిది మంగళూరు. 20 ఏళ్ల స్నేహం. పెళ్లై 13 ఏళ్లు అయ్యింది. మధ్యలో ఏడేళ్లలో ఎన్నో గమ్మత్తు విషయాలు జరిగాయి. ముంబయిలో పిచ్చి చేష్టలు, కోతి ఆటలు ఆడేవాడిని. మా అపార్ట్‌మెంట్‌లోనే ఒక పెళ్లికి ఆమె వచ్చింది. నేనంటే ఆవిడకు పడేది కాదు. నేనంటే ఇష్టం లేదని తెలిసింది. హర్ట్‌ అయ్యా. ఒకరోజు అడిగా. ‘నువ్వు చూడు పిచ్చోడిలా ఆ జుట్టేంటి..? నీ అవతారం చూడు’ అంది. బయటికి మాస్‌లా ఉన్నా నా మనసు సున్నితం.. అది నచ్చిన తర్వాత స్నేహితులమయ్యాం. రెండేళ్ల తర్వాత పెళ్లి. మాకొక బాబు.

మీ సొంతూళ్లు ఏవి?

అమిత్‌ తివారి: మా నాన్నమ్మ హైదరాబాద్‌. తాత యూపీ. వీరిద్దరూ ఒకే ఆఫీస్‌లో పని చేసేవారు. నాన్నమ్మ చాలా అందంగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా నాన్న వ్యాపారవేత్త. మా బ్రదర్‌కు పంజాబీతో, మా పిన్నికి తమిళియన్‌తో పెళ్లి అయ్యింది. మా కుటుంబంలో కుల మతాల పట్టింపు లేదు.

అలీరెజా: పూర్వీకులు ఇరాన్‌. అక్కడి నుంచి వ్యాపార నిమిత్తం ముందుగా ముంబయి.. అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఇరాన్‌లో అందరూ బ్లాక్‌ టీ తాగుతారు. పాలతో తాగరు. ఇరానీవాళ్లు చేయడంతో ఇరానీ చాయ్‌ అయ్యింది. మా తాత, నాన్న ముంబయిలో పుట్టారు. హోటల్‌ బిజినెస్‌ చేయడానికి హైదరాబాద్‌ వచ్చారు. నేను ఇక్కడే పుట్టా. 

మారేడుపల్లిలో చిన్న పిల్లాడిని అడిగినా ఒక బుల్లి అంబానీ అంటారట..?

అలీరెజా: హోటల్‌ మాత్రం మారేడుపల్లిలో ఉంది. చుట్టూ ఏడు కాలేజీలున్నాయి. అంతా అక్కడికే వస్తారు. దోస్తులు చాలా మంది ఉన్నారు. చదువుకోకుండా బిజినెస్‌లోకి వస్తానని ఇంట్లో చెప్పా. ‘హోటల్‌ శేఠ్‌ కొడుకుగా వచ్చి నా సీట్లో కూర్చుంటావా..? చదువుకోవా’ అన్నారు. అలా హోటల్‌ బిజినెస్‌లోకి వచ్చా. నేను హోటల్‌లో అడుగు పెట్టిన కొత్తలో అక్కడ ఏమైనా గొడవ జరిగితే గ్యాంగ్‌ వచ్చేది. ఎవడైనా లొల్లికి వస్తే లోపలి నుంచి వాడి మొహం మీద కప్పు పడ్డట్టే. లేదంటే కర్ర చేతికి వస్తుంది. ఇలా నెలలో నాలుగైదు సార్లు పోలీస్టేషన్‌లో ఉండేవాడిని. మన తెలంగాణ పోలీసులు స్ట్రిక్ట్‌ అయ్యారు. దీంతో చిన్న చిన్న రౌడీలు కూడా కామ్‌ అయ్యారు. 

నిన్ను చూస్తే జనాలు భయపడతారట ఎందుకు..?

అమిత్‌ తివారి: వచ్చి పొడిచేస్తారని, కొట్టేస్తారని భయం. నేను చేసిన క్యారెక్టర్లు అలాంటివే కదా. ‘విక్రమార్కుడు’ ఎఫెక్టు ఇది. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి.

ఒక నిర్మాత భార్య మిమ్మల్ని రాజమౌళి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసింది..? ఆమె ఎవరు..?

అమిత్‌ తివారి: ఆమె గుణ్ణం గంగరాజు భార్య ఊర్మిళ. ఆమె రాజమౌళి గారిని పరిచయం చేశారు. అక్కడి నుంచే నా జీవితం మారిపోయింది. జస్ట్‌ ఎల్లో ప్రొడక్షన్‌ వాళ్లతో ‘అనుకోకుండా ఒక రోజు’  సినిమా చేశా. దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి. ఆ సినిమాలో నా నటన బాగుందని మెచ్చుకున్నారు. ‘రాజమౌళి సార్‌కు కూడా చెప్పండి’ అని నేను అంటే, స్వయంగా తీసుకెళ్లారు. అక్కడ సార్‌ను కలిశా. విక్రమార్కుడిలో చిన్న అవకాశం ఇవ్వాలని కోరా. ‘చూద్దాం’ అన్నారు. తర్వాత ఫోన్‌ చేస్తామన్నారు. వారం తర్వాత ఫోన్‌ వచ్చింది. విక్రమార్కుడులో పాత్ర, డేట్స్‌ అన్నీ చెప్పారు. ముందు నమ్మలేకపోయా. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఆ సినిమా విడుదల తర్వాత మహిళల ఫాలోయింగ్‌ ఎలా ఉంది..?

అమిత్‌ తివారి: మహిళల ఆదరణ ఏ మాత్రం లేదు. నా జీవితంలో పెద్ద ఘటన విక్రమార్కుడు విడుదల తర్వాత జరిగింది. సుదర్శన్‌ 70 ఎంఎంలో రాజమౌళిగారితో కలిసి సినిమాకు వెళ్లా. మా నాన్న కూడా వచ్చారు. వెనక సీట్లో సార్‌ కూర్చున్నారు. ముందు వరసలో మా నాన్నతో కలిసి కూర్చున్నా. సినిమాలో పై నుంచి పడినప్పుడు ఉరి పడటంతో చనిపోతా. ముందు కూర్చున్న పది పదిహేను మంది కుర్రాళ్లు వాళ్ల చేతిలో.. డబ్బులో, చిప్సో తెలియదు.. వాటిని విసిరేసి చెప్పలేని తిట్లు, పచ్చి బూతులు తిట్టారు. వాళ్లను చూసి కిందికి వంగిపోయా. సార్‌ వైపు చూశా. ‘వాళ్లు తిడుతున్నారంటే.. నీ క్యారెక్టర్‌ సక్సెస్‌ అయ్యింది’ అని చెప్పారు. వాళ్లు నిన్ను ఇష్టపడుతున్నారన్నారు. సినిమా అయిపోయేదాకా ఉంటే కొడతారని బయటకు పారిపోయా. కారు దగ్గరకు పరిగెత్తుతున్న సమయంలోనే కొంతమంది యువకులు వచ్చారు. ‘ఏం చేశారు సార్‌’ అంటూ పొగిడారు. కార్లో కూర్చొని జంప్‌ అయ్యా. అదే పాత్ర హిందీ, తమిళ్‌లో చేశా. కన్నడ, బెంగాళీలో చేయలేకపోయా. అన్ని భాషల్లో కలుపుకొని ఇప్పటి వరకూ 200 సినిమాలు చేశా.

మీ డైలాగ్‌ విని ‘అంతొద్దమ్మ.. ఇది చాలు’ అన్న డైరెక్టర్‌ ఎవరు..?

అమిత్‌ తివారి: ఇంకెవరు త్రివిక్రమ్‌ గారు. ‘ఖలేజా’లో జరిగింది. బ్యాంకాక్‌లో ప్రకాశ్‌రాజ్‌తో షాట్‌ ఉంది. ‘ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి’ అని అంటే, ‘నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను. నాకెందుకు పెళ్లి’ అని డైలాగ్‌ చెప్పాలి. మొదటిసారి చెప్పిన తర్వాత మానిటర్‌ వెనక నుంచి సార్‌ ‘అమిత్‌ అంతొద్దు.. తగ్గించు’ అన్నారు.

బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత మీకొచ్చిన పేరుతో మీ నాన్న సంతోషించారా..?

అలీరెజా: మధ్యలో ఒకసారి ఎలిమినేట్‌ అయ్యా. వెంటనే ఇంటికి పంపించరు. ఒకరోజు హోటల్‌లో ఉంచుతారు. ఎపిసోడ్‌ టెలికాస్టు అయిన తర్వాత పంపిస్తారు. అందులో ఎలిమినేట్‌ అయి సూట్‌కేస్‌ తీసుకొని ఇంటికి వెళ్లాలని చెబుతారు. అదే సమయానికి ఇంటికి వెళ్లి బెల్‌ కొట్టా. తలుపు తీసేసరికి నాన్న బాగా ఏడ్చారు. మా నాన్న ఏడవటం ఎప్పుడూ చూడలేదు. మా నాన్నను హగ్ చేసుకున్నా. ఎందుకు ఏడ్చారో అర్థం కాలేదు. కళ్లు తుడుచుకొని నువ్వు హీరో అని మెచ్చుకున్నారు. 

నటించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక స్టార్‌ హీరో చెప్పారట. ఎవరాయన?

అమిత్‌ తివారి: ‘విక్రమార్కుడు’ సమయంలో రవితేజ గారు చాలా జాగ్రత్తలు చెప్పారు. ఓ సీన్‌లో కడుపు మీద పంచ్‌ ఇస్తే పడిపోవాలి. ఆ సమయంలో పొట్ట చూశారు. ప్యాడ్‌ పెట్టనందుకు యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అలా ఎందుకు అన్నారో నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత కారవ్యాన్‌లోకి తీసుకెళ్లారు. ‘నీకేమైనా పిచ్చా.. ఇలాగే దెబ్బ తగిలి తమిళంలో ఒకరు చనిపోయారు. నీకేమైనా అయితే ఎవరూ రారు. నీ జాగ్రత్తలు నీవే తీసుకోవాలి’ అని హితబోధ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న షాట్‌ ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటా. 

నీలో ఓ స్పెషల్‌ ఉందని విన్నాను. నిజమేనా..?

అమిత్‌తివారి: నిజమే. విజిల్‌ బాగా వేస్తా. చిన్నప్పటి నుంచి అలవాటు. విచిత్రసోదరులు సినిమాలోని పాటంటే చాలా ఇష్టం..ఓ సారి కమలహాసన్‌గారి ముందు కూడా పాడాను. 

జాకీష్రాఫ్‌ మీకు పరిచయమట ఎలా?

అలీరెజా: మా నాన్న, ఆయన క్లాస్‌మేట్స్‌. చిన్నప్పటి స్నేహితులు. అలా పరిచయం.

మీకొచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంటు ఏది..?

అమిత్‌ తివారి: యాక్టింగ్ పరంగా చిరంజీవిగారు ఇచ్చారు. ‘విక్రమార్కుడు’ తర్వాత ‘స్టాలిన్‌’ డబ్బింగ్‌ జరుగుతోంది. చిరంజీవి గారి తర్వాత నేను చెప్పాలి. సార్‌ డబ్బింగ్‌ చెప్పి వచ్చారు. నేను వెళ్లా. అక్కడి నుంచే విష్‌ చేశా. మేకప్‌మెన్‌ వచ్చి సార్‌ రమ్మంటున్నారనగానే చెమటలు పట్టాయి. వెళ్తే ఆయన లేచి హత్తుకున్నారు. ‘విక్రమార్కుడులో నీ నటన చాలా బాగుంది. పైకి వస్తావ్‌. బాగా చేయ్‌’ అంటూ భుజం చరిచారు. ‘స్టాలిన్‌’లో కూడా చూశా. ‘చాలా బాగా చేశావ్‌’ అన్నారు. నిజంగా నాలుగు రోజులు నిద్రపోలేదు. ఆయన బ్లెస్సింగ్స్‌ నాకు పెద్ద అవార్డులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని