ఈ సినిమా ఏడాది తర్వాత చేద్దామనుకున్నాం!

అభిమానులు, ప్రేక్షకులు తమ చిత్ర బృందానికి జనవరి 11నే సంక్రాంతి పండగను తీసుకొచ్చారని అన్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన...

Updated : 12 Jan 2020 20:37 IST

హైదరాబాద్‌: అభిమానులు, ప్రేక్షకులు తమ చిత్ర బృందానికి జనవరి 11నే సంక్రాంతి పండగను తీసుకొచ్చారని అన్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మహేశ్‌, విజయశాంతిల నటన, కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర బృందం థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ.. ‘‘జనవరి 11నే మాకు సంక్రాంతి పండగను ఇచ్చిన అభిమానులకు, ప్రేక్షకులకు నిజంగా ధన్యవాదాలు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటుంటే నిజంగా అద్భుతంగా అనిపించింది. ప్రొఫెసర్‌ భారతి పాత్రను విజయశాంతి తప్ప మరొకరు చేయలేరు. ‘దూకుడు’ తర్వాత నేను చేసిన సినిమాలన్నీ కంటెంట్‌ ఉన్న సినిమాలు. వాటి స్క్రిప్ట్‌నకు కట్టుబడి ఉండాలి. అందుకే అందులో అంత ఎనర్జిటిక్‌గా కనిపించలేదు. కానీ, ఈ సినిమాతో మరోసారి అలరించే పాత్రను చేశా. అనిల్‌ రావిపూడి ‘ఎఫ్2’ చేస్తుండగా నాకు ఈ సినిమా కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ‘నాకు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఏడాది తర్వాత చేద్దాం’ అని ఆయనతో చెప్పా. ‘ఓకే సర్‌.. ఈలోగా నేను కూడా ఇంకో సినిమా చేస్తా’నని నాతో అన్నారు. అయితే, ‘ఎఫ్‌2’ విడుదలైన వెంటనే ఫోన్‌ చేసి, ‘మనం సినిమా చేద్దాం’ అని అనిల్‌కు చెప్పా. ఆయన రెండు నెలల్లో స్క్రిప్ట్‌ మొత్తం పూర్తి చేసి తీసుకొచ్చారు. నిన్నటి నుంచి నా ఫీలింగ్‌ చాలా కొత్తగా ఉంది. అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆ క్రెడిట్‌ అనిల్‌ రావిపూడికే దక్కుతుంది. ఈ సినిమాకు ఇంత మంచి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. కానీ, ఆయనకు మాత్రం చాలా నమ్మకం ఉంది. రష్మిక, సంగీత సహా ఇతర నటీనటులు సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాట వినిపించినప్పుడు మాత్రం ఒళ్లు గగురుపొడ్చింది. రామ్‌-లక్ష్మణ్‌లు సమకూర్చిన ఫైట్స్‌ అందరినీ అలరిస్తున్నాయి. ఈ సినిమా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు. 

ఆ సన్నివేశంలో గ్లిజరిన్‌ వాడలేదు

‘‘చాలా ఏళ్ల విరామం తర్వాత ఒక మంచి సినిమా చేయడం సంతోషంగా ఉంది. అసలు సినిమాలే చేయొద్దని భీష్మించుకుని కూర్చొన్న సమయంలో అనిల్‌గారు కథ చెప్పి మరీ ఒప్పించారు. ‘కొడుకు దిద్దిన’ కాపురం తర్వాత మహేశ్‌బాబుతో పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఫోన్‌ చేసి ‘చాలా బాగా చేశారమ్మా.. మమ్మల్ని మళ్లీ ఏడిపించారమ్మా’అంటున్నారు. గతంలో నేను చేసిన ‘ఒసేయ్‌ రాములమ్మా’, ‘కర్తవ్యం’లో బరువైన పాత్రలు పోషించా. ఈ చిత్రంలోనూ అలాంటి పాత్రే నాకు లభించింది. ప్రీక్లైమాక్స్‌ చేస్తున్నప్పుడు నాకు తెలియని బాధ కలిగింది. ఆ సన్నివేశం కోసం గ్లిజరిన్‌ కూడా వాడలేదు. ఈ సినిమా చూసి వచ్చిన వాళ్లు, ఇందులోని ప్రతి డైలాగ్‌ గుర్తుపెట్టుకుని చెబుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్‌గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’అని విజయశాంతి చెప్పుకొచ్చారు. 

దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన అనిల్‌ సుంకరగారు, దిల్‌రాజుగారికి ధన్యవాదాలు. దేవిశ్రీ అద్భుతమైన పాటలు, అదిరిపోయే నేపథ్య సంగీతం ఇచ్చారు. సంగీత, రష్మికల నటన, కామెడీ టైమింగ్‌, రైల్లో చేసిన సందడి తదితర సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. విజయశాంతిగారి పాత్రను ఎవరూ రీప్లేస్‌ చేయలేరు. ఒక నటిగా ఆమె విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో మహేశ్‌-విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని అందరూ అంటున్నారు. ‘బాహుబలి’లో ప్రభాస్‌ శివ లింగాన్ని పైకెత్తినట్లు మహేశ్‌బాబు ఈ సినిమాను మొత్తం తన భుజాలపై  మోశారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని అన్నారు. కార్యక్రమంలో కథానాయిక రష్మిక, సంగీత, దిల్‌రాజు, అనిల్‌ సుంకర, రామ్‌-లక్ష్మణ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని