Bholaa Shankar: ‘చిరు’ రెమ్యునరేషన్‌ వార్తలపై నిర్మాణ సంస్థ క్లారిటీ!

Bholaa Shankar: చిరంజీవి రెమ్యునరేషన్‌ వివాదంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలకు చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పష్టతనిచ్చింది.

Updated : 15 Aug 2023 18:13 IST

హైదరాబాద్‌: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి (Chiranjeevi) ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar) ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేకపోయింది. తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’ రీమేక్‌ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు మెహర్‌ రమేష్‌ సక్సెస్‌ కాలేకపోయారు. ఈ సినిమా వీకెండ్ కలెక్షన్లు చూసుకుంటే దాదాపు రూ.25కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక సోమవారం ‘భోళా’ కలెక్షన్లు బాగా తగ్గినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఆగస్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా సెలవు రావడంతో చిరు మూవీ వసూళ్లు కాస్త పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

చిరు రెమ్యునరేషన్‌ వార్తలపై నిర్మాణ సంస్థ స్పష్టత

‘భోళా శంకర్‌’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, తన రెమ్యునరేషన్‌ విషయంలో చిరంజీవి వెనక్కి తగ్గడం లేదని వార్తలు వచ్చాయి. మొదట అనుకున్నట్లు గానే తన పారితోషికం చెల్లించాల్సిందేనని చిరు పట్టుబడుతున్నారని పలు వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. ఒకపక్క సినిమా పరాజయం పాలై నిర్మాణ సంస్థ ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఇలాంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. చిరు పారితోషికం చెల్లించేందుకు  చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర ఇల్లు, తోట తాకట్టు పెట్టారని కొందరు రాసుకొచ్చారు. పారితోషికంపై వస్తున్న వార్తలపై  నిర్మాణసంస్థ స్పష్టతనిచ్చింది. ‘‘రెమ్యునరేషన్‌ వివాదంపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి. వాటిల్లో ఒక్కశాతం కూడా నిజం లేదు. అలాంటి వార్తలను దయచేసి ఎవరూ నమ్మొద్దు’’ అని ట్వీట్‌ చేసింది.

కొనసాగుతున్న ‘జైలర్‌’ హవా

రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్‌’ (jailer) బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్లు (గ్రాస్‌) వసూళ్లను దాటేసింది. అంతేకాదు, ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ పేరిట ఆ రికార్డు ఉంది. ఈ వారాంతానికి రూ.400 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటివరకూ విదేశాల్లో రజనీ మూవీ  రూ.126 కోట్లు (గ్రాస్‌)వసూలు చేసినట్లు ట్రేడ్‌వర్గాలు లెక్క కట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని