Mega Releases: ఐదుగురు హీరోలు.. నాలుగు సినిమాలు.. ‘మెగా’ రిలీజ్‌లు ఎప్పుడంటే

ఐదుగురు మెగా హీరోలు నటించిన నాలుగు సినిమాలు నెల రోజుల వ్యవధిలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఏ హీరో ఎప్పుడు వస్తున్నాడో చూద్దాం.

Updated : 10 Jul 2023 15:52 IST

హైదరాబాద్‌: మెగా కాంపౌండ్‌ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక రానున్న నెల రోజులు అలా ఎదురుచూసే వారికి పండగే అని చెప్పాలి. ఎందుకంటే నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుగురు మెగా హీరోలు బిగ్‌ స్క్రీన్‌పై కనిపించనున్నారు. నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో తగ్గేదేలే అంటున్నారు. వారానికి ఒక హీరో చొప్పున ఆడియన్స్‌కు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మరి ఏ హీరో ఎప్పుడు వస్తున్నాడంటే..

డబుల్‌ పవర్‌తో ‘బ్రో’..

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన సినిమా ‘బ్రో’ (BRO). ఈ మెగా మల్టీస్టారర్‌ ప్రకటించిన దగ్గరి నుంచే అందరినీ ఆకర్షించింది. ‘విరూపాక్ష’తో సూపర్‌ హిట్‌ అందుకున్న సాయి ధరమ్‌తేజ్‌ అదే జోష్‌తో ఈ మూవీని పూర్తి చేశారు. ఇక పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో మరోసారి దేవుడి పాత్రలో కనిపిస్తుండడంతో దీని మీద అంచనాలు పెరిగాయి. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘వినోదాయ సిద్ధం’కి రీమేక్‌గా, ఫాంటసీ, ఆధ్యాత్మిక అంశాల మేళవింపుగా ‘బ్రో’ రూపొందింది. కేతికాశర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రఖని దర్శకత్వం వహించగా.. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు.

సిస్టర్‌ సెంటిమెంట్‌తో ‘భోళా శంకర్‌’.. 

తనస్టైల్‌లో డైలాగులు చెబుతూ ‘భోళా శంకర్‌’ (Bhola shankar)పై అంచనాలు పెంచేశారు చిరంజీవి (Chiranjeevi). అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీని ట్రైలర్, పాటలు భారీగా ప్రేక్షకాదరణ పొందాయి. ‘చిరు లీక్స్‌’ అంటూ షూటింగ్‌ లోకేషన్లలోని చిత్రాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ చిరంజీవి సందడి చేశారు. ఆయన సరసన తమన్నా (Tamannaah Bhatia) నటిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌, సుశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూర్తి స్థాయి సిస్టర్‌ సెంటిమెంట్‌తో ఇది తెరకెక్కినట్లు సమాచారం. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు.

మాస్‌ కథతో ‘ఆదికేశవ’..

టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ శ్రీలీలతో కలిసి ‘ఆదికేశవ’ (Adikeshava)తో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej). మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిదని మూవీ యూనిట్‌ తెలిపింది. వైష్ణవ్‌ ఇందులో రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక శ్రీలీల (Sreeleela) చిత్రగా అలరించనుంది. ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

భారీ బడ్జెట్‌తో ‘గాండీవధారి అర్జున’..

గత కొన్ని రోజులుగా  వరుణ్‌ తేజ్‌ పేరు ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. సింగిల్‌ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)తో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు ఈ హీరో. ఆ విశేషాలతో పాటు ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సంగతులను కూడా షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చారు వరుణ్‌తేజ్‌ (Varun Tej). తన కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రమిదని.. గాఢతతో కూడిన ఓ బలమైన పాత్రలో ఆయన కనిపిస్తారని సమాచారం. ఇటీవలే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఏ పోటీ లేకుండా వారానికి ఒక విడుదలను ప్లాన్ చేసుకున్నారు మెగాహీరోలు. విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని