Siva Reddy: ‘వెన్నెల’ నేను చేయాల్సింది.. కిశోర్‌కు అవకాశం వచ్చింది: శివారెడ్డి

మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు ప్రతిష్ఠలు..ఆపై సినీ నటుడిగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న శివారెడ్డి విభిన్న కళలతో ఆకట్టుకుంటున్నారు. తొలుత ప్రముఖుల గొంతును అనుకరించి అలరించిన తర్వాత తనలోని ప్రతిభను వెలికి తీయడానికి సినీ రంగాన్ని ఎంచుకున్నారు.  

Updated : 13 Oct 2022 14:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు ప్రతిష్ఠలు.. ఆపై సినీ నటుడిగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న శివారెడ్డి విభిన్న కళలతో ఆకట్టుకుంటున్నారు. తొలుత ప్రముఖుల గొంతును అనుకరించి అలరించిన ఆయన తర్వాత తనలోని ప్రతిభను వెలికి తీయడానికి సినీ రంగాన్ని ఎంచుకున్నారు. దేశ, విదేశాల్లో సినీ నటులే కాదు.. రాజకీయ నాయకుల మాటను నటనతో కలిపి ప్రదర్శించేవారు. ఆయన ఈటీవీ చెప్పాలని ఉంది కార్యక్రమానికి వచ్చారు. తన సినీ, మిమిక్రీ అనుభవాలను పంచుకున్నారు.

ఎంతో పేరు సంపాదించిన మీకు సినీ, మిమిక్రీ కళల్లో  ఏదీ ఇష్టం..?

శివారెడ్డి: నేను నటుడిని కావడమే మిమిక్రీతో.. అదే నాకు ఇష్టం. 

చాలా సినిమాల్లో వరుసగా నటించారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. ఎందుకు..?

శివారెడ్డి: 1998 నుంచి 2006 వరకు చాలా సినిమాలు చేశా. కొన్నిసార్లు రోజుకు రెండు, మూడు సినిమాలు చేశా. కొన్ని సంఘటనలతో ఇక సినిమాలు రావనే కారణంతో నేనే డైవర్టు అయ్యా. మిమిక్రీ చేయాలని నిర్ణయించుకొని అటువైపు వెళ్లా. అది కాకపోతే ఏపనైనా చేయగలను. ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబం మాది. నాన్న చనిపోయిన తర్వాత అన్ని రకాల పనులు చేయాల్సి వచ్చింది. ఆఫీస్‌బాయ్‌గా ఎన్టీపీసీలో, బట్టల షాపులో పని చేశా. వరంగల్‌లో ఒకరింట్లో అన్ని పనులు చేశా. భవిష్యత్తు అన్నది లేని స్థాయి నుంచి 6 వేల ప్రదర్శనలు ఇచ్చిన స్థాయికి ఎదిగా.

చిన్నతనంలో చాలా పనులు చేశారు. ఆ సమయంలో చదువు ఎలా సాగింది..?

శివారెడ్డి: చదువు కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. హాజరు మాత్రమే ఉండేది. ఏదో స్నేహితుల దగ్గర చూసి పరీక్షలు రాశా. ఏడో తరగతి బోర్డు పరీక్షలకు నాకు ముందు ఆరో తరగతి విద్యార్థిని వేశారు. అతను రాసిన జవాబులను నా ప్రశ్నలకు రాశాను. ఇక అంతే సంగతులు. 

ఏ వయసులో మిమిక్రీ మొదలయ్యింది..?

శివారెడ్డి: పాఠశాల స్థాయిలోనే జంతువుల అరుపులను మిమిక్రీ చేశాను. తర్వాత టీవీల్లో వచ్చిన సినిమాలు చూసి వాళ్ల మాటలను అనుకరించాను. తొలిసారిగా ఎన్టీఆర్‌ మాటలనే  మిమిక్రీ చేశా.

అభినయం, మిమిక్రీ కలిసి ఎలా చేయగలిగారు..?

శివారెడ్డి: తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల సందర్భంగా ఒక్కొక్కరూ ఒక్కో తరహా కార్యక్రమాలను చేస్తున్నారు. వాళ్ల కన్నా ప్రత్యేకంగా ఉండేలా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున లాంటి హీరోలు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుందోనని ప్రాక్టీసు చేశా. అలా ఆ ప్రక్రియలో సక్సెస్‌ అయ్యాను. ఇప్పటి వరకు చాలా మంది మిమిక్రీ కళాకారులు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.

తొలి సినిమా ఏది..? మీ ఇంట్లో ఎవరైనా సినిమా ఫీల్డ్‌లో ఉన్నారా..?

శివారెడ్డి: 1996లో ‘పిట్టలదొర’లో బాక్సింగ్‌ రిఫరీ క్యారెక్టర్‌ అది. హీరో, విలన్‌ ఎవరైనా నన్నే కొట్టేవాళ్లు. ఆ సమయంలో ఎగిరి పడేవాడిని. ఓసారి నిజంగానే పడిపోవడంతో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అలీ, సాన యాదిరెడ్డి వచ్చి జాగ్రత్త తమ్ముడు అంటూ చెప్పారు. అప్పటి నుంచి అలీతో స్నేహం కుదిరింది. అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఇప్పుడు మా తమ్ముడు సంపత్‌ వచ్చాడు. బాలకృష్ణ, చిరంజీవితో కలిసి పని చేశాడు. 

మిమిక్రీ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?

శివారెడ్డి: బాలకృష్ణ, అమ్రిష్‌పురి గొంతులు క్లిష్టంగా ఉంటాయి. చాలా ఒత్తిడి ఉంటుంది. నాగార్జున లాంటి వారిది పెద్దగా ఇబ్బంది ఉండదు. గొంతుకు ఇబ్బంది లేకుండా కూల్‌డ్రింక్స్‌, చల్లని పానీయాలు ఏవీ తాగను. 

సినీ, రాజకీయ ప్రముఖుల ముందు చేసినపుడు వచ్చిన మంచి ప్రశంసలు ఏవీ..?

శివారెడ్డి: వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి అభినందనలు వచ్చాయి. ఆయన ముందు ఆయన మిమిక్రీ చేస్తున్నప్పుడు పగలబడి నవ్వారు. 

చాలా మంది గురువుల వద్ద నేర్చుకుంటారు. మీరు స్వయంకృషితో ఎదిగారు. మీకు ఓ సంస్థ స్థాపించి మిమిక్రీ నేర్పించాలని లేదా..?

శివారెడ్డి: డబ్బు సంపాదించిన సమయంలో బిజీగా ఉండిపోయా. ఇప్పుడు చెబుతామనుకుంటే స్తోమత లేకుండా పోయింది. 

మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటుంది..?

శివారెడ్డి: నా భార్య సహకారం బాగుంటుంది. పెళ్లయిన కొత్తలో చాలా ఇబ్బంది పెట్టా. అప్పుడు అమెరికాలో చాలా కార్యక్రమాలుండేవి. కొన్నిసార్లు రెండు, మూడు నెలలు వెళ్లేవాడిని. నా గురించి ఆలోచించుకుంటూ ఉండేదని చెప్పేది. 

పిల్లలెంత మంది..? వాళ్లకు మిమిక్రీపై ఆసక్తి ఉందా..?

శివారెడ్డి: ఇద్దరమ్మాయిలు. ఒక అమ్మాయి ఏడోతరగతి, రెండో అమ్మాయి నాలుగో తరగతి చదువుతోంది. ఇద్దరికీ మిమిక్రీ కళ వచ్చింది. చిన్నమ్మాయి పదకొండు నెలలకే అనుకరణ మొదలెట్టింది. అప్పటికి తనకు మాటలే రావు. 

మీ అభిమాన నటి మీనా అన్నారు. హీరో ఎవరు..?

శివారెడ్డి: ఇంకెవరూ చిరంజీవి గారే. ఆయన మాటలే కాదు.. నడక, డ్యాన్సు కూడా చేస్తా. నాలోనూ చిరంజీవి లక్షణాలున్నాయని చాలా మంది అంటారు. వారంలో రెండుసార్లయినా నా కలలో వస్తారు. నా నరనరాల్లో ఆయనే ఉన్నారు. నేను ప్రమాదంలో ఉంటే చేయి ఇచ్చి రక్షించినట్టు కలలో వస్తుంది. స్టాలిన్‌ సినిమాలో అన్నయ్య కోరి మిత్రుడి పాత్ర చేయించారు. 

ఇంకా ఏయే హీరోలతో సినిమాలు చేశారు..?

శివారెడ్డి: దాదాపుగా అందరితో నటించా. చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌లతో చేశా. బాలయ్యతో చేయలేదు. ఇస్మార్ట్‌ జోడీకి ఆయనొచ్చారు. అప్పుడు పరిచయం చేసుకున్నా. మనం చేస్తున్నాం.. అనగానే సంతోషంగా అనిపించింది. వెంటనే నీతో కాదు.. తమ్ముడితో చేస్తున్నా అన్నారు.

మీరు చేసిన సినిమాల్లో బాగా ఇష్టమైనదేదీ..? 

శివారెడ్డి: అమ్మాయి కోసం బాగా ఇష్టం. బాధ్యత లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే తీరు, మారిపోయిన పద్ధతి బాగా ఇష్టం. చాలా ప్రశంసలు వచ్చాయి. 

మీరు చేయాల్సిన ప్రాజెక్టు చేయకపోవడంతో ఇతరులకు సక్సెస్‌ అయ్యిందేమైనా ఉందా..?

శివారెడ్డి: వెన్నెల కిశోర్‌ అనే ఆర్టిస్టు వచ్చాడు. వెన్నెల సినిమా నేను చేయాల్సింది. చేయలేకపోవడంతో కిశోర్‌కు అవకాశం వచ్చింది. 

ఇండస్ట్రీలో బ్రహ్మరథం పట్టినా, అవమానాలు కూడా ఎదురవుతాయి. మీ కసిని పెంచిన సంఘటనలున్నాయా..?

శివారెడ్డి: సినిమా తల్లి వెళ్లిపోమ్మన్న తర్వాత కసిని పెంచుకోలేం. అప్పుడే మిమిక్రీకి వెళ్లిపోయా. చాలా మంది కళాకారులు వచ్చారు. ఏదో చేశామంటే సరిపోదు. ఇంకా కొత్తగా చేయాలని ఆలోచించా. జానపద పాటలు పాడుతున్నా..

ఒక వేదిక మీద చిరంజీవి మాట్లాడుతూ శివారెడ్డికి మనకంటే ఎక్కువ మంది అభిమానులున్నారని అన్నారు కదా..?

శివారెడ్డి: అది ఆయన గొప్పమనసు. నన్ను ఎంకరేజ్‌ చేసే విధానమది. వాళ్లకు లేని అభిమానులు నాకున్నారని అనుకోను. శివారెడ్డికి ఇన్ని టాలెంట్లున్నాయి. ఆయన్ని చూస్తే అసూయ పుడుతుంది. అందరు హీరోల అభిమానులు ఆయన్ని అభిమానిస్తారని చెప్పారు. నాకైతే సంవత్సరం అన్నం తినకపోయినా ఫరవాలేదనిపించింది. 

మళ్లీ హీరోగా సినిమా చేస్తున్నారా..?

శివారెడ్డి: ఏదో చిన్న సినిమా చేస్తున్నా. సినిమా పేరు రెంట్‌ నాట్‌ ఫర్‌ సేల్‌. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. దూకుడులో మంచి పాత్ర వేసినా, అందరూ బాగుందని మెచ్చుకున్నా సినిమాలైతే రాలేదు. ఏడాది పాటు అన్ని ఆఫీసులకు వెళ్లా. చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. కానీ పెద్దగా ఎలివేట్‌ కాలేదు.

చాలా అవార్డులు అందుకున్నారు. అందులో నంది అవార్డు కూడా ఉంది కదా..?

శివారెడ్డి: భరత ముని అవార్డులు ఆరు, బహుముఖ నట ధ్వని అనుకరణ అవార్డు, న్యూజిలాండ్‌లో మిమిక్రీ మాస్ట్రో, కామెడీ కింగ్‌, రేలంగి, జంధ్యాల లాంటి అవార్డులు చాలా వచ్చాయి. వాటిని చూసుకుంటూ మురిసిపోతా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని