ముందుంది...సినిమాస్‌ పండగ

కరోనా సంక్షోభం తర్వాత వేగంగా పుంజుకున్నది తెలుగు చిత్రసీమే. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలు సాధిస్తున్న వసూళ్లు... మన థియేటర్ల దగ్గర కనిపిస్తున్న సందడి...

Published : 27 Mar 2021 18:16 IST

కరోనా సంక్షోభం తర్వాత వేగంగా పుంజుకున్నది తెలుగు చిత్రసీమే. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలు సాధిస్తున్న వసూళ్లు... మన థియేటర్ల దగ్గర కనిపిస్తున్న సందడి... మన సినీ అభిరుచి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కరోనా భయంతో థియేటర్లకి రాని ప్రేక్షకులు ఎంతోమంది. అయినా సరే... ఇప్పుడొస్తున్న వసూళ్లు చిత్రసీమకి కొండంత ప్రోత్సాహాన్నిఇస్తున్నాయి. ఇక మాస్‌ సినిమాల జోరు మొదలైందంటే మన చిత్రసీమకి మరింత ఊపు ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

స్టార్‌ కథానాయకుడు...మాస్‌ కథ... సరైన సీజన్‌... ఈ మూడూ తోడయ్యాయంటే ఇక థియేటర్లకి పండగే. కరోనా తర్వాత ఇంకా మాస్‌ సినిమాల ఉద్ధృతి పెరగలేదు. సంక్రాంతి సందర్భంగా ‘క్రాక్‌’ విడుదలైనా.. అప్పట్లో యాభై శాతం ప్రేక్షకులతోనే ఆ సినిమా ప్రదర్శితమైంది. ఆ స్థాయి ప్రేక్షకులతోనూ రికార్డు వసూళ్లుని సొంతం చేసుకుంది. ఇక వంద శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలకి అనుమతులు వచ్చాక పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాల హంగామానే ఎక్కువ. ఇక మిగిలింది మాస్‌ సినిమాల సందడే. ఈ వేసవి నుంచే ఆ జోరు షురూ కాబోతోంది.

రుచులెన్నెన్నో...

వారానికి మూడు కొత్త సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. ఈ శుక్రవారం కూడా నితిన్‌ ‘రంగ్‌దే’, రానా ‘అరణ్య’ విడుదలయ్యాయి. శనివారం ‘తెల్లవారితే గురువారం’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. వీటిలో ఒకొక్కటి ఒక్కో రకమైన జోనర్‌లో రూపొందింది. ఇక ప్రేక్షకుల దృష్టి ఏప్రిల్‌పైకి మళ్లింది. అసలు సిసలు వేసవి మొదలు కావడంతోపాటు...అగ్ర తారల సినిమాలు వరస కట్టనున్నాయి. ఏప్రిల్‌ 2న నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’, కార్తి నటించిన అనువాద చిత్రం ‘సుల్తాన్‌’ రానున్నాయి. ఇక వేసవికి మరింత ఊపుని పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ తీసుకురానున్నాడు. ఏప్రిల్‌ 9న ఇది విడుదల కానుంది. మాస్‌లో ఆయనకున్న పట్టు, విజయవంతమైన కథ సినిమాపై మరిన్ని అంచనాల్ని రేకెత్తిస్తున్నాయి. ఏప్రిల్‌ 16న నాగచైతన్య ‘లవ్‌స్టోరి’, 23న నాని ‘టక్‌ జగదీష్‌’ తెరపై సందడి చేయనున్నాయి. ఇవీ ఒకదానికొకటి భిన్నమైన కథలతో రూపొందినవే. ఇలా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త రుచుల్ని అందిస్తూనే, మాస్‌ని మురిపించేలా చిత్రసీమ ప్లాన్‌ చేసింది.

అక్టోబరు వరకూ...

జూన్‌లో సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తోపాటు...కీర్తిసురేష్‌ ‘గుడ్‌లక్‌ సఖి’, పూరి తనయుడు ఆకాశ్‌ నటించిన ‘రొమాంటిక్‌’ చిత్రాలు రానున్నాయి. జులై నుంచి మరోసారి పరిశ్రమ గేర్‌ మార్చనుంది. పాన్‌ ఇండియా చిత్రాలు వరుస కట్టబోతున్నాయి. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ జులై 30న విడుదల కానుంది. ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 2’, ‘మేజర్‌’ తదితర చిత్రాలు ఈ నెలలోనే వచ్చేస్తాయి. ఆగస్టులో ‘పుష్ప’ సందడి షురూ కాబోతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది. ‘మహాసముద్రం’, ‘ఎఫ్‌3’, ‘లైగర్‌’, ‘పక్కా కమర్షియల్‌’..ఇలా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రానున్న సినిమాల్లో ఎక్కువగా మాస్‌ కథలతో రూపొందినవే. అక్టోబరు 13న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ విడుదల కానుంది. ఇలా వేసవితో మొదలై ఏడాది చివరి వరకూ మాస్‌ సినిమాల సందడి కనిపించనుంది. ‘‘చిత్ర పరిశ్రమకి మాస్‌ చిత్రాలు చాలా అవసరం. హిందీలో కొన్నేళ్లుగా సున్నితమైన కథలు తెరకెక్కుతుండడం... మాస్‌ చిత్రాలు అంతగా రాకపోవడంతో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కనుమరుగైపోయాయి. మల్టీప్లెక్స్‌ సినిమాల జోరు ఎక్కువ కావడంతో...అక్కడి మాస్‌ ప్రేక్షకులు తెలుగు సినిమాల్ని అమితంగా ఇష్టపడుతున్నారు. అందుకే తెలుగు మాస్‌ సినిమాల శాటిలైట్‌ హక్కులు తెలుగుకంటే హిందీలోనే ఎక్కువ ధరను పలుకుతుంటాయి. మన దగ్గర సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కళకళలాడాలంటే మాస్‌ సినిమాలు రావల్సిందే. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీ వేదికల కారణంగా ప్రేక్షకుల్లో సినిమా అభిరుచి పెరిగింది. ఆ ప్రేక్షకులంతా థియేటర్లకి అలవాటయ్యారంటే మన సినిమాల వసూళ్లకి ఆకాశమే హద్దు’’ అన్నారు యువ నిర్మాత బన్నీ వాస్‌.

ఆకాశ‘మే’ హద్దు...

మే నెలలో అగ్ర తారల చిత్రాల ఉద్ధృతి కనిపించనుంది. మే 13న చిరంజీవి, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ విడుదల కానుంది. మే 14న వెంకటేష్‌ ‘నారప్ప’ రానుంది. మే 28న బాలకృష్ణ -బోయపాటి చిత్రం, అదే రోజునే రవితేజ ‘ఖిలాడి’ రానున్నాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన సినిమా అంటే అది అభిమానుల్లోనే కాదు... సగటు ప్రేక్షకుడిలోనూ ఆసక్తిని రేకెత్తించే విషయం. ఇక విజయవంతమైన కలయిక బాలకృష్ణ - బోయపాటి కలిసి చేసిన సినిమా, ‘క్రాక్‌’తో జోరుమీదున్న రవితేజ కొత్త చిత్రం ‘ఖిలాడి’... ఇలా అసలైన మాస్‌ పండగకి తార్కాణంగా నిలవనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని