Apocalypto: ఊపిరిసలపనివ్వని ఛేజింగ్‌ సీన్లు

జీవితంలో ఎప్పుడూ భయపడొద్దని చెబుతాడు తండ్రి.. అలా చెప్పిన తండ్రిని తన కళ్లముందే హతమారుస్తారు. భయాన్ని గూడెంలోకే కాదు...

Updated : 18 Jul 2021 10:28 IST

సినిమా: అపోకలిప్టో; భాష: యుకటెక్‌ మాయ; దర్శకుడు: మెల్‌ గిబ్సన్‌; నటీనటులు: రూడీ యంగ్‌బ్లడ్‌, మయ్రా సెర్బులో తదితరులు; సినిమాటోగ్రఫీ: డీన్‌ సెమ్లర్‌; సంగీతం: జేమ్స్‌ హార్నర్‌; విడుదల: 2006; నిడివి: 138 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: అమెజాన్‌ ప్రైమ్‌

జీవితంలో ఎప్పుడూ భయపడొద్దని చెబుతాడు తండ్రి.. అలా చెప్పిన తండ్రిని తన కళ్లముందే హతమారుస్తారు. భయాన్ని గూడెంలోకే కాదు... గుండెల్లోకి తీసికొచ్చి పరిచయం చేస్తారు. మరి మన హీరో భయపడ్డాడా? లేక వారికి బలయ్యాడా? అసలు ఏం చేశాడనేది తెలియాలంటే ‘అపోకలిప్టో’ను చూడాల్సిందే. హాలీవుడ్‌ అందించిన గొప్ప నటుల్లో మెల్‌ గిబ్సన్‌ ఒకడు. హాలీవుడ్‌లో 1979లో వచ్చిన మ్యాడ్‌మ్యాక్స్‌ సినిమాతో మంచి బ్రేక్‌ లభించింది. ఆ తర్వాత ‘బ్రేవ్‌ హార్‌’్ట, ‘లీథల్‌ వెపన్‌’ సిరీస్‌, హామ్లెట్‌ లాంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాడు. తనలో మంచినటుడే కాదు అద్భుతమైన దర్శకుడున్నాడని కొన్ని సినిమాలు తీసి నిరూపించాడు. ‘ది మ్యాన్‌ వితౌట్‌ ఫియర్‌’తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు అయిదు సినిమాలను తెరకెక్కించాడు. కథానాయకుడిగా తను నటించిన క్లాసిక్‌ వార్‌ డ్రామా ‘బ్రేవ్‌హార్‌’్ట చిత్రమూ తన దర్శకత్వంలోనే రూపుదిద్దుకుంది. ‘ది ప్యాషన్‌ ఆఫ్‌ ది క్రైస్ట్‌, ‘ది హాక్సా రిట్జ్‌’ చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్‌ చూపించాడు. 2006లో ఆయన తీసిన యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘అపోకలిపో’్టకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఉత్తర అమెరికా నేలపై శతాబ్దాల క్రితమే అంతర్థానమైన మాయన్‌ నాగరికత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్‌ చిత్రాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

కథ: సినిమా కథంతా అమెరికాలోని మెసోఅమెరికన్‌ అడవుల్లో జరుగుతుంది. అక్కడ మాయన్‌ తెగకు చెందిన జాగ్వర్‌ పా అతడి బృందంతో కలిసి ఓ జంతువును వేటాడే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. జాగ్వర్‌ పా తండ్రి ఫ్లింట్‌ స్కై ‘జీవితంలో ఎలాంటి సమయంలోనూ భయాన్ని దరిచేరనీయకు’ అని చెబుతాడు. అదే రోజు రాత్రి వీళ్లంతా వేటాడిన మాంసంతో విందు చేసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులతో వేడుక చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే వీరిపై ఊహించని దాడి జరుగుతుంది. గర్భంతో ఉన్న తన భార్యను, కుమారుడిని జాగ్వర్‌ పా ఒక బావిలోకి దింపి వారి చేతికి చిక్కకుండా కాపాడతాడు. ఆ దాడిలో చాలామంది చనిపోతారు. ఆడవాళ్లని అత్యాచారం చేసి హతమారుస్తారు. జాగ్వర్‌ పా తండ్రి ఫ్లింట్‌ స్కైని తనముందే గొంతు కోసి చంపుతారు. చిన్నపిల్లలను తప్ప మిగిలిన వాళ్లందరినీ బానిసలుగా చేసుకొని తమ రాజ్యంలో బలిచ్చేందుకు తీసుకెళ్తారు. ఇంతకి వారి మీద దాడి చేసిందెవరు? జాగ్వర పా ఆ చెర నుంచి తప్పించుకున్నాడా? లేదా? బావిలో వదిలేసిన తన భార్య, బిడ్డలను కలుసుకున్నాడా? అనేది మిగతా కథ.

మెల్‌ గిబ్సన్‌ మాయ: కొన్ని శతాబ్దాల కింద అంతరించిన పోయిన మాయన్‌ తెగ, నాగరికత కథాంశాన్ని ఎంచుకొని పెద్ద సాహసమే చేశాడు దర్శకుడు మెల్‌ గిబ్సన్‌. అసాధారణమైన పరిశోధన జరిగిందని సినిమా చూస్తూంటే తెలిసిపోతుంది. సినిమా వాస్తవికంగా ఉండేందుకని అందరూ కొత్త నటులనే ఎంచుకున్నాడు. నిజానికి ఇది హాలీవుడ్‌ సినిమానే అయినా, ఎక్కడా ఒక్క ఇంగ్లీష్‌ పదం వినిపించదు. మాయ భాషలోనే పాత్రలన్నీ సంభాషించుకుంటాయి. వారి భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, నిర్మాణాలు, సంస్కృతి ఇలా ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించి సినిమాను తెరకెక్కించాడు. ప్రేక్షకుడిని ఆనాటి మాయన్‌ నాగరికత కాలానికి తీసుకెళ్తాడు.

అతి అనర్థమే!

వనరుల దుర్వినియోగం కారణంగానే క్షామం ఏర్పడి మాయన్‌ నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందనేది చరిత్రకారులు చెప్పే మాట. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే ప్రజలు వ్యవసాయం, ఆలయాల నిర్మాణం కోసం వేల ఎకరాల్లో అడవులను నరికివేయడం, సహజ వనరుల దుర్వినియోగం, విస్తరణ కాంక్ష కారణంగా కరవు ఏర్పడి, కొత్త వ్యాధులు పుట్టుకొచ్చాయంటారు. వీటిని నేరుగా ప్రస్తావించకున్నా దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో చూపించే ప్రయత్నం చేశాడు. వీటి చుట్టూనే కథను అల్లుకుని సినిమా రక్తికట్టించాడు మెల్‌గిబ్సన్‌. సినిమా ద్వితీయార్ధంలో వచ్చే ఛేజింగ్‌ సీన్లు ఊపిరిసలపనివ్వవు. ఇక నటీనటులు సినిమాకు ప్రాణం పోశారు.     మాయన్‌ తెగ నాగరికతను అద్భుతంగా ఆవిష్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని