Ginna: ‘జిన్నా’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘జిన్నా’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది.

Published : 02 Dec 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మంచు విష్ణు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జిన్నా’ (Ginna). ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురువారం ఖరారైంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని చిత్ర నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమా తెలుగు, మలయాళం భాషల్లో రిలీజ్‌ అవుతుంది. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోని కనిపించి అలరించారు.

కథేంటంటే: చిత్తూరు జిల్లాలోని రంగం పేటకు చెందిన గాలి నాగేశ్వరరావు కథ ఇది. ఎవరైనా అతణ్ని పూర్తి పేరుతో పిలిస్తే అసలు సహించడు. షార్ట్‌కట్‌లో ‘జిన్నా’ అని పిలవమని చెబుతుంటాడు. తనకి ఊరంతా అప్పులే. అలా అప్పు చేసే, ఆ ఊళ్లో ఓ టెంట్‌ హౌస్‌ పెట్టుకుంటాడు. దురదృష్టం ఏంటంటే అతను ఏ పెళ్లి కాంట్రాక్ట్‌ తీసుకున్నా.. అది పెటాకులవుతుంటుంది. ఈ కారణంతోనే అతని టెంట్‌ సామాన్లను శుభకార్యాలకు వాడకూడదని, చావులకే వాడాలని తీర్మానం చేస్తాడు ఊరి ప్రెసిడెంట్‌ తిప్పేస్వామి (రఘుబాబు). అదే సమయంలో ఊళ్లోకి ఎంట్రీ ఇస్తుంది రేణుక (సన్నీ లియోని). తనకి మాటలు రావు, చెవులు వినపడవు. ఆమె జిన్నాకు బాల్య స్నేహితురాలు. అనుకోని పరిస్థితుల్లో చిన్నప్పుడే అమెరికాకు వెళ్లిపోతుంది. ఇన్నేళ్లకు తిరిగి ఊరికి వచ్చిన ఆమె.. వచ్చీ రాగానే జిన్నాపై తన ఇష్టాన్ని బయట పెడుతుంది. అతణ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు, జిన్నాకు పచ్చళ్ల స్వాతి (పాయల్‌ రాజ్‌పుత్‌) అంటే ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, రేణుకను చూశాక అతని ఆలోచన మారుతుంది. ఆమెని పెళ్లి పేరుతో బుట్టలోకి దింపి.. ఆమె డబ్బు కొట్టేసి, అప్పులు తీర్చుకొని, ఊరి సర్పంచ్‌ అవ్వాలని పథకం రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? జిన్నా కల నెరవేరిందా? అన్నది మిగతా కథ.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని