బొమ్మ థియేటర్లోనే పడాలని..!

ఒక సినిమా చిత్రీకరణ పూర్తికాగానే ఎప్పుడెప్పడు విడుదల చేద్దామా.. అని అటు నిర్మాతలు, ఎప్పుడెప్పుడు చూసేద్దామా.. అని ఇటు ప్రేక్షకులు తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. అందులోనూ ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపించిన సినిమాలు సరైన సమయానికి విడుదల కాకుంటే ఉస్సూరుమంటారు. సాధారణంగా

Published : 11 Jan 2021 17:48 IST

ఒక సినిమా చిత్రీకరణ పూర్తికాగానే ఎప్పుడెప్పుడు విడుదల చేద్దామా.. అని అటు నిర్మాతలు, ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఇటు ప్రేక్షకులు తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. కానీ కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌.. థియేటర్లో బొమ్మ పడకుండా చేసింది. చాలా చిత్రాలు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించాయి. మరికొన్ని సినిమాలకు ఓటీటీలు పెద్దమొత్తంలో ఆఫర్‌ చేసినా థియేటర్లలోనే విడుదల చేయాలని సదరు నిర్మాణ సంస్థలు నో చెప్పాయి. అలాంటి సినిమాలపై ఓ లుక్కేద్దామా..

పాటలతో ఎగసిన ఉప్పెన..!

 

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తూ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది మేలోనే విడుదలవ్వాల్సింది. కానీ లాక్‌డౌన్‌తో విడుదలకు బ్రేక్ పడింది. ఓటీటీ కంపెనీలు ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఆఫర్ చేశాయి. కానీ మెగా మేనల్లుడు తొలిచిత్రం కావడంతో అభిమానుల ఈలల, గోలలు మిస్‌ కాకూడదని భావించారేమో.. తిరస్కరించారు. అప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేసిన లిరికల్‌ సాంగ్స్‌కు సంగీత ప్రియులు ఫిదా అయ్యారు. అంతలా సంగీతంతో అదరగొట్టారు దేవిశ్రీ. ముఖ్యంగా ‘నీ కన్ను నీలి సముద్రం’ యువత గుండెల్లోకి చొచ్చుకుపోయింది. అయితే ఈ మధ్యనే థియేటర్లు తెరుచుకున్న వేళ ‘ఉప్పెన’ను ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.

రామ్‌ ‘రెడ్‌’

గతేడాది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అంటూ సినీ అభిమానులకు మంచి జోష్ ఇచ్చిన యువ కథానాయకుడు రామ్‌. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్ర ‘రెడ్‌’. తమిళ చిత్రం ‘తడమ్‌’కు రీమేక్‌గా ఇది రూపొందింది. తొలిసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించాలని రామ్‌ అనుకున్నారు. కానీ, ఆయన ఎనర్జీకి కరోనా, లాక్‌డౌన్‌ బ్రేకులు వేసింది. ఆ మధ్య ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా రానుందని పుకార్లు వచ్చినా నిర్మాత స్రవంతి రవికిషోర్‌ వాటిని కొట్టిపారేశారు. తమ చిత్రం థియేటర్లలోనే సందడి చేస్తుందని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రెడ్‌’ చిత్రం 2021 సంక్రాంతి బరిలో నిలిచింది.

ఇళయదళపతి ‘మాస్టర్‌’

తమిళనాట అగ్రకథానాయకుల్లో ఒకరైన దళపతి విజయ్‌ నటించిన చిత్రం ‘మాస్టర్‌’. ‘ఖైదీ’తో అందరి దృష్టిని ఆకర్షించిన లోకేష్‌ కనగరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్నాయి. అన్ని ప్రముఖ ఓటీటీలు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి భారీ మొత్తంలో ఆఫర్ చేశాయి. అయితే అత్యధిక అభిమానులున్న విజయ్ సినిమా థియేటర్లో ఆడాల్సిందేనన్న మాటకు చిత్ర నిర్మాణ సంస్థ కమిట్‌ అయ్యింది. సంక్రాతికి ఈ మాస్టర్‌ థియేటర్లో క్లాస్‌ తీసుకుంటాడు. సిద్ధంగా ఉండండి.

రానా..అరణ్య

మూస కథల జోలికి పోకుండా ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు దగ్గుబాటి రానా. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ మానవుల బాధ్యత అని తెలియజేసే కథాంశంతో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీలో విడుదల చేస్తారనుకున్నారు. కానీ థియేటర్‌కే చిత్ర బృందం మొగ్గు చూపింది.

‘83’ సందడితో థియేటర్‌ ‘కప్పు’ లేచిపోవాలి

భారతీయ క్రికెట్‌కు ఊపిరిలూదిన కపిల్‌ డెవిల్స్‌ ‘1983 ప్రపంచ కప్‌’ ప్రయాణాన్ని తెరపై చూపించే ప్రయత్నం ‘83’. రణ్‌వీర్‌సింగ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రేక్షకులు ఆ మూవీ మ్యాచ్‌లను చూడలేకపోయారు. ఓటీటీ జోలికి అస్సలు పోమంటూ మొదటి నుంచి చెప్తున్న చిత్ర నిర్మాణ సంస్థ ఎట్టకేలకు థియేటర్‌ ‘గ్రౌండ్స్‌’ను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. జనవరి 22న ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ సినిమా చూసి అలనాటి వింటేజ్‌ క్రికెట్‌ను నెమరేసుకోవాలని సినీ,క్రీడాభిమానుల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అక్షయ్‌ సూర్యవంశీ..

ఫటాఫట్‌ అంటూ సినిమాలు తీసేస్తూ ప్రేక్షకులకెప్పుడూ థియేటర్లోనే కనిపించే అక్షయ్‌కుమార్‌ ఈ సారి లాక్‌డౌన్‌ దెబ్బకు కాస్త విశ్రాంతి తీసుకున్నారని చెప్పొచ్చు. మాస్‌ పల్స్‌తో సూపర్‌హీరోస్‌ సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన రోహిత్‌శెట్టి దర్శకత్వంలో ఆయన నటించిన ‘సూర్యవంశీ’ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ‘సింగం’ అజయ్‌దేవగన్‌, ‘సింబా’ రణవీర్‌సింగ్‌ తళుక్కున మెరిసిన ఈ చిత్ర ట్రైలర్‌ అభిమానుల దిల్‌ఖుష్‌ చేసింది. అధికారికంగా విడుదల తేది ప్రకటించపోయినప్పటికి 2021 జనవరి, మార్చి నెలల మధ్యలో విడుదల చేయొచ్చని బీటౌన్‌ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని