Salaar: ‘సలార్‌’ టీజర్‌.. సింపుల్‌ ఇంగ్లిష్‌తో వావ్‌ అనిపించిన యాక్టర్‌.. ఎవరీ టీనూ ఆనంద్‌?

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన టీనూ ఆనంద్‌ గురించి ప్రత్యేక కథనం..

Updated : 06 Jul 2023 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా? అని ప్రభాస్‌ (Prabhas) అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్‌’ (Salaar Teaser) టీజర్‌ గురువారం తెల్లవారుజామున విడుదలైంది. సుమారు 11 గంటల్లోనే 30 మిలియన్స్‌కిపైగా వ్యూస్‌ దక్కించుకుని, యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో నంబరు 1 స్థానంలో నిలిచింది. యాక్షన్స్‌ సీక్వెన్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తోపాటు హీరోని ఎలివేట్‌ చేసే ఓ కీలక పాత్ర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘సింపుల్‌ ఇంగ్లిష్‌.. నో కన్‌ఫ్యూజన్‌. లయన్‌, చీతా, టైగర్‌, ఎలిఫెంట్‌ వెరీ డేంజరస్‌..’ అంటూ ఆ క్యారెక్టర్‌ చెప్పిన డైలాగ్‌ వావ్‌ అనిపించింది. దాంతో, ఆ కీ రోల్‌ ప్లే చేసిన నటుడి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనెవరో కాదు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌ (Tinnu Anand).

1991లో పరిచయం..

టీనూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1991లో బాలకృష్ణ హీరోగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ (Aditya 369)తో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రయోగాలు చేసే ప్రొఫెసర్‌ రామ్‌దాస్‌గా నటించారు. ఆ తర్వాత, ‘అంజి’(Anji)లో ప్రధాన విలన్‌ వీరేంద్ర భాటియాగా కనిపించారు. చిరంజీవి హీరోగా దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. గతంలో ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘సాహో’ (Saaho)లోనూ టీనూ నటించారు. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ (Sita Ramam)లో కీలక పాత్ర పోషించారు. ఆయన తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా వైవిధ్య భరిత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు.

కేజీయఫ్‌తో వారు.. సలార్‌తో టీనూ

‘కేజీయఫ్‌’ (KGF) సిరీస్‌ చిత్రాల విజయం అనంతరం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సినిమాకావడంతో ‘సలార్‌’ (Salaar)పై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌ రాకతో అవి రెట్టింపవుతున్నాయి. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌తోపాటు హీరోని ఎలివేట్‌ చేసే పాత్రలనూ ప్రశాంత్‌ నీల్‌ చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తుంటారు. వాటిని ప్రచార చిత్రాల్లోనూ హైలైట్‌ చేస్తుంటారు. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ (KGF Chapter 1)లో.. ‘నరాచీ లైమ్‌స్టోన్‌ కార్పొరేషన్‌’.. పేరిట జరుగుతున్న హింసను ప్రపంచానికి తెలియజేసేందుకు ‘ఎల్‌ డొరాడో’ అనే పుస్తకాన్ని రాసిన రచయిత, జర్నలిస్టు ఆనంద్‌ వాసిరాజ్‌గా అనంత్‌ నాగ్‌ నటించిన సంగతి తెలిసిందే. హీరోయిజాన్ని ప్రేక్షకులకు తెలియజేసేలా ‘విధి చేతివాటం. ఆ రాత్రి రెండు సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది. అతనూ పుట్టాడు’ అని ఆయన చెప్పే డైలాగ్‌తోనే ఆ సినిమా ట్రైలర్‌ మొదలవుతుంది. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (KGF Chapter 2)లో అనంత్‌ నాగ్‌ తనయుడిగా ప్రకాశ్‌ రాజ్‌ ఒదిగిపోయారు. ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తోనే ‘కేజీయఫ్‌ 2’ ట్రైలర్‌ మొదలవుతుంది. ఇప్పుడు ‘సలార్‌’ ప్రపంచాన్ని టీనూనే పరిచయం చేయడంతో అనంత్‌ నాగ్‌, ప్రకాశ్‌ రాజ్‌ తరహాలోనే టీనూ పాత్ర ప్రత్యేకంగా ఉండనుందని, వారిలానే టీనూకు విశేష క్రేజ్‌ దక్కుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీనూ నేపథ్యం..

ప్రముఖ రచయిత ఇందర్‌రాజ్‌ ఆనంద్‌ తనయుడైన టీనూ ఆనంద్‌ అసలు పేరు వీరేందర్‌ రాజ్‌ ఆనంద్‌. బాల్యంలోనే టీనూకి సినిమాలపై ఆసక్తి కలిగింది. సినిమా రంగంలోకి వద్దని తన తండ్రి ఎంత చెప్పినా టీనూ వినిపించుకోలేదు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్‌ రే దగ్గర ఆయన పలు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘ఏక్‌ హిందుస్థానీ’, ‘మేజర్‌ సాబ్‌’, ‘దునియా మేరీ జేబ్‌ మే’వంటి సినిమాకు దర్శకత్వం వహించిన టీనూ కొన్నాళ్లకు నటనవైపు అడుగేశారు. హిందీ, కన్నడ, తమిళం, మలయాళం చిత్రాల్లోనూ యాక్ట్‌ చేశారు. ‘వార్‌’, ‘పఠాన్‌’వంటి యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌.. టీనూ మేనల్లుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని