Chiranjeevi: అజయ్‌.. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది: చిరంజీవి

జాతీయ చలనచిత్ర పురస్కారాలు సొంతం చేసుకున్న నటీనటులు, చిత్రబృందాలకు అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలిపారు....

Published : 24 Jul 2022 02:20 IST

హైదరాబాద్‌: జాతీయ చలనచిత్ర పురస్కారాలు సొంతం చేసుకున్న నటీనటులు, చిత్రబృందాలకు అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలిపారు. ఉత్తమ నటుడి విభాగంలో అవార్డులు సొంతం చేసుకున్న సూర్య (Suriya), అజయ్‌దేవగణ్‌కు (Ajay Devgn) ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సూర్యకు నా అభినందనలు. నీ పుట్టినరోజు సమయంలో ఇది రావడం మరింత ప్రత్యేకంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సూర్య.. నీకు మరిన్ని ప్రశంసలు దక్కాలని కోరుకుంటున్నా. మిత్రుడు అజయ్‌దేవ్‌గణ్‌ మూడోసారి జాతీయ అవార్డు సొంతం చేసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కించుకున్న తమన్‌, ‘కలర్‌ఫొటో’, ‘సూరరై పోట్రు’ చిత్రబృందాలకు మనస్ఫూర్తిగా అభినందనలు’’ అంటూ చిరు వరుస ట్వీట్స్‌ చేశారు. చిరంజీవితోపాటు మోహన్‌లాల్‌, మమ్ముట్టి, శరత్‌కుమార్‌, రాధిక, సుహాసిని, కాజోల్‌, మాధవన్‌, మంచు విష్ణు.. ఇలా పలువురు సినీ ప్రముఖులు సైతం జాతీయ అవార్డులు దక్కించుకున్న వారందరికీ విషెస్‌ తెలుపుతూ పోస్టులు పెట్టారు.

2020కిగానూ కథాకథనాలు, నటనా ప్రతిభతో అత్యుత్తమంగా నిలిచిన చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 68వ జాతీయ పురస్కారాలు (National Awards) ప్రకటించింది. ఎయిర్‌డెక్కన్‌ అధినేత జి.ఆర్‌.గోపినాథ్‌ జీవితకథతో తెలుగు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ (Soorarai Pottru) జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య (Suriya) ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి (Aparna Balamurali) ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ (Tanhaji)లో నటించిన అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn).. సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన ‘కలర్‌ ఫొటో’ (Colour Photo) తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది.









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని