Varalakshmi Sarathkumar: ఇండస్ట్రీకి మరో లేడీ విలన్‌ దొరికింది.. ఫ్యాన్స్‌ ట్వీట్స్‌

టాలీవుడ్‌లో లేడీ విలన్స్‌ చాలా అరదుగా కనిపిస్తారు. అప్పట్లో రమ్యకృష్ణ (Ramya Krishnan) మహిళా ప్రతినాయికగా అలరించగా.. ఇప్పుడు అదే స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌(Varalakshmi Sarathkumar).

Published : 16 Jan 2023 08:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు రమ్యకృష్ణ (Ramya Krishnan). ‘నరసింహా’, ‘నీలాంబరి’ చిత్రాల్లో ప్రతినాయికగా, హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందర్నీ కట్టిపడేసింది. ఇప్పుడు జనరేషన్‌ మారింది. ఇండస్ట్రీకి ఎంతోమంది నటీమణులు వస్తున్నారు కథానాయికగా పేరు తెచ్చుకుంటున్నారు. లేడీ విలన్‌ స్థానాన్ని మాత్రం భర్తీ చేసే వాళ్లు ఇంకా రాలేదని కొంతకాలం క్రితం వరకూ పలువురు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. లేడీ విలన్‌ స్థానాన్ని భర్తీ చేయడానికి ఓ నటి వచ్చిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar)‌.

పరిచయం ఇలా..!

కోలీవుడ్‌ నటుడు శరత్‌కుమార్‌ (Sarathkumar) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. గ్లామర్‌తోపాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌నూ పోషించారు.  ‘పందెంకోడి-2’, ‘సర్కార్‌’, ‘మారి 2’ చిత్రాలు ఆమె కెరీర్‌నే మార్చేశాయి. ముఖ్యంగా విశాల్‌ హీరోగా నటించిన ‘పందెంకోడి-2’లో వరలక్ష్మి.. ప్రతినాయిక పాత్రలో అక్కడి వారిని అలరించారు. దీంతో తమిళంలో ఆమెకు మంచి పేరు వచ్చింది.

తొలి అవకాశం పర్వాలేదు..!

‘పందెంకోడి’లో వరలక్ష్మి నటనకు ఫిదా అయిన తెలుగు దర్శకుడు నాగేశ్వర రెడ్డి ఆమెకు టాలీవుడ్‌లో మొదటి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన తెరకెక్కించిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’లో ఆమె పూర్తిస్థాయి విలన్‌గా రాణించారు. ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ వరూ రోల్‌కు మాత్రం పాజిటివ్‌ రివ్యూలే వచ్చాయి.

స్టార్‌ని చేసిన క్రాక్‌..!

వరలక్ష్మికి తెలుగులో స్టార్‌ ఇమేజ్‌ అందించిన చిత్రం ‘క్రాక్‌’ (Krack). గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె జయమ్మగా నటించారు. విలన్‌కు (సముద్రఖని) సపోర్ట్‌గా ఉంటూ.. అతడి ఎదుగుదలకు కారణమై.. చివరికి అతడి చేతిలోనే ప్రాణాలు వదిలే పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్‌ వాయిస్‌ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది.

‘యశోద’లో సాఫ్ట్‌గా..!

సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యశోద’ (Yashoda). సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి విలన్‌గా నటించారు. మంత్రి భార్యగా.. ఓ ఆస్పత్రికి యజమానిగా సినిమా ఆరంభంలో కనిపించిన ఆమె ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి విలన్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు.

‘వీర సింహారెడ్డి’ అదుర్స్‌..!

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) వరలక్ష్మికి తెలుగులో మరో హిట్‌ ఇచ్చింది. ఇందులో ఆమె భానుమతి పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించారు. ఇష్టమైన వ్యక్తికి దూరమై.. అన్నయ్యపై పగ తీర్చుకునే రోల్‌లో ఆమె నటన అందర్నీ కట్టిపడేసింది. సీమ యాసలో ఆమె చెప్పే పవర్‌ఫుల్‌ సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమా విడుదలయ్యాక.. ఇందులో ఆమె నటన చూసి టాలీవుడ్‌ ఇండస్ట్రీకి మరో లేడీ విలన్‌ వచ్చేసిందంటూ వరుస కామెంట్స్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని