Cinema news: ‘లైగర్‌’లో మైక్‌టైసన్‌.. భారతీయ తెరపై  మెరిసిన ఇంటర్నేషనల్‌ స్టార్స్‌!

ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన అంతర్జాతీయ తారలు

Updated : 01 Oct 2021 10:14 IST

టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘లైగర్‌’ కోసం  బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ను బరిలోకి దించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్‌ఇండియా చిత్రంగా ‘లైగర్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా బాక్సింగ్‌ కింగ్‌ టైసన్‌ చేరికతో అది మరింత పెద్ద ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఇంటర్నేషనల్‌ సెలబ్రిటీలను మన సినిమాల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. వివిధ రంగాల్లో పేరొందిన అంతర్జాతీయ తారలు భారతీయ తెరపైనా ఆడిపాడారు. కొన్ని సినిమా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆ తారలెవరు? ఏయే సినిమాల్లో కనిపించారో చూద్దాం.

సిల్వెస్టర్‌ స్టాలోన్‌ ఫైట్లు

‘రాకీ’, ‘రాంబో’లాంటి యాక్షన్‌ సినిమాలందించిన హాలీవుడ్‌ దిగ్గజ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌. ఇండియన్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్ సినిమాలో కాసేపు కనిపించి హాలీవుడ్‌ ప్రియులను అలరించాడు. ‘కంబక్త్‌ ఇష్క్‌’లో ఆకతాయిల నుంచి కరీనాను కాపాడేది ఈయనే. కనిపించేది మూడు నిమిషాలే అయినా..తన మార్క్‌ ఫైట్‌తో అదరగొట్టాడు.  ప్రముఖ హాలీవుడ్‌ నటి డెనిస్‌ రిచర్డ్స్‌ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించింది. అక్షయ్‌కోసం ప్రేమను త్యాగం చేసే ఓ యువతి పాత్రలో ఆమె కనిపించడం విశేషం. 

విల్‌స్మిత్ స్టెప్పులు

‘పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్’‌, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్’‌, ‘హాంకాక్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన నటుడు విల్‌స్మిత్‌.  మరెన్నో వైవిధ్య చిత్రాలతో హాలీవుడ్‌లో ప్రత్యేకముద్ర వేసుకున్న విల్‌స్మిత్‌ ఓ బాలీవుడ్‌ పాటలో స్టెప్పులేశాడు. టైగర్‌ ష్రాఫ్‌, అనన్యపాండే హీరోహీరోయిన్లుగా నటించిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2’ చిత్రంలో మెరిశాడు. కరణ్‌ జోహర్‌ ప్రోత్సాహంతో ఇందులో నటించేందుకు అంగీకరించాడాయన. 


బార్బారా మోరీ అందాలు

బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోహన్‌ ‘కైట్స్‌’ సినిమాలో ఓ మెక్సికన్‌ నటి నటించింది. ఇందులో హృతిక్‌ సరసన బార్బారా మోరీ నటించి ఆకట్టుకున్నారు.


కత్రినాతో క్లీవ్‌ స్టాండెన్‌ ప్రేమ 

వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకి క్లీవ్‌ స్టాండన్ పరిచయం అక్కర్లేని పేరు. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్‌’ వెబ్‌ సిరీస్‌లో క్లీవ్‌ స్టాండెన్‌ కీలకమైన పాత్రలో నటించారు. ఈయన కూడా బాలీవుడ్‌లో మెరవడం విశేషం. అక్షయ్‌ కుమార్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘నమస్తే లండన్‌’లో కత్రినాకైఫ్‌కి కాబోయే భర్తగా నటించాడు. 


లగాన్‌లో ఆ ఇద్దరు

బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ ‘లగాన్‌’. ఇందులో పాల్‌బ్లాక్‌తోర్న్‌ కెప్టెన్‌ ఆండ్రూ రసెల్‌గా నటించారు. ఈ సినిమా కోసం ఆరు నెలలు కష్టపడి హిందీ నేర్చుకున్నారాయన. మరో హాలీవుడ్‌ నటి రిచెల్ షెల్లీ ఇదే చిత్రంలో గోరీ మామ్‌గా నటించారు. భారతీయులను ఆ పాత్రలో అమితంగా ఆకట్టుకుంది‌. 


పోలీసుగా మైకేల్‌ మాడిసన్‌

‘కిల్‌బిల్’‌, ‘రిజర్వాయర్ డాగ్స్’‌, ‘హేట్‌ఫుల్‌ ఎయిట్‌’ తో టారంటినో సినిమాలతో నటుడిగా ముద్రపడిన మైకెల్‌ మాడిసన్‌ కూడా భారతీయ తెరపై మెరిశారు‌. అయితే అది బాలీవుడ్‌ చిత్రంలో కాదు.  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’  చిత్రంలో పోలీసు అధికారిగా కనిపించారు. 


అమితాబ్‌తో బెన్‌ కింగ్‌స్లే

ఆస్కార్‌ నటుడిగా బెన్‌కింగ్‌స్లే భారతీయులకు సుపరిచితమే. మహాత్మగాంధీ పాత్రలో మరిచిపోలేని విధంగా నటించి మెప్పించిన విలక్షణ నటుడాయన.  హాలీవుడ్‌లో వచ్చిన ‘గాంధీ’తో పాటు ‘షిండ్లర్స్‌ లిస్ట్’‌, ‘ఐరన్‌ మ్యాన్‌3’, ‘హ్యూగో’లాంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. బాలీవుడ్‌లో థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ‘తీన్‌పత్తి’లో అమితాబ్‌తో కలిసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించారు. ఇది ఒక కొరియన్‌ సినిమాకు రీమేక్‌. 


అన్‌ఇండియన్‌గా బ్రెట్‌లీ

మైదానంలో బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెట్టే ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్‌లీ కూడా మొహానికి రంగేసుకున్నాడు.  అన్‌ఇండియన్‌ అనే బాలీవుడ్‌ సినిమాలో ఆయన హీరోగా చేశారు. 


 లైగర్‌ కోసం.. టైసన్‌ 

పాన్‌ ఇండియా సినిమా లైగర్‌ని భారీస్థాయిలోనే ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఏకంగా బాక్సింగ్‌ కింగ్‌ మైక్‌ టైసన్‌ బరిలోకి దిగనున్నాడు. అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. తెలుగు, హిందీ భాషల్లో  ‘లైగర్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఇతర భాషల్లో అనువాదం చేయనున్నారు.  మైక్‌టైసన్‌ చేరికతో బాక్సింగ్‌ రింగ్‌లో పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. 


ఆర్‌ఆర్‌ఆర్‌కి అక్కడి నుంచే 

జక్కన్న తెరకెక్కిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’‌. ఈ సినిమాకి హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రే స్టీవెన్‌సన్‌ విలన్‌గా కాగా, ఒలివియా మోరిస్‌ కథానాయికగా నటిస్తోంది. పలు విజయవంతమైన హాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన అలీసన్‌ డూడీ ఇందులో లేడీ విలన్‌గా కనిపించనున్నారు. వీరితో పాటే మరికొంత మంది హాలీవుడ్‌ నటులు ఇందులో నటిస్తున్నారు. ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ మన సినిమాల్లో నటించలేదు కానీ, ఓ పాటల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంకర్‌ తీసిన భారీ చిత్రం ‘ఐ’ పాటల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఆయన రాకతో ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. వీరే కాదు, ఇంకా చాలా మంది హాలీవుడ్‌ నటులను పలకరించారు. ‘ఇంటర్నేషనల్‌ ఖిలాడీ’లో లెస్టర్‌ స్పైట్ ఓ సన్నివేశంలో మెరుస్తారు. ‘టెర్మినేటర్‌’ లాంటి పెద్ద సినిమాల్లో నటించిన నటుడాయన. ఆ తర్వాత ‘రాజ్‌నీతి’లో సారా థాంప్సన్‌, ‘మంగళ్‌పాండే’లో టాబీ స్టీఫెన్స్‌, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’లో క్రిస్టోఫర్‌ బి. డంకన్‌, ఇలా ఎంతోమంది బాలీవుడ్‌ తెరపై మెరిశారు. పాప్‌సింగర్‌ అకాన్‌ షారుక్‌ఖాన్‌ కోసం ‘చమ్మక్‌చల్లో’ అనే పాటనూ పాడారు. బాలీవుడ్ నిర్మాతలతో ఉన్న మైత్రి, ఇక్కడి అభిమానులను పలకరించాలనే ఉద్దేశంతో సినిమాలు చేస్తూ ఉంటారు. దానికి తోడు హాలీవుడ్‌ మార్కెట్‌ కూడా పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని