‘గాలి సంపత్‌’ కంటతడి పెట్టిస్తాడు:అనిల్‌ రావిపూడి

ఇటీవలి కాలంలో కామెడీతో కూడిన మసాలా చిత్రాలకు అనిల్‌ రావిపూడి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటున్నారు. మరి అలాంటి డైరెక్టర్‌ సమర్పకుడిగా మారి తన జోనర్‌కు విభిన్నంగా ఒక ఎమోషనల్ కథను ఎంచుకుంటే అదే ‘గాలి సంపత్‌’. తన మిత్రుడు ఎస్‌.కృష్ణ రచయితగా,

Updated : 09 Mar 2021 14:04 IST

ఇటీవలి కాలంలో కామెడీతో కూడిన మసాలా చిత్రాలకు అనిల్‌ రావిపూడి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటున్నారు. మరి అలాంటి డైరెక్టర్‌ సమర్పకుడిగా మారి తన జోనర్‌కు విభిన్నంగా ఒక ఎమోషనల్ కథను ఎంచుకుంటే అదే ‘గాలి సంపత్‌’. తన మిత్రుడు ఎస్‌.కృష్ణ రచయితగా, నిర్మాతగా మారి తీస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లే కూడా అందించారు. ‘అలా ఎలా’ దర్శకుడు అనీష్‌కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గాలి సంపత్‌ చేసే పనేంటి, అతను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులేంటో అనిల్‌ చెప్పుకొచ్చారు. మార్చి 11న ‘గాలి సంపత్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విశేషాలేంటో మీరు చదివేయండి.

గాలి సంపత్‌ అంటే గాలికి తిరిగే హీరో అనుకున్నా..

నా స్నేహితుడు సాయికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథను కూడా అందిస్తున్నాడు. మొదట అతను ‘గాలి సంపత్‌’ అని చెప్పగానే గాలికి తిరిగే హీరో కథేమో అనుకున్నా. తర్వాత లైన్‌ విన్నాక అర్థమైంది కేవలం గాలితో మాత్రమే మాట్లాడే ఒక వ్యక్తి ఎదుర్కొన్న సమస్యల సమాహారమే ఈ కథ అని. అలాగే నేను ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ ‘క్యాస్ట్‌ అవే’ ‘127 అవర్స్‌’లాంటి హాలీవుడ్‌ సినిమాలు చూశా. ఆ చిత్రాల మాదిరిగానే ఒక బావిలో ఇరుక్కుపోయిన మాటలు రాని వ్యక్తి అందులో నుంచి ఎలా బయటకొచ్చాడన్నదే కథాంశం. దీనికి అనీష్‌ కృష్ణ లాంటి సెన్సిబుల్‌ డైరెక్టర్‌, అచ్చు సంగీతం, సాయిశ్రీనివాస్‌ సినిమాటోగ్రఫీతో సినిమా అద్భుతంగా వచ్చింది. నేను దర్శకత్వ పర్యవేక్షణ చేశా.

‘అలా ఎలా’ చిత్రంతోనే అర్థమైంది..

ఈ చిత్ర డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ ‘అలా ఎలా’ చిత్రాన్ని గతంలో తెరకెక్కించాడు. అందులో కామెడీ చాలా సున్నితంగా, హ్యుమర్‌తో ఉంటుంది. ఆ సినిమా చూశాక అనీష్‌ అయితేనే దీన్ని బాగా హ్యాండిల్‌ చేయగలడనిపించింది. సెకాండఫ్‌లో రాజేంద్రప్రసాద్‌గారు బావిలో పడిన సీన్లు తెరకెక్కించడంలో నా సహకారం అందించా. ఇదంతా ఒక టీమ్‌వర్క్‌.

ప్రకృతి గురించి చెప్తాం..

ఈ సినిమాకు నేను స్క్రీన్‌ప్లే అందించా. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రకృతి గురించి చెప్పే మంచి విషయాలు ఉన్నాయి. అలాగే శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ మధ్య వచ్చే తండ్రీకొడుకుల సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తూనే కంటతడి పెట్టిస్తాయి. వర్షం పాత్ర ఈ కథలో కీలకం. అదేంటన్నది తెరపై మీరే చూస్తారు. ఈ సినిమాలో నా పేరు కనిపిస్తుంది కాబట్టి పూర్తిగా ఎంటర్‌టైనర్‌ తీశామంటే పొరపాటే. అందుకే ట్రైలర్‌లో కథ చెప్పేశాం. సెన్సిబుల్‌ కామెడీతో పాటు ఎమోషన్‌ పాయింట్లను కూడా టచ్‌ చేశాం. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ పాత్రకు మాటలు రాక కేవలం ‘ఫ ఫ’అనే సౌండ్‌తో వచ్చే కామెడీ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతుంది. నా చిత్రాలకు దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదు.

కచ్చితంగా మంచి కథలను ప్రోత్సహిస్తా..

కెరీర్‌ ప్రారంభంలో నేను దర్శకుడిగా బలంగా నిలబడటానికి ప్రయత్నించా. ఇక నుంచి ఏవైనా మంచి కథలతో ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తాం. కచ్చితంగా ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు చూపించే బాధ్యతను ఇకపై తీసుకుంటాం. కథ ఏ జోనర్‌లో ఉన్నా ఫర్వాలేదు.

ఇవి అందంగా అమరిన కత్తులు..

డైరెక్టర్‌ అనీష్‌ టేకింగ్‌ సున్నితంగా ఉంటుంది. నా సినిమాలన్నీ కొంచెం గ్రాండ్‌గా, ఎక్కువ నవ్వులతో ఉంటాయి. కానీ, ఈ సినిమాపై మా ఇద్దరి గత సినిమాల ప్రభావం పడలేదు. నా పర్యవేక్షణలో అనీష్‌ టేకింగ్‌తో సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక ఒరలో ఈ రెండు విభిన్న కత్తులు చక్కగా అమరాయి.

నిర్మాతే అన్నీ చూసుకున్నాడు..

ఈ సినిమా కథ నుంచి, నటీనటుల ఎంపిక వరకూ నిర్మాత, నా స్నేహితుడు ఎస్‌.కృష్ణనే అన్నీ చూసుకున్నాడు. నేను కేవలం ఈ కథను సినిమా రూపంలో తెరపై ఎలా చెప్పాలనేది మాత్రమే చూసుకున్నా. చిత్రం అరకు బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. అక్కడున్న ప్రకృతి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

రాజేంద్రప్రసాద్‌గారు ఈ సినిమాకు బలం..

ఈ చిత్రానికి ప్రధాన బలం రాజేంద్రప్రసాద్‌గారే. ఇప్పటికే ఒక డబ్బింగ్‌ వీడియోను నెటిజన్లతో పంచుకున్నాం. అందులో చూస్తేనే మనకు అర్థమవుతోంది, ఎంతో ప్రాణం పెట్టి చేశారు. బావిలో పడిన తర్వాత ఆ పాత్రకు ‘ఫ ఫ’అనే శబ్దం కూడా రాదు. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అచ్చు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు ఎంతో ఆకట్టుకుంటుంది. అచ్చులో ఇంత టాలెంట్ ఉందని గుర్తించలేకపోయా. అలాగే కమెడియన్‌ సత్యకు అద్భుతమైన టైమింగ్‌ ఉంది. అది తెరపై చూస్తే మీరు నవ్వాపుకోలేరు. ఇక శ్రీవిష్ణు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఏదైనా సినిమానే..

కమర్షియల్‌ సినిమాలైనా, ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌ సినిమాలైనా ఆర్ట్‌తో కూడుకున్నవే. ప్రస్తుతం ఇది నా జోనర్‌ సినిమా కాకపోయినా పనిచేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశా. నేను మొదట్లో ఒక లేడి ఓరియంటెడ్‌ చిత్రాన్ని స్పోర్ట్స్‌ డ్రామాతో చేద్దామనకున్నా. సాయి పల్లవికి అప్పట్లో కథ కూడా చెప్పా. కానీ కుదరలేదు. భవిష్యత్తులో ప్రయత్నిస్తా..

‘ఎఫ్‌3’.. ‘ఎఫ్2’కు సీక్వెల్‌ కాదు..

కచ్చితంగా ఎఫ్‌2ను ఇష్టపడిన ప్రేక్షకులకు ఎఫ్‌3లో అంతకుమించి నవ్వులు ఉంటాయి. అయితే ఈ సినిమా ఎఫ్‌2కు సీక్వెల్‌ కాదు. నటీనటులందరు ఎఫ్‌2లోని వారే ఉంటారు. అయితే ఆ సినిమాలో భార్యలతో వచ్చే ఫ్రస్టేషన్‌ ఉంటే, ఎఫ్‌3లో డబ్బు లేకపోవటం వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ ఉంటుంది. హిందీలో వచ్చే ‘గోల్‌మాల్‌’ సిరీస్‌లాంటిది. కొత్త సిగ్నేచర్స్‌ కూడా పెట్టాం.

స్టార్లతో వరుస సినిమాలున్నాయ్‌..పట్టాలెక్కడమే లేటు..

త్వరలో రామ్‌తో ఒక సినిమా చేస్తా. అదెప్పటినుంచో అనుకుంటున్నాం. అలాగే బాలకృష్ణగారికి కూడా స్టోరీ లైన్‌ చెప్పాం. ఆయన నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాలి. మహేష్‌తో కూడ ఒక చిత్రం త్వరలో ఉండొచ్చు. వీటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో చెప్పలేను. ప్రస్తుతం అయితే ఎఫ్‌3 పనుల్లో ఉన్నా. మంచి కథలే నా పెట్టుబడి.

నిర్మాతల కష్టం తెలిసింది..

ఈ సినిమాకు షైన్‌స్క్రీన్‌ సాహు, హరీష్‌ ప్రమోషన్స్‌లో ఎంతో సహకరించారు. త్వరలో వారి ప్రొడక్షన్‌లో ఒక సినిమా కచ్చితంగా చేస్తా.  డైరెక్టర్‌గా సినిమా తీసేటప్పుడు తెరకెక్కించడం వరకే బాధ్యత. కానీ సమర్పకుడిగా నేను కొత్త అవతారం ఎత్తాక ఎంతో  కష్టంగా అనిపించింది. సినిమాను ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలి, ఎలా ప్రమోట్‌ చెయ్యాలి అని. అయితే ఆ కష్టాన్ని కూడా ఎంజాయ్‌ చేశా. ఇక ఈ సినిమా నా ప్రాణస్నేహితుడికి నేను ఇచ్చే గిఫ్టా, కాదా అనేది ప్రేక్షకుల స్పందనే చెబుతుంది.

‘పటాస్‌’ను హృతిక్‌రోషన్‌తో రీమేక్‌ చేయాలని ఉంది.

అవకాశం వస్తే బాలీవుడ్‌లో నా  చిత్రాల్లో ‘పటాస్‌’ను రీమేక్‌ చేయాలని ఉంది. దానికి టైంతో పనిలేదు. కరెక్టుగా ట్రీట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుంది. హృతిక్‌రోషన్‌తో ఇలాంటి మసాలా సినిమాలు తీయాలని ఉంది. ఎందుకంటే ఆయన అంత కటౌట్‌ ఉండి వేరే వేరే సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు చేస్తే ఆయనకూ కొత్తగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని