Kavya: నేను హీరోయిన్‌ అయ్యే సరికి ‘మీరు ముసలోళ్లు అయిపోతార’ని చెప్పా!

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’కార్యక్రమానికి మసూద టీమ్‌ వచ్చి సందడి చేసింది.

Updated : 14 Sep 2022 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఖడ్గం’లో ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ ఆరాటపడే యువతిగా కనిపించినా.. ‘శివపుత్రుడు’లో గ్రామీణ యువతి పాత్రలో మెప్పించినా... గ్లామర్‌తో ‘పెళ్లాం ఊరెళితే’లో అలరించినా ఆమెకే చెల్లింది..ఆ హీరోయిన్‌, ఇప్పటి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న సంగీత గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షణాది భాషల్లో 40కిపైగా సినిమాలు చేసినా చాలా మందికి గుర్తుండిపోతుంది. ఇక ఒకప్పుడు బాలనటిగా బాలు లాంటి సినిమాల్లో చేసిన కావ్య ఇప్పుడు హీరోయిన్‌గా ‘మసూద’లో చేస్తోంది. ఈ సినిమాలో నటించిన సంగీత, కావ్య, తిరువీర్‌లు ఈటీవీలో ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. సినీ, వ్యక్తిగత విశేషాలను పరిచయం చేశారు.

కావ్య ఇది నీకు మొదటి సినిమానా..? ‘మసూద’ అంటే ఏంటి?

కావ్య: కథానాయికగా ఇదే నా మొదటి సినిమా. ఇది ఉర్దూ పదం. మంచి మహిళ అని అర్థం. హారర్‌ డ్రామా సినిమా ఇది. ఇటువంటి సినిమా ఇటీవల కాలంలో తెలుగులో రాలేదు. మంచి కథ అనిపించింది. అందుకే చేశా. బాలనటిగా పది, పన్నెండు సినిమాలు చేశా. చదువుకోవడానికి గ్యాప్‌ తీసుకున్నా. లా పూర్తి చేశాను. మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం.

‘సరిలేరు నీకెవ్వరూ’లో తల్లిగా నటించారు. ఆ సినిమా ప్లస్‌ అయ్యిందా..? మైనస్‌ అయ్యిందా..?

సంగీత: రెండూ ఉన్నాయి. చాలా మంది ఇంత తొందరగా తల్లి పాత్ర ఎందుకు చేస్తున్నావని అడిగారు. పునరాగమనం తర్వాత పెద్దగా ఆలోచనలేవీ లేవు. కానీ, మంచి పాత్రతో అడుగు పెట్టాలనుకొని ఆ సినిమా చేశా. సినిమా చేయడానికి వచ్చినా చేయాలా..? వద్దా? అనే ఆలోచన ఉండేది. పది నిమిషాలైతే వెళ్లిపోదామనుకున్నా.. ఇంతలో అనిల్‌ రావిపూడి వచ్చారు. డైలామాలో ఉన్నానంటే షూటింగ్‌ మొదలయ్యేదాకా ఇక్కడే ఉంటానన్నారు. నేను సంతోషంగా పనిచేసి వెళ్లిపోవాలనుకున్నా.. ఆ సినిమాలో చాలా ఎంజాయ్‌ చేశా.

2010 నుంచి 2021 దాకా సినిమాలు చేయలేదు. సడెన్‌గా ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?

సంగీత: వరస సినిమాలతో అలసిపోయా! పెళ్లయిన తర్వాత నా భర్త కూడా ‘నీ ఇష్టం’ అన్నారు. గర్భం దాల్చిన తర్వాత చెన్నై నుంచి ఎక్కడికి వెళ్లేదు. ఆ తర్వాత ‘పాపకు ఐదారేళ్లు వచ్చాక సినిమాల సంగతి చూద్దాం లే’ అనుకున్నా. తమిళ సినిమాలు అదీ చెన్నైలో షూటింగ్‌ ఉన్నవే ఒప్పుకొన్నా.

‘మసూద’ ఎలా వచ్చింది...?

సంగీత: నిజం చెప్పాలంటే.. నా జీవితంలో కథ వినకుండా ఒప్పుకొన్న సినిమా ఇది. నిర్మాత రాహుల్‌ మేసేజ్‌ పెట్టారు. నాకు ఆరోగ్యం సరిగా లేక కథ పంపించినా చదవలేదు. చాలా కాలం వాయిదా పడింది. చివరికి ‘నిన్ను నమ్మి ఈ సినిమా చేస్తా’నని చెప్పా.

చిన్నప్పుడు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, వెంకటేశ్‌ లాంటి వారితో సినిమాలు చేశారు.. ఇప్పుడు హీరోయిన్‌గా మారిన తర్వాత ఎలా ఉంది..?

కావ్య: చిన్నప్పుడు ఏం చేసినా క్యూట్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు అలా కాదు కదా.. బాగా చేయాలనే పట్టుదల ఉంటుంది. 

చిన్నప్పుడు నీకంటే మీ అమ్మే ఎక్కువగా పాఠశాలకు వెళ్లేవారట...?

కావ్య: వరసగా సినిమాలు చేస్తున్న సమయంలో నా డేట్స్‌ వచ్చేసరికి పరీక్షలుండేవి. పరీక్షలు మానేసి షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. కనీసం నెలలో 20 రోజులు పాఠశాలకు వెళ్లలేదు. అందుకే మా అమ్మ వెళ్లి నోట్‌బుక్స్‌ తీసుకొని వచ్చేది. 5,6 తరగతులు అలాగే అయిపోయాయి. ఇక బాగుండదని చదువుపై శ్రద్ధ పెట్టా. దాదాపుగా 12 ఏళ్లు దూరంగా ఉండి చదువు పూర్తి చేశా.

‘మసూద’ సినిమాలో చేయడానికి కారణం నువ్వా..? మీ తల్లిదండ్రులా..? 

కావ్య: కథ వినలేదు. నటించడం మాత్రం నా నిర్ణయం. కొవిడ్‌ సమయంలో సినిమాల్లో చేయాలనే ఆలోచన వచ్చింది. నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని ఒప్పుకున్నారు. నిర్మాత రాహుల్‌ సినిమా చేయాలని చెప్పినప్పుడు నాకు మంచి సినిమా అవుతుందని అనుకున్నా. 

‘పెళ్లిసందడి-2’ అవకాశం నీకే వచ్చిందని విన్నాం నిజమేనా..?

కావ్య: మళ్లీ నటించాలనుకున్న తర్వాత తొలిసారి రాఘవేంద్రరావుగారిని కలిశా. ‘రెండు నెలల క్రితమే పెళ్లిసందడి సిద్ధమయిపోయింది. రెండ్రోజుల్లో షూటింగ్‌’ అన్నారు. రెండు నెలల ముందు కనిపిస్తే బాగుండేదన్నారు. ఆయన పర్యవేక్షణలో తెరకు పరిచయమయ్యేదాన్ని.

హీరోయిన్‌ అయ్యేంత స్థాయి లేదని అనుకుంటారట?

సంగీత: హీరోయిన్‌ అంటే ఎలా ఉండాలో చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి లావు ఎక్కువ. ఆభరణాలు వేసుకుంటే దురద పెడుతుంది. ఇండస్ట్రీలో నాకెవరూ తెలియదు. నా పని నేను చేసుకొని వెళ్తా. జనంలోకి పెద్దగా వెళ్లను. ఇతరులు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఒక సినిమాలో చాలా బొద్దుగా ఉన్నా.. అమ్మతో కలిసి చూస్తూ.. ‘అమ్మా నేను బాగా లేను. ఇక సినిమాలు చేయన’ని చెప్పా. నాకు పాత్రలు రావడం దేవుడి దయ మాత్రమేనని నమ్ముతా.

‘మసూద’లో ఎలా అవకాశం వచ్చింది..? 

తిరువీర్‌: నేను వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఓ కాల్‌ వచ్చింది. వాళ్లు ‘ఓ ప్రధాన పాత్ర ఉంది. చేయాల’న్నారు. నాకు డేట్లు చెప్పండి. అక్కడికి నేరుగా వస్తానని చెప్పా. స్వధర్మ ప్రొడక్షన్‌లో గతంలో వచ్చిన రెండు సినిమాలు చూశా. వీళ్లు మంచి సినిమాలు చేస్తారనే నమ్మకంతో ఒప్పుకున్నా. అంతకు ముందు ఖతర్నాక్‌, రామ్‌ గణేశ్‌, ఉపేంద్ర సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్టుగా చేశా. కానీ సినిమాలో కనిపించలేదు. ఇదేం బాగోలేదని థియేటర్‌ ఆర్ట్స్‌ చేసిన తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరా.

తిరువీర్‌గా ఎలా మారావు..?

తిరువీర్‌: మా అమ్మ పేరు వీరమ్మ. థియేటర్‌లో ఇష్టమైన వ్యక్తి రఘువీర్‌. తిరుపతిలో తిరు ఉంచి దానికి వీర్‌ తగిలిద్దామని అనుకుని మార్చేశా. చాలామంది నార్త్‌ ఇండియన్‌, కేరళ వ్యక్తి అనుకుంటారు. ‘తెలుగు వచ్చా’ అని అడుగుతారు. మాది షాద్‌నగర్‌ దగ్గరి ఊరు.

ఏదైనా సినిమా వదులుకున్నప్పుడు.. అది హిట్‌ అయి బాధ పడిన సందర్భాలున్నాయా..?

సంగీత: పెద్దగా లేవు. ఒక సినిమా తీసుకుని రెండు, మూడు రోజులు షూటింగ్‌ అయిపోయిన తర్వాత తొలగించారు. దాని గురించి వదిలేద్దాం. ‘శివపుత్రుడు’ దర్శకుడు 90 రోజులు కావాలన్నారు. నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నా. ఒకేసారి అన్ని రోజులు సాధ్యం కాదని చెప్పా. మధ్య మధ్యలో అయితే ఓకే అన్నా... డైరెక్టర్‌ ఒప్పుకోలేదు. బాలకృష్ణకు ఏదో సమస్యతో షూటింగ్‌ 25 రోజులు ఆగిపోయింది. ఫిలింఫేర్‌లో ‘ఖడ్గం’కు చాలా అవార్డులు వచ్చాయి. ఆ సమయంలో వంశీగారు బాగా తిట్టారు. బాలా గారికి ఫోన్‌ చేసి సారీ చెప్పా. ఆయన ‘ఇప్పుడేం చేస్తున్నావ’ని అడిగారు. ‘షూటింగ్‌ ఆగిపోయింద’ని చెబితే ‘వెంటనే మధురై రా’ అని చెప్పారు. నా కోసం వేరే అమ్మాయికి అన్యాయం చేయొద్దని చెబితే ఆయనా తిట్టారు. వెంటనే వెళ్లి మేకప్‌ వేసుకొని ఒక డైలాగ్‌ ఇచ్చారు. అది చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకంటే అప్పటికే 30 హీరోయిన్లతో ఆ సీన్‌ చేసినా సరిగా రాలేదట. ఆ సినిమా లేకపోతే నేను లేను. 

నీకు ఏ డైరెక్టర్‌తో చేయాలని ఉంది..? ఏ హీరోలతో చేయాలనుకుంటున్నావ్‌..?

కావ్య: నాకు మణిరత్నం, సుకుమార్‌లతో సినిమా చేయాలని ఉంది. ఎన్టీఆర్‌, నాగచైతన్య, అల్లు అర్జున్‌లతో హీరోయిన్‌గా చేస్తే బాగుంటుంది. అల్లు అర్జున్‌, బాలకృష్ణలు నాతో హీరోయిన్‌గా చేయాలని చిన్నప్పుడే అడిగారు. ‘నేను హీరోయిన్‌ అయ్యేసరికి మీరు ముసలోళ్లు అయిపోతార’ని చెప్పా. ‘మా నాన్నతో శ్రీదేవి కూతురుగా చేసి ఆ తర్వాత హీరోయిన్‌గా చేసింది. నాతో కూడా చేయాలి’ అన్నారు. వాళ్లు లెజెండ్‌లా ఉంటారని అప్పట్లో తెలిస్తే అగ్రిమెంట్‌ చేసుకునేదాన్ని (నవ్వులు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని