Dhanush: అందుకు ఇప్పటికీ చింతిస్తున్నా.. మీరు నాలాగా చేయకండి: ధనుష్‌

ధనుష్‌ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ధనుష్‌ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు.

Published : 14 Feb 2023 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చదువును నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని, తనలాగా అభిమానులు చేయకూడదని ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush) విజ్ఞప్తి చేశారు. తాను హీరోగా నటించిన ‘వాది’ (Vaathi) సినిమా ఆడియో విడుదల వేడుకలో స్టూడెంట్‌ లైఫ్‌ను గుర్తుచేసుకున్నారు. టాలీవుడ్‌ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ద్విభాషా చిత్రమిది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో ‘సార్‌’ (Sir) పేరుతో అదే రోజు విడుదలకానుంది.

ధనుష్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో వెంకీ అట్లూరి ఈ చిత్ర కథ వినిపించేందుకు నన్ను కలిశారు. అప్పుడు నాకు స్క్రిప్టు వినే మూడ్‌ లేదు. ముందుగానే నో చెప్పడం ఎందుకు? అనుకుని పూర్తయ్యాక.. నటించేందుకు ఇష్టంలేదని చెప్పాలనుకున్నా. విచిత్రమేంటంటే స్టోరీ వినడం అయిపోగానే అతణ్ని నేను అడిగిన ప్రశ్న ‘మీకు నా డేట్స్‌ ఎప్పుడు కావాలి?’. ఎందుకంటే కథను మించి అందులోని సందేశం నాకు బాగా నచ్చింది. ‘విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యంతో సమానం సర్‌.. పంచండి. ఫైవ్‌స్టార్‌లో డిషెస్‌లా అమ్మకండి’ అనే డైలాగ్‌ను మీరు టీజర్‌లో వినే ఉంటారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ అదే. సందేశంతోపాటు కామెడీ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. 90ల్లో సాగే కథ ఇది’’ అని తెలిపారు.

వారి కష్టం ఇప్పుడర్థమవుతోంది..

‘‘మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే అర్థమవుతోంది. చదువుకోవాల్సిన సమయంలో నేను అల్లరి పనులు చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరా. ట్యూషన్‌ టీచర్‌ ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్‌ మానేశా. స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్‌ చేసేవాణ్ని. దాంతో, టీచర్‌ నాపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరంతా బాగా చదువుకుని, పరీక్షలు పాసై ఉన్నత స్థానంలో ఉంటారు. బయట వాహనంతో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్‌ చేసుకోవాల్సిందే’’ అని అక్కడున్న వారితో అన్నారట. ఆయన చెప్పినట్టు తమిళనాడులో నేను డ్యాన్స్‌ చేయని వీధంటూ ఏదీ లేదు (నవ్వుతూ..). వెనక్కి తిరిగి చూస్తే.. నేనెందుకు తరగతులకు హాజరుకాలేదు? అని ఇప్పటికీ చింతిస్తున్నా. మీరు నాలాగా చేయకండి’’ అని ధనుష్‌ తన ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని