HBD Keeravani: కష్టం తెలియాలని..కూలీకి!

సప్తస్వరాలే ప్రాణంగా సాగుతూ, తెలుగు సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న ఎమ్‌ఎమ్‌ కీరవాణి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సంగీత ప్రయాణాన్ని చూద్దాం. 

Updated : 04 Jul 2021 12:22 IST

ఆ రాగం ‘పూసింది పూసింది పున్నాగ’ అంటూ తీయని స్వరాలు పూయిస్తుంది.. ‘‘జింతాక చితాచితా’ అంటూ మాస్‌ను ఉర్రూతలూగిస్తుంది. ‘తెలుసా..మనసా..’తో భగ్న ప్రేమికుల గుండెలను మీటుతుంది. ‘అంతా రామమయం’ అని హృదయాల్లోకి భక్తి భావాన్ని కలిగిస్తుంది.. ‘మౌనంగానే ఎదగమని’ చెబుతూ స్ఫూర్తిని నరాల్లోకి నింపుతుంది.. ‘సాహోరే బాహుబలి’ అంటూ ధీరత్వాన్ని అందిస్తుంది.. సప్తస్వరాలే ప్రాణంగా సాగుతూ, తెలుగు సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న ఎం.ఎం. కీరవాణి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సంగీత ప్రయాణాన్ని చూద్దాం. 

మూడు భాషలు..మూడు పేర్లు

‘బాహుబలి ది బిగినింగ్‌’లో ‘మమతల తల్లి’  పాట రాసిన శివశక్తి దత్త కుమారుడే కీరవాణి.  ఆయన రెండు తెలుగు సినిమాలకు దర్శకుడుగానూ పనిచేశారు. సంగీతం మీదున్న అభిమానంతో కీరవాణి రాగాన్ని ఆయనకు నామకరణం చేశారు. పెరిగి పెద్దయ్యాక ఆ పేరుకు సార్థకత చేకూర్చారు కీరవాణి. సంగీత ప్రపంచంలో ఎనలేని విజయాలు సాధించారు. ఎం.ఎం. కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం.ఎం క్రీమ్‌గా ప్రసిద్ధుడు. 

నేనున్నానని..

సినీ పరిశ్రమలోకి వచ్చిన వాళ్లు ఏదో ఒక సందర్భంలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన వాళ్లే. తొలినాళ్లలో కీరవాణి కుటుంబం కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అయితే కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని నడక సాగించిన కీరవాణి, వచ్చిన సంపాదనతో నేనున్నానంటూ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు.

వేటూరి శిష్యుడు

సంగీత దర్శకుడిగా మారకముందు చక్రవర్తి దగ్గర  రెండేళ్లు పనిచేశారు. దాదాపు 60 చిత్రాలకు ఆయన దగ్గరే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తర్వాత సాహిత్యంలోనూ మెళకువలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో దాదాపు సంవత్సరం పాటు గేయ రచయిత వేటూరి వద్ద శిష్యరికం చేశారు. వేటూరికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘రాలిపోయే పువ్వా’గీతం ఆయన సంగీతంలో సారథ్యంలో రూపుదిద్దుకున్నదే.

‘క్షణక్షణం’తో మలుపు

‘మనసు మమత’తో వెండితెరకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ‘సీతారామయ్య గారి మనవరాలు’తో మంచి గుర్తింపు పొందారు. ఆయన కెరీర్‌ వేగాన్ని పెంచింది మాత్రం ‘క్షణక్షణం’. ఆ సినిమా విజయం సాధించడంతో భారీ చిత్రాల ఆఫర్లు వరుస కట్టాయి. ‘ఘరానా మొగుడు’,  ‘అల్లరి మొగుడు’, ‘ఆపద్బాంధవుడు’ సినిమాలకు సంగీతమందించేందుకు ఆ సినిమా విజయం తోడ్పడింది. ‘క్రిమినల్‌ చిత్రం’లోని‘తెలుసా మనసా’ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమా బాలీవుడ్‌కు కూడా వెళ్లింది. అక్కడా అదే స్థాయిలో అలరించాయి ఈ చిత్రంలోని పాటలు.  ‘ఇస్‌ రాత్‌ కి సుభా నహీన్’‌, ‘సుర్’‌, ‘సాయా’, ‘జిస్మ్‌’, ‘రోగ్’‌, ‘పహేలీ’  చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. 

అన్నమయ్యతో అవార్డు

కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్లు అందించిన కీరవాణికి ‘అన్నమయ్య’ మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన ఈ సినిమాకు కట్టిన బాణీలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కింది. గీత రచయితగానూ ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’లోని ‘దండాలయ్యా’ పాటకు ఫిలింఫేర్‌ పురస్కారం వరించింది. ‘రాజేశ్వరి కల్యాణం’, ‘అల్లరి ప్రియుడు’,  ‘పెళ్లి సందడి’, ‘స్టూడెంట్‌ నెం.1’, ‘ఒకటో నంబర్‌ కుర్రాడు’, ‘ఛత్రపతి’, ‘వెంగమాంబ’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’, ‘బాహుబలి బిగినింగ్’‌, ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాలకు నంది అవార్డులు వరించాయి. ‘అళగన్‌’ సినిమాకు గానూ తమిళ నాడు రాష్ట్ర అవార్డునూ అందుకున్నారు. 

‘గాన’వాణి

దాదాపు రెండు వందల చిత్రాలకు పైగా బాణీలు కట్టిన కీరవాణి గాత్రంతోనూ ఆకట్టుకున్నారు. తొలిసారి ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా’, ‘వేణువై వచ్చాను’ పాటలు పాడారు.  ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘బాహుబలి’ సినిమాల్లోని పాటలకు గొంతు విప్పారు. ఏ ఆర్‌ రెహమాన్‌ సారథ్యంలో ‘రోబో 2.0’ చిత్రంలోని బుల్లిగువ్వ గీతాన్ని ఆలపించారు. హిందీ, మలయాళం, తమిళం, కన్నడ సినిమాలకూ ఆయన పాటలు పాడారు. 

కలమూ కదిలించారు 

సంగీత దర్శకుడిగానే కాదు, గీత రచయితగానూ మారి మంచి పాటలు అందించారు కీరవాణి. ‘బాహుబలి2’లో ‘ఒక ప్రాణం’, ‘దండాలయ్యా’ పాటలను రాసిందాయనే. ‘వేదం’ లో ‘మళ్లీ పుట్టనీ’, ‘రూపాయ్’‌, ‘ఏ చేకటి చేరని’తో పాటు మరో రెండు గీతాలకు సాహిత్యం అందించారు. ‘విక్రమార్కుడు’, ‘గంగోత్రి’, ‘ఘరానా మొగుడు’, ‘మేజర్‌ చంద్రకాంత్’‌, ‘రక్షణ’ చిత్రాలకూ ఆయన కలం కదిలించారు.

రాజమౌళి.. రాఘవేంద్రరావు

ఈ ఇద్దరితో కీరవాణిది ప్రత్యేక అనుబంధం. రాజమౌళి తీసిన  చిత్రాలన్నింటికీ ఈయనే సంగీతమందించారు.  ‘స్టూడెంట్‌ నెం.1’ నుంచి  రాబోయే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు ప్రతి సినిమాకూ ఆయనే సంగీత దర్శకుడు. వీరి కాంబినేషన్‌లో వచ్చినవన్నీ  హిట్లే. అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో ఎక్కువ సినిమాలు  చేశారు. రెండు దశబ్దాలుగా వీరి ప్రయాణం సాగింది. ‘ఘరానా మొగుడు’, ‘అన్నమయ్య’, ‘పెళ్లి సందడి’, ‘అల్లరి ప్రియుడు’, ‘శ్రీరామదాసు’ లాంటి సూపర్‌ హిట్లున్నాయి. ఆయనతో మొత్తం 27 సినిమాలకు పనిచేశారు. 

కష్టం తెలియాలని కూలీకి

కీరవాణి ఇద్దరు అబ్బాయిల్ని ఓ సారి నగర శివార్లలోని ఓ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కూలీపని చేయించారు. రోజంతా కష్టపడితే వారికి రూ.50 ఇచ్చారు. డబ్బు విలువ తెలియాలని, శ్రమను గౌరవించాలనే ఉద్దేశంతో  అలా చేశానని చెబుతారాయన. ఇద్దరిలో శ్రీ సింహ ఇప్పటికే ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా హిట్‌ కొట్టాడు. మరో అబ్బాయి కాలభైరవ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కీరవాణి ‘ఆర్ఆర్‌ఆర్‌’తో పాటు ‘పెళ్లి సందD’, పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.  ఆదివారం సుస్వరాల వాణి.. కీరవాణికి విషెస్ చెబుతూ మరిన్ని మంచి పాటలతో అలరించాలని కోరుకుందాం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని