Balakrishna: దాసరి ఉండి ఉంటే బాగుండేది: బాలకృష్ణ ఎమోషన్‌

బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. ఈ సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్న బాలకృష్ణ.. దివంగత దాసరి నారాయణరావును గుర్తుచేసుకున్నారు.

Updated : 09 Nov 2023 23:55 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు ఉండి ఉంటే బాగుండేదంటూ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) భావోద్వేగానికి గురయ్యారు. తన తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) విజయోత్సవ వేడుకలో (Box Office Ka Sher Celebrations) దాసరిని గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ, శ్రీలీల, కాజల్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది. సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందానికి జ్ఞాపికలు అందజేశారు.

విజయేంద్ర ప్రసాద్‌ వద్ద పనిచేసి.. ‘హాయ్‌ నాన్న’తో దర్శకుడిగా మారి..: శౌర్యువ్‌ సంగతులివీ

వేడుకనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఓ సినిమా విషయంలో ప్రేక్షకాదరణను మించింది మరేదీలేదు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు, వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం నాన్నగారి నుంచి నాకొచ్చింది. ఆడియన్స్‌ అడగకముందే మంచి కథలను పరిచయం చేస్తే విజయం తప్పక వరిస్తుందనడానికి ‘భగవంత్‌ కేసరి’ ఓ నిదర్శనం. నా సినిమాలతో నా సినిమాలకే పోటీ. దర్శకుడు, రచయితలు, నటులు సాంకేతిక నిపుణల సమష్టి కృషే విజయానికి కారణం. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’లాంటి సినిమాలన్నీ నాకు సవాలుతో కూడుకున్నవే. ఈ చిత్రానికి పని చేసిన వారందరినీ మీ ముందు సత్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నాన్నగారితోనూ ఎన్నో సినిమాలు తెరకెక్కించిన రాఘవేంద్రరావు గారు రావడంతో ఈ కార్యక్రమానికి నిండుదనం వచ్చింది. దాసరి నారాయణరావు లేరనే లోటు ఉంది. ఆయన కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది! ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా, తలలో నాలుకగా ఉండేవారాయన’’ అని గుర్తుచేసుకున్నారు.

‘‘ఏదైనా సందేశం ఇవ్వాలంటే సినిమాను మించిన మాధ్యమం లేదు. అయితే, కొందరు చెబితేనే ఆ విషయం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అద్భుతం. పాత్రలన్నీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. దర్శకుడు అనిల్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విషయంలో పంపిణీదారులు సంతోషంగా ఉన్నారు. వాళ్లు ఆనందంగా ఉంటేనే పరిశ్రమ బాగుంటుంది. ‘భగవంత్‌ కేసరి’ హిందీలోనూ విడుదలవుతుంది. నా పాత్రకు నేనే హిందీలో డబ్బింగ్‌ చెప్పా’’ అని బాలకృష్ణ తెలిపారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని