Keerthy Suresh: ఆ సంగీత దర్శకుడితో కీర్తి సురేశ్‌ పెళ్లంటూ వార్తలు.. స్పందించిన నటి తండ్రి

కీర్తి సురేశ్‌ పెళ్లిపై వచ్చిన వార్తలపై ఆమె తండ్రి సురేశ్‌ కుమార్‌ స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

Published : 17 Sep 2023 19:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) పెళ్లంటూ మళ్లీ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. సంగీత దర్శకుడు అనిరుధ్‌ (Anirudh Ravichander)ని ఆమె వివాహం చేసుకోబోతున్నారని మరోసారి ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కీర్తి సురేశ్‌ తండ్రి సురేశ్‌ కుమార్‌ స్పందించారు. ఆ వార్తల్లో నిజంలేదంటూ వాటిని ఖండించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారన్నారు. కీర్తి సురేశ్‌ పెళ్లిపై వదంతులురావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు వచ్చిన రూమర్స్‌ను కీర్తి సురేశ్‌, ఆమె కుటుంబ సభ్యులు ఖండించినా మళ్లీ రావడం గమనార్హం.

అప్పుడు నేనూ విజయ్‌ దేవరకొండ నిరాశకు గురయ్యాం: నవీన్‌ పొలిశెట్టి

కీర్తి సురేశ్‌, అనిరుధ్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నరంటూ కొన్నాళ్ల క్రితమే పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు, నెట్టింట పోస్ట్‌లు వెలిశాయి. ఆ సమయంలో కీర్తి స్పందిస్తూ.. ‘‘నా పెళ్లి గురించి వస్తోన్న వార్తలు, పోస్ట్‌లు చూసి షాకయ్యా. కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా’’ అని తెలిపారు. అనిరుధ్‌ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. మరోవైపు, తన స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను కీర్తి సురేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ‘కీర్తికి కాబోయే వరుడు ఇతడే’ అంటూ పలు వెబ్‌సైట్లు కథనాలు అల్లాయి. ఆ సమయంలో సురేశ్‌ కుమార్‌ వాటిని ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘కీర్తి సురేశ్‌కు పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుంది’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘దసరా’, ‘మామన్నన్‌’, ‘భోళా శంకర్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘జైలర్’ (Jailer), ‘జవాన్‌’ (Jawan)లతో విజయోత్సాహంలో ఉన్న అనిరుధ్‌.. సూర్య ‘లియో’, ఎన్టీఆర్‌ ‘దేవర’ తదితర చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. కీర్తి నటించిన ‘రెమో’, ‘అజ్ఞాతవాసి’ తదితర చిత్రాలకు అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. వీటికి పనిచేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని