రియాలిటీ షోల్లో.. రియల్‌ ప్రేమలు! 

షో గెలవడానికొచ్చారు... సాటి పోటీదారులు మనసు గెల్చుకున్నారు... టైటిల్‌తో వెళ్దామనుకున్నారు... చేతిలో చేయేసుకొని

Updated : 14 Mar 2021 09:44 IST

షో గెలవడానికొచ్చారు... సాటి పోటీదారులు మనసు గెల్చుకున్నారు... టైటిల్‌తో వెళ్దామనుకున్నారు... చేతిలో చేయేసుకొని జంటగా బయటికెళ్లారు... రియాలిటీ షోలలో వికసించిన ఇలాంటి ప్రేమజంటలెన్నో... తెరపై పుట్టిన ప్రేమను కడదాకా నిలుపుకొని పెళ్లితో ఒక్కటైన వారు కొందరైతే... ఇంకా ప్రేమలోనే ఓలలాడుతున్న జంటలు కొన్ని... తెరపై మొదలైన ప్రేమకు షో ముగియగానే తెర దించేసిన ప్రేమికులూ లేకపోలేదు... మొత్తానికి రియాలిటీ షోల్లో ఆ రియల్‌ ప్రేమ కథలు కొన్ని విందాం!

కుషాల్‌ టాండన్‌- గౌహర్‌ ఖాన్‌ కలిపిన షో: బిగ్‌బాస్‌ 7

కుషాల్‌ది నెమ్మది స్వభావం. గౌహర్‌ వాగుడుకాయ, సంచలనాలకు మారుపేరు. భిన్న మనస్తత్వాలున్న ఈ ఇద్దరినీ బిగ్‌బాస్‌ ఇల్లు ఒక్కటి చేసింది. షో ముగిసినా వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. బంధం బలపడి పెళ్లిదాకా వెళ్లింది. కానీ, ఏవో మనస్పర్ధలొచ్చి రెండేళ్ల తర్వాత మేం విడిపోతున్నాం అని ప్రకటించారిద్దరూ.


పునీష్‌ శర్మ- బంద్‌గీ కల్రా రియాలిటీ షో: బిగ్‌బాస్‌ 11

దిల్లీ వ్యాపారవేత్త పునీష్‌ శర్మ. మోడల్‌ బందగీ కల్రా. బిగ్‌బాస్‌ వేదికలోనే పరిచయం. పరిచయమైంది మొదలు.. ఇంటిలో ఒకరిని వదిలి ఇంకొకరు నిమిషం ఉండేవాళ్లు కాదు. బయటికొచ్చినా అదే వరుస. వాళ్ల సామాజిక మాధ్యమ ఖాతాలు ఈ ఇద్దరి ప్రేమకు గుర్తుగా.. సన్నిహితంగా ఉన్న ఫొటోలతోనే నిండిపోతున్నాయి. ముఖ్యంగా వారి ఇన్‌స్టా ఫొటోలు చూస్తే వారెంత దగ్గరయ్యారో చెప్పకనే చెబుతున్నాయి. ఇద్దరి ఇళ్లలో పెళ్లికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. రేపో, మాపో ఆ తంతు మొదలవుతుంది అంటున్నారు.


ప్రిన్స్‌ నరూలా- యువికా చౌధరీ షో: బిగ్‌బాస్‌ 9

బిగ్‌బాస్‌ ఇంటిలో సన్నిహితంగా ఉంటే లవ్‌లో పడ్డారని అంతా అనుకున్నారు. ‘అబ్బే అలాంటిదేం లేదే’ అని కొట్టిపారేశారు. అయినా అక్కడక్కడ కెమెరా కళ్లకు చిక్కుతూనే ఉన్నారు. ఇక ఐదేళ్ల కిందట వీళ్లిద్దరే ‘స్ప్లిట్‌విల్లా’ షోలో జంటగా మరోసారి దర్శనం ఇచ్చారు.


రూప్‌ బిందర్‌- మోహిత్‌ సగ్గర్‌ షో: రోడీస్‌
ఇద్దరూ రోడీస్‌ పోటీదారులే. కాకపోతే వేర్వేరు సీజన్లలో పాల్గొన్నారు. కామన్‌ స్నేహితుల ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ప్రేమలో పడిపోయారు. వీళ్లు అందరిలా కాదు.. ‘వి ఆర్‌ ఇన్‌ లవ్‌’ అని మీడియాకు పిలిచి మరీ చెప్పారు. గతేడాది పెళ్లి కూడా చేసుకొని బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు.


హిమాన్షు మల్హోత్రా- అమృతా కన్విల్కర్‌ షో: సినీ స్టార్స్‌ కి ఖోజ్‌, నాచ్‌ బలియే

వీళ్లది సుదీర్ఘ ప్రేమాయణం. సినీస్టార్స్‌కి ఖోజ్‌లో ఒకరినొకరు చూసుకున్నారు. చూపులు కలుసుకున్నాక మనసులూ మాట్లాడుకోవడం మొదలైంది. ప్రేమలో నిండా మునిగినా ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆపై డ్యాన్స్‌ రియాలిటీ షో ‘నాచ్‌ బలియే’లో జట్టుకట్టారు. మొత్తానికి దశాబ్దంపాటు ప్రేమను కొనసాగించి 2015లో పెళ్లితో ఒక్కటయ్యారు.


అక్షదీప్‌ సెహ్‌గల్‌- పూజా బేడీ షో: బిగ్‌బాస్‌

లేటు వయసులో ఘాటు ప్రేమ పండించిన జంట అక్షదీప్‌ సెహ్‌గల్‌, పూజాబేడీ. బిగ్‌బాస్‌ ఇంట్లో మంచి కెమిస్ట్రీ నడిపించి షోలో వేడి పుట్టించారు. నా ప్రేమ అమరం అంటూ అక్షదీప్‌ ఏకంగా పూజా బేడీ పేరును ఒంటిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. కానీ షో ముగిసినా కొన్నాళ్లకే ఈ బంధం పరిసమాప్తమైంది.


అనూష దండేకర్‌- కరణ్‌ కుంద్రా కలిపిన షో: రోడీస్‌

అనూష వీజే, మోడల్‌. కరణ్‌ సినిమా, టీవీ నటుడు. రోడీస్‌ సెట్లో ఎదురుపడ్డారు. తొందర్లోనే వీళ్ల ప్రేమ రోడ్డెక్కింది. ఒకరిపై ఒకరికున్న ప్రేమను ఎప్పుడూ దాచుకోవడానికి ప్రయత్నించలేదు. ఫొటోలు, సెల్ఫీలతో సామాజిక మాధ్యమ ఖాతాలను నింపేస్తూనే ఉన్నారు. ‘పెళ్లెప్పుడు?’ అంటే మాత్రం మౌనమే సమాధానం.


అదితి శర్మ- సర్వార్‌ అహుజా షో: సినీ స్టార్స్‌ కీ ఖోజ్‌

ఇద్దరూ తమ ప్రతిభ చూపించుకోవడానికే వచ్చారు. ఇద్దరికీ సినిమా నేపథ్యం లేదు. అదే ఇద్దరిని దగ్గరకు చేర్చింది. మనసులు కలిశాయి. తర్వాత లక్కీగా ఇద్దరికి కలిపి ఓ సినిమా అవకాశం కూడా వచ్చింది. ప్రేమ మరింత జోరందుకుంది. ఆపై వీళ్లిద్దరు మనువుతో ఒక్కటయ్యారు.


తనీషా ముఖర్జీ- అర్మాన్‌ మాలిక్‌ షో: బిగ్‌బాస్‌

వీళ్ల ప్రేమను కలిపిన బాస్‌ బిగ్‌బాస్‌నే. ఇంట్లో ఉన్నంతసేపు క్షణం విడిచి ఉండలేం అన్నంతగా ఉండేవాళ్లు. బయటికెళ్లాక వీళ్ల పరిస్థితి ఏంటి పాపం.. అన్నంత సన్నిహితంగా మెలిగారు. అయితే ఈ రియాలిటీ షో ప్రేమ.. రియల్‌గా కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. తర్వాత ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు.


కరిష్మా తన్నా- ఉపేన్‌ పటేల్‌ షో: వీళ్లూ బిగ్‌బాస్‌ ప్రేమికులే. మోడల్‌, నటి, యాంకర్‌, సినిమా.. చాలా పాత్రలే పోషించింది కరిష్మా. మోడల్‌, నటుడు ఉపేన్‌. బిగ్‌బాస్‌ ఇంట్లోనే కరిష్మాకు ప్రపోజ్‌ చేశాడు ఉపేన్‌. తర్వాత కూడా చాలా ఏళ్లు గాఢమైన ప్రేమలోనే ఉన్నారిద్దరూ. నాచ్‌ బలియే 7, లవ్‌ స్కూల్‌ రియాలిటీ షోలలో కూడా కలిసి పాల్గొన్నారు. తర్వాత ఏమైందో కానీ ఐదేళ్ల ప్రేమకు బ్రేకప్‌ చెప్పుకొని అభిమానుల హృదయాలను గాయపరిచారు.

మన తెలుగు బిగ్‌బాస్‌లోనూ రాహుల్‌ సిప్లిగంజ్‌-పునర్నవీ భూపాలం, మోనాల్‌ గజ్జర్‌- అఖిల్‌ ప్రేమికులయ్యారని చాలానే వార్తలు వచ్చాయి. తమిళ షోలో బాలాజీ-శివానీలది ప్రేమ జంట. కీత్‌ సెకీరా-రోచెల్లే మరియారావులు బిగ్‌బాస్‌ వేదికపై ప్రేమించుకొని తర్వాత ఏడడుగులు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని