‘బిచ్చగాడు’లో అమ్మ పాత్ర నా కోసం రాశారు!

ప్రతి తెలుగింటిలో ఆ తులసి ఎలా ఎదిగి ఉంటుందో.. ప్రతి తెలుగువారి గుండెల్లో ఈ తులసి అలా నిలిచి ఉంటుంది. నడక నేర్చే వయసులో నటన నేర్చుకుంది. బడిలో చేరాల్సిన వయసులో కళామ్మతల్లి ఒడికి చేరుకుంది. నాలుగు దశాబ్దాలుగా ఎందరో అగ్ర కథానాయకులతో నటించి మెప్పించారు. మరెందరో అగ్ర దర్శకులను

Updated : 29 Oct 2023 10:47 IST

ప్రభాస్‌తో షాట్‌.. నేను కంగుతింటాననుకున్నారు!

ప్రతి తెలుగింటిలో ఆ తులసి ఎలా ఎదిగి ఉంటుందో.. ప్రతి తెలుగువారి గుండెల్లో ఈ తులసి అలా నిలిచి ఉంటుంది. నడక నేర్చే వయసులో నటన నేర్చుకుంది. బడిలో చేరాల్సిన వయసులో కళామతల్లి ఒడికి చేరుకుంది. నాలుగు దశాబ్దాలుగా ఎందరో అగ్ర కథానాయకులతో నటించి మెప్పించారు. మరెందరో అగ్ర దర్శకులను తన నటనతో ఆకట్టుకున్నారు. నటనా కౌశలంతో ఎందరో మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు సీనియర్‌ నటి తులసి. ఆనాటి జ్ఞాపకాలను ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్నారిలా...

మిమ్మల్ని ఏమని పిలవాలి? శివమణి తులసి అని పిలవాలా?

తులసి: నన్ను ఎప్పుడూ ‘తులసి’ అనే పిలుస్తారుగా, అలాగే పిలవండి. శివమణి  పేరు మధ్యలో వచ్చి చేరింది(నవ్వులు)

శివమణిని ఎక్కడ కలిశారు?

తులసి: ఆయన దర్శకత్వం వహించిన సినిమాలో అతిథి పాత్ర చేయమని అడిగారు. దేవరాజుగారు హీరో.. నిరోషా హీరోయిన్‌. ‘దేవరాజుగారి చిన్నప్పటి పాత్రకు తల్లిగా తులసి అయితే బాగుంటారు’ అని నన్ను పిలిపించారు. ఎందుకంటే అప్పటికే నేను కన్నడలో కాస్త ఫేమస్‌. అలా ఆయన పరిచయమయ్యారు. (మధ్యలో ఆలీ అందుకుని.. శివమణి అంటే డ్రమ్స్‌ వాయించే శివమణి కాదు.. దర్శకత్వం చేసే శివమణి ఇంకొకరు ఉన్నారు) అందరూ అదే అనుకుంటున్నారు. డ్రమ్‌ కాదు.. డైరెక్టర్‌(నవ్వులు) 

మీకెంతమంది పిల్లలు?

తులసి: ఒక కొడుకు. ప్రస్తుతం గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. 

మీ సొంతూరు ఏది?

తులసి: నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. అమ్మవాళ్లది తాడేపల్లిగూడెం. తాతయ్యకు మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేది. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా చెన్నై వచ్చేశారు. రావడంతోనే చెన్నైలో ఇల్లు కొనేశారు. అలా స్థిరపడిపోయారు. నాన్న బిజినెస్‌ చేసేవారు. నాకు మూడేళ్ల వయసు ఉండగా, ఆయన చనిపోయారు. అక్కడి నుంచి అన్నీ అమ్మే చూసుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. నా లోకం మొత్తం ఆవిడే. ఆమె చేసిన దానధర్మాల వల్లే మా కుటుంబం ఈ స్థాయిలో ఉంది. అందరికీ ఇవ్వడం ఆమే నేర్పించారు. నీకు సరిపోయినంత నువ్వు తీసుకుని, మిగిలినది పంచమని చెబుతూ ఉండేవారు. ఆ రోజుల్లో మా ఇంట్లో పనిచేసే వాళ్లకు ఏడు ఇళ్లు కట్టించి ఇచ్చారు. 

మీకు మూడు నెలల వయసు ఉండగా, ఓ సినిమాలో చిన్న పాప క్యారెక్టర్‌ అవసరమైతే, ‘తులసిని పెట్టండి’ అని ఒక పెద్ద నటి చెప్పారట!

తులసి: ఇంకెవరు? మహానటి సావిత్రిగారు. అమ్మకు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆవిడ. నేను పుట్టినప్పుడు ఆమె బిజీగా ఉండటంతో చూడటానికి రాలేదు. ఆ తర్వాత మూడు నెలలకు వచ్చారు. ఎంఎస్‌ రెడ్డిగారి ‘భార్య’ సినిమాలో బాబు పాత్రకు నన్ను తీసుకున్నారు. తొలిసారే అబ్బాయిగా నటించా(నవ్వులు)

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్ని సినిమాలు నటించారు?

తులసి: తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ కలిపి దాదాపు 120 సినిమాల్లో నటించా. 

‘శంకరాభరణం’ కాకుండా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మీకు బాగా పేరుతీసుకొచ్చిన పాత్ర ఏది?

తులసి: ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’కు నాకు మంచి పేరు వచ్చింది. నేను బాగా డ్యాన్స్‌ చేస్తానని అందరూ మెచ్చుకునేవారు. ఆ తర్వాత బాగా పేరు తీసుకొచ్చింది ‘సీతామహాలక్ష్మి’. అందులో నాది అబ్బాయి పాత్ర. అలా అబ్బాయిగా దాదాపు 75 సినిమాల్లో నటించా. కరుణానిధిగారు రాసిన కథ ‘వండిగర్‌మగన్‌’లోనూ నేను అబ్బాయిగా చేశా. 

చాలా మందికి ఫస్ట్‌ ఇన్నింగ్స్‌.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లు ఉంటాయి. మీరేంటి మూడో ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నారు.

తులసి: (నవ్వులు) మన పని మనం చేసుకుంటూ, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా క్రమశిక్షణతో ఉంటే చాలు. ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గా ఉండవచ్చు. ముఖ్యంగా ఎదుటివారిని చూసి ఈర్ష్య పడకుండా ఉంటే చాలు. 

సావిత్రితో కలిసి నటించారా? 

తులసి: ఎంఎస్‌ రాజుగారి తండ్రి ‘ముకద్దర్‌ కా సికిందర్‌’ రీమేక్‌ హక్కులు కొనుక్కొన్నారు. అందులో ‘ఓ సాథీరే..’ పాత్ర నాతో వేయించారు. ఆ సినిమా అనగానే, నన్ను ఫిక్స్‌ చేసేసుకున్నారు. అలా సావిత్రిగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది.

మనిద్దరం(ఆలీ) ఎప్పుడు కలిశామో తెలుసా? 

తులసి: ‘నెలవంక’ సినిమా సందర్భంగా కలిశాం. (ఆలీ సమాధానం చెబుతూ.. కాదు.. శోభన్‌బాబుగారి ‘దేవుడు మావయ్య’ సినిమా షూటింగ్‌లో కలిసి పని చేశాం. మధ్యలో ‘శంకరాభరణం’ ఆఫర్‌ వస్తే వెళ్లిపోయారు. అదొక పెద్ద ఇష్యూ అయింది. మీ స్థానంలో బెంగళూరు నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చి రీషూట్‌ చేశారు. ఆ సినిమాలో శోభన్‌బాబుగారు, సావిత్రిగారు, జగ్గయ్య, ఛాయాదేవి, పద్మనాభం వంటి పెద్ద నటులు ఉన్నారు. మరోవైపు తులసి, ఆలీ, బేబీ వరలక్ష్మి, బేబీ రాణి, బేబి సరస్వతి, సాయి కుమార్‌ తమ్ముడు రవిశంకర్‌, బేబి గౌరీ ఇలా పిల్లలంతా అందులో నటించాం. ఆ సినిమా తర్వాత వాణిశ్రీగారి వివాహం జరిగింది. దీంతో ఆ సినిమా ఏడాది పాటు వాయిదా పడింది. ఈ గ్యాప్‌లో మీరు వెళ్లిపోయారు) నాకు ‘నెలవంక ఎందుకు గుర్తుంది అంటే.. అప్పటికే మేము నటించడం మొదలు పెట్టాం. నువ్వు(ఆలీ) చైల్డ్ ఆర్టిస్ట్‌వి. జంధ్యాలగారు నిన్ను విపరీతంగా పొగిడేవారు. ‘వీడు మామూలోడు కాదు. ఏలేస్తాడు’ అని కెమెరామెన్‌ గోపాలరెడ్డిగారితో చెబుతుండేవారు. (వెంటనే ఆలీ అందుకుని.. అప్పుడు మనం షూటింగ్‌ చేసుకుని వస్తుంటే, గోదావరి నదిలో పడవపై వస్తుంటే విపరీతమైన వర్షం కురిసింది. పడవ మునిగిపోతుందేమో అనుకున్నాం. ఏదో దేవుడు మనల్ని కాపాడాడు.) 

‘శంకరాభరణం’ విజయాన్ని ఎలా ఆస్వాదించారు?

తులసి: సినిమా సక్సెస్‌ కావడం ఒకెత్తయితే. ఆ విజయోత్సవ కార్యక్రమాలను రెండేళ్ల పాటు నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా ప్రశంసలతో ముంచెత్తేవారు. విశ్వనాథ్‌గారితో పాటు వేదికపై చివరిలో నాకూ ఒక కుర్చీ వేసేవారు. అంత ప్రాధాన్యం ఉన్న పాత్రని అప్పుడు నాకు తెలియదు. 

ఏ సినిమా ద్వారా తొలిసారి విశ్వనాథ్‌గారితో కలిసి పనిచేశారు?

తులసి: ‘సీతామహాలక్ష్మి’.  మురారిగారి ఆఫీస్‌లో నాకు ట్రైనింగ్‌ ఇచ్చారు. సినిమా సిల్వర్‌ జూబ్లీ ఆడటంతో మురారిగారు ఇంటికి పిలిచి బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి నా కెరీర్‌లో బంగారం వస్తూనే ఉంది. 

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు? ఎన్ని సినిమాల్లో నటించారు?

తులసి: 1967. ఇప్పటివరకూ దాదాపు 378 సినిమాల్లో నటించా. పెళ్లయిన తర్వాత దాదాపు పదేళ్లు విరామం తీసుకున్నా. హీరోయిన్‌గా నా తొలి సినిమా ‘శుభలేఖలు’. 

పెద్ద హీరోలతో ఏ సినిమాలు చేశారు?

తులసి: బాలకృష్ణగారితో ‘డిస్కో కింగ్‌’ చేశా. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా బాలయ్య చాలా సింపుల్‌గా ఉంటారు. నాకు మంచి స్నేహితులు. ఇటీవల కలిసినప్పుడు ‘ఎలా ఉన్నారు సర్‌’ అంటే ‘ఏయ్‌ తులసి.. నన్ను సర్‌.. అంటావేంటి’ అంటూ చాలా సరదాగా మాట్లాడారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. సుమన్‌తో ‘కంచు కవచం’ చేశా. 

దర్శకుల్లో మీ మొదటి ప్రాధాన్యం ఎవరికి?

తులసి: ఇద్దరికి ఇవ్వాలి. ఒకరు విశ్వనాథ్‌గారు. మరొకరు బాపుగారు.  ‘కలియుగ రావణాసురుడు’ సినిమాకు బాపు దర్శకత్వం వహించారు.  ఆ తర్వాత ‘మంత్రిగారి వియ్యంకుడు’లో కూడా నటించా. మంచి పాత్ర ఇచ్చారు. 

‘కలియుగ రావణాసురుడు’ షూటింగ్‌ సమయంలో మురళీమోహన్‌బాగా ఏడిపించేవారట!

తులసి: అవును! ‘శంకరాభరణం’ సినిమాకే పెద్దదాన్ని అయిపోయా. బనియన్‌లు వేసి కవర్‌ చేశారు. ఇక ‘కలియుగ రావణాసురుడు’లో నేను మురళీమోహన్‌గారి కొడుకుగా నటించా. అందులో స్నానం చేసే సన్నివేశం ఉంది. నేను కప్పుకోవడానికి ఒక టవల్‌ ఇచ్చారు. చేతులు పైకెత్తాలంటే నాకు సిగ్గు. కొంచెం చేతులు పైకెత్తగానే మురళీ మోహన్‌గారు ‘నేను చూశా. నేను చూశా’ అంటూ ఆటపట్టించేవారు. ‘చూస్తే చూసుకోండి సర్‌.. ముందు షాట్‌ సరిగా చేయండి’ అని గట్టిగా అన్నాను. ‘అమ్మో ఇప్పుడే ఇలా ఉందేంటి’ అనేవారు. 

మీ వల్ల ఒక వ్యక్తి ఇప్పుడు స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరా వ్యక్తి?

తులసి: రఘుబాబు. అయితే, నా వల్ల ఈ స్థాయికి వచ్చాడని నేను చెప్పను. వాళ్ల బ్యానర్‌తో తను నిర్మించిన చిత్రంలో నేను నటించా. రఘు మంచి యాక్టర్‌ అని ఎప్పుడూ నాకు ఒక ఫీలింగ్‌ ఉండేది. వాళ్ల కుటుంబమంతా బాగా పరిచయం. తను వాయిస్‌లను మిమిక్రీ చేస్తాడు. ‘నువ్వు తప్పకుండా మంచి నటుడివి అవుతావు’ అని చెబుతుండేదానిని. అలా ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఒక సినిమాలో కూడా నటించాం.

గౌతమ్‌ మేనన్‌ ఆయన పుట్టినరోజుకు మీకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పించుకుంటారట!

తులసి: నేను ఎవరినైనా తొలిసారి కలిసినప్పుడు నా మాట తీరు వల్ల ‘మీరంటే మాకు ఇష్టం మేడమ్‌’ అని చెబుతుంటారు. అలా గౌతమ్‌ను కలిసినప్పుడు నేను చాలా పాజిటివ్‌గా మాట్లాడటం నచ్చింది. నేను కూడా ఆయనలో ఆ పాజిటివిటీని చూశా. 

‘డార్లింగ్‌’ చేస్తుంటే ఒక షాట్‌లో ప్రభాస్‌ చెవిపట్టుకుని డైలాగ్‌ చెప్పారట!

తులసి: అవును! నాకు క్లోజప్ షాట్‌ పెట్టి ప్రభాస్‌ కనిపించేలా డైలాగ్‌ చెప్పమన్నారు. అలా చెప్పగానే నేను కంగుతింటానని అనుకున్నారు. ఎలా చేస్తానా? అని అందరూ ఆసక్తి ఎదురు చూశారు. కెమెరా రోల్‌ అనగానే, ప్రభాస్‌ చెవి పట్టుకుని నా ముఖానికి దగ్గరగా తీసుకొచ్చి డైలాగ్‌ చెప్పా. అంతే అందరూ చప్పట్లు కొట్టారు. వందల సినిమాల్లో నటించడం వల్ల వచ్చే ఎక్స్‌పీరియన్స్‌ అది. 

ఛారిటీ ఏమైనా ప్రారంభించారా?

తులసి: కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. అవన్నీ చెప్పుకొంటే బాగుండదు. ఎవరికైనా సాయం చేయాలని అనిపిస్తే, వెంటనే చేస్తా. 

ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?

తులసి: నేను బెంగళూరులో ఉండేదాన్ని. మా అబ్బాయి చెన్నైలో ఉండటంతో నేనూ అక్కడికి వచ్చేశా. 

మీరు ఫేస్‌ చూసి జాతకాలు చెబుతారట! నేను(ఆలీ) అమెరికా అధ్యక్షుడిని ఎప్పుడవుతానో చెబుతారా?

తులసి: నేనేమీ జాతకాలు చెప్పను. ఇండియా ప్రెసిడెంట్‌కావు..ఇంకా అమెరికా ఎందుకు?(నవ్వులు) నేను అందరి మంచి కోరుకుంటా. అందుకే ఎదుటివాళ్లకు మంచి జరగాలని నేను అనుకున్నప్పుడు అది జరిగితే వాళ్లు సంతోషంగా ఫీలవుతారు. 

సాధారణంగా ఒక అబ్బాయి.. అమ్మాయిని చూస్తే.. మొదటి ప్రపోజ్‌ చేయడం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించడం.. పెళ్లి చేసుకోవడం చాలా సమయం పడుతుంది. కానీ, మీరేంటి ఉదయం చూసుకుని, మధ్యాహ్నం ప్రేమించుకుని, సాయంత్రం పెళ్లి చేసుకున్నారట! 

తులసి: ఏదైనా జరగాలంటే చిటికెలో అయిపోవాలి. అలాగే నా పెళ్లి కూడా అయిపోయింది. నేను సాయిబాబా భక్తురాలిని. నా పుట్టినరోజున తాతయ్య సాయిబాబా ఫొటో ముద్రించిన కార్డులను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. వాటిని ప్రతి యూనిట్‌లోనూ పంచేదాన్ని. అలా రెండో మూడో మిగిలితే శివమణిగారికి ఇచ్చా. మధ్యాహ్నం భోజనానికని ఆయన ఇంటికి వెళ్లి నేను ఇచ్చిన ఫొటోను పూజ గదిలో పెట్టారు. అనంతరం షూటింగ్‌కు వచ్చేటప్పుడు తాళి తీసుకొచ్చారు. సాయంత్రం పేకప్‌ చెప్పగానే నాకు విషయం చెప్పడంతో, వెళ్లి పెళ్లి చేసుకున్నాం. ఆయన ఇప్పటివరకూ దాదాపు 27 సినిమాలు డైరెక్ట్‌ చేశారు. ప్రస్తుతం నటిస్తున్నారు. 

‘శంకరాభరణం’ తర్వాత బాలసుబ్రహ్మణ్యంగారి కొడుకు ‘తులసి’ అని చెప్పేవారట నిజమేనా?

తులసి: ఆ సమయంలో చరణ్‌ పుట్టాడు. ‘శంకరాభరణం’లో తెరపై నేను పాడుతుంటే, నన్నే ఆయన కొడుకు అనుకునేవారు.

ఒక పాత్ర కోసం మీ దగ్గరకు ఓ డైరెక్టర్‌ వచ్చి రూ.10వేలు ఇస్తే, మూడు రోజుల వరకూ ఆ డబ్బులను కనీసం ముట్టుకోకుండా నిర్మాతను పిలిచి తీసుకెళ్లిపోమన్నారట!

తులసి: హిందీలో ‘ఇన్సాఫ్‌ కా తరాజు’ సినిమా కోసం నన్ను సంప్రదించారు. ఆరోజుల్లో అది పెద్ద సెన్సేషన్‌. పద్మినీ కొల్హాపూర్‌గారు చేశారు. ఆ పాత్ర నన్ను చేయమన్నారు. ఆ సమయంలో డబ్బు అవసరం ఉన్నా, ఒళ్లంతా చూపించేందుకు నాకు ఇష్టం లేదు. అందరి ముందు అలా నిలబడి చేయడం అవసరమా? అనిపించింది. ఇంట్లో వాళ్లు కూడా బలవంతం చేయలేదు. ‘ఆలోచించి నిర్ణయం తీసుకో. మనకు డబ్బు అవసరం ఉంది’ అని మా పెద్దనాన్న చెప్పారు. ‘నేను చేయను’ అని చెప్పాను. ‘మనం అప్పుడప్పుడూ గంజి తాగి బతుకుతున్నాం కదా. ఆ గంజే మరో రెండు రోజులు తాగుతావేమో. ఇలా శరీరం చూపించే పాత్రను చేయలేను’ అని అన్నాను. ఆ పాత్రను చేయకపోవడమే నాకు మంచిదయింది.

మీది స్థితిమంతుల కుటుంబమే కదా! మరి గంజితాగే పరిస్థితి ఎందుకు వచ్చింది?

తులసి: మా అమ్మ చాలా అమాయకురాలు. పనివాళ్లను పెట్టుకుని కుటుంబాన్ని నడపటం సాధ్యమయ్యే పనికాదు. చాలా డబ్బు ఖర్చయిపోయింది. బయటవాళ్లకు దానధర్మాలు చేసేవారు. మరోవైపు మా అత్తగారి కుటుంబం కూడా చాలా చిన్నది. వాళ్లకు రెండు ఆవులు ఉండేవి. ఆవిడ ఇంకొకరి ఇంట్లో పనిచేసేవారు. ఆ కుటుంబం నుంచి శివమణి వచ్చారు. ఆయన నచ్చారు. పెళ్లి చేసుకున్నా. ఆయన్నే ఎందుకు చేసుకున్నానంటే.. షూటింగ్‌ సమయంలో ఆయన సిగరెట్‌ తాగుంటే నాకు దగ్గు వచ్చింది. వెంటనే ఆయన సిగరెట్‌.. లైటర్‌ కూడా పడేశారు. ఒక మనిషికున్న సిగరెట్‌ అలవాటును మానుకోవడం సాధారణమైన విషయం కాదు. ఆ తర్వాత మళ్లీ సిగరెట్‌ ముట్టుకోలేదు.  అలా నచ్చేశారు. 

మీ తాతగారిని అడగకుండా ఇందిరాగాంధీ అడుగు కూడా వేసేవారు కాదని అప్పట్లో అనుకునేవారు నిజమేనా?

తులసి: ఇందిరాగాంధీగారికి మా తాతగారు ఆధ్యాత్మిక సలహాదారు. జాతకాలు చెప్పేవారు. 37ఏళ్ల పాటు పాటు దిల్లీలో ఉన్నారు. ఆమె బయటకు వెళ్లాలంటే తాతగారిని సలహా అడిగేవారు. అయితే, ఆమె చనిపోయే రెండేళ్ల ముందు తాత చెన్నై వచ్చేశారు. అక్కడ బాబా గుడి ముందు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. చెన్నైలో సాయిబాబా గురించి ఎక్కువగా ప్రచారం చేసింది నరసింహస్వామిజీ, ఆ తర్వాత రాధాకృష్ణ స్వామీజీ ఆయన తర్వాత మా తాతగారు. 

తులసి హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి మీ తలపొగరు కారణమని అప్పట్లో అనేవారు? మీరు దీన్ని ఒప్పుకొంటారా?

తులసి: నేను హీరోయిన్‌ కావాలని అనుకోలేదు. ఒక స్థాయి వరకూ మాత్రమే హీరోయిన్‌ను కావాలని అనుకున్నా. ఆ స్థాయి దాటితే కష్టాలు మొదలవుతాయి. తల పొగరు నాకు లేదు. ప్రతి మనిషికి వాంట్(want) నీడ్‌(need) అనేవి రెండు ఉంటాయి. నేను నీడ్‌కు కాస్త తక్కువగా కోరుకున్నా. డబ్బులు కావాలనుకుంటే ఆ పదివేలు తీసుకుని ఒళ్లు చూపించేదాన్ని కదా! పాత్రల ఎంపిక విషయంలో చాలా స్పష్టతతో ఉన్నా. 

మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని ప్రపోజల్స్‌ ఏవీ రాలేదా?

తులసి: చాలా వచ్చాయి. వాటిల్లో నాలుగైదు పెద్ద సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లంతా సింగర్లు, యాక్టర్లు. 

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసి, మళ్లీ ఆ హీరో పక్కనే హీరోయిన్‌గా చేసే అవకాశం శ్రీదేవి, తులసిలకు మాత్రమే దక్కిందనుకుంటా!

తులసి: అవును! చంద్రమోహన్‌గారి పక్క అలా నటించా.

‘చందమామ’లో ఆహుతి ప్రసాద్‌ క్యారెక్టర్‌లో మిమ్మల్ని అనుకున్నారట!

తులసి: తొలుత అమ్మ పాత్ర గయ్యాళిగా అనుకున్నారు. అందుకు నేనైతే బాగుంటుందని వంశీగారు భావించారు. కానీ, నాకు కుదరలేదు. దాంతో ఆ పాత్రను మార్చేసి, ఆహుతి ప్రసాద్‌గారికి ఆ క్యారెక్టర్‌ ఆపాదించారు. అసలు ఆ సినిమాలో అమ్మ పాత్రనే తీసేశారు. ‘నక్షత్రం’, ‘శశిరేఖా పరిణయం’ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. 

ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం!

తులసి: కొరటాల శివ. రాజమౌళిగారితో పనిచేయలేదు కానీ, ఆయన సినిమాల్లో నటించాలని ఉంది. పూరిగారి సినిమాల్లోని పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఒకసారి మా అబ్బాయికి ఏదో అవసరం గురించి ఫోన్‌ చేస్తే.. వెంటనే చేస్తానని చెప్పారు. 

బాపు-రమణలు చాలా తక్కువ మాట్లాడతారు! అదే సెట్‌లో తులసి ఉంటే బాగా మాట్లాడేవారట!

తులసి: నాతో చాలా సరదాగా మాట్లాడేవారు. వాళ్ల పక్కనే నాకూ కుర్చీ వేసేవారు. బాపుగారి ఫైల్స్‌ను నేను పట్టుకుని సెట్‌లో తిరుగుతూ ఉండేదాన్ని. 

ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు!

తులసి: మలయాళంలో మోహన్‌లాల్‌గారితో చేస్తున్నా. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్నా. ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి పాత్రను నన్ను దృష్టిలో పెట్టుకునే రాశారు. ఎందుకంటే తమిళంలో తల్లి పాత్రలో ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. కానీ, వాళ్ల బడ్జెట్‌ దృష్ట్యా నేను చేయకపోవడం వల్ల వేరే వాళ్లను తీసుకున్నారు. ఎప్పుడు కలిసినా ఈ విషయాన్ని నాకు చెబుతూనే ఉంటారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేను. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని