Chiranjeevi: మెగా కాంపౌండ్‌లో ఘనంగా వేడుకలు‌.. ఫొటోలు వైరల్‌

మెగాస్టార్‌ నివాసంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి తల్లి అంజనాదేవి, రామ్‌చరణ్‌ - ఉపాసన, సుస్మితతోపాటు పలువురు కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 06 Oct 2022 11:23 IST

హైదరాబాద్‌: మెగా కాంపౌండ్‌లో ఈ ఏడాది విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా పర్వదినంతోపాటు, మెగాస్టార్‌ నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather) బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో ఈ పండుగ మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. దీంతో బుధవారం ఉదయం కుటుంబసభ్యుల సమక్షంలో చిరంజీవి - సురేఖ దంపతులు అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో చిరు తల్లి అంజనా దేవి, ఉపాసన, రామ్‌చరణ్‌, సుస్మిత, శ్రీజతోపాటు పలువురు బంధువులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఇక నిన్న సాయంత్రం నుంచి ‘గాడ్‌ఫాదర్‌’ సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. మెగాస్టార్‌ ఇంటికి చేరుకున్న దర్శకుడు మోహన్‌రాజా, నిర్మాతలు చౌదరి, ఎన్వీప్రసాద్‌, సత్యదేవ్‌, తమన్.. చిరంజీవికి పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందనలు తెలిపారు. అనంతరం టపాసులు కాల్చి తమ ఆనందాన్ని బయటపెట్టారు. మరోవైపు మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మాతలు, దర్శకులు హరీశ్ శంకర్‌, మెహర్‌ రమేశ్‌.. సైతం చిరంజీవి ఇంటికి చేరుకొని అభినందనలు తెలిపారు.

‘‘నా కల నిజమైన క్షణాలివి. అంతటా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇలాంటి ఫీడ్‌బ్యాక్ ఈ మధ్యకాలంలో వినలేదు. మాపై ఇంత ప్రేమాభిమానాలు కనబర్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా విడుదలకు ముందు కాస్త భయపడ్డాను. కానీ, ఏడాదిన్నరపాటు మేము పడిన కష్టానికి మంచి ప్రతిఫలాన్ని అందించారు. ఎమోషనల్‌ సీన్స్‌కు కూడా థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఈ సినిమా హిట్‌ని అదృష్టంగా భావిస్తున్నా’’ - మోహన్‌రాజా

‘‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా జీవితంలో తొలిసారి ఇంత పెద్ద విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ప్రేక్షకులు నుంచి వస్తోన్న స్పందనకు కన్నీళ్లు వచ్చేసేలా ఉన్నాయి. నాపై నమ్మకం ఉంచి ఈ క్యారెక్టర్‌ ఇచ్చిన రాజాకు ధన్యవాదాలు. మీ డైరెక్షన్‌లో విలన్‌గా చేసినందుకు గర్వపడుతున్నా. అన్నయ్యకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ - సత్యదేవ్‌






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని