Mahesh Babu: ఎనిమిది లుక్స్‌..? రాజమౌళితో మూవీపై మహేశ్‌ అప్‌డేట్‌.. !

Mahesh Babu: రాజమౌళితో చేయనున్న సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని మహేశ్‌బాబు పంచుకున్నారు.

Published : 05 Mar 2024 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే, అటు చిత్ర బృందం, ఇటు మహేశ్‌బాబు నుంచి ఎటువంటి అప్‌డేట్‌ లేదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి స్పందిస్తూ, ‘మహేశ్‌తో సినిమా తీస్తున్నా.  త్వరలోనే దాని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు’ అని చెప్పారు. ఇప్పుడు మహేశ్‌బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరొక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘రాజమౌళి సర్‌తో చేసే సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు చాలా బాగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆయనతో ప్రయాణం మొదలుపెట్టేందుకు చాలా ఆసక్తిగా ఉన్నా’ అని అన్నారు. తమ అభిమాన కథానాయకుడి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చినందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిది లుక్స్‌ రెడీ అయ్యాయా?

ఇండియన్‌ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని ఇటీవల రచయిత విజయేంద్రప్రసాద్‌ పంచుకున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. అలాగే భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారు. ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపిస్తారట. ఇప్పటికే గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో ఇందులో కనిపించనున్నారని టాక్‌. అదే సమయంలో దృఢంగా కనిపించేందుకు అవసరమైన కసరత్తులు కూడా మహేశ్‌ చేస్తున్నారట. ఇక మహేశ్‌ లుక్‌కు సంబంధించి స్కెచ్‌లు పూర్తయ్యాయని సమాచారం. మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసిందట. కథకు, మహేశ్‌ ఆహార్యానికి సరిపోయేలా ఆ లుక్స్‌లో మహేశ్‌ను టెస్ట్‌ ఫొటో షూట్ చేసి, ఫైనల్‌ లుక్‌ను ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ మూవీ గురించి ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు ప్రచారమయ్యాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని కూడా టాక్‌ వినిపిస్తోంది. ఎప్పట్లాగే తన సినిమాలకు సంబంధించిన వివరాలను రాజమౌళి ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రెస్‌మీట్‌ ఎప్పుడు ఉంటుందా? అని మహేశ్‌బాబు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

నా కెరీర్‌ను మలుపు తిప్పినవి ఆ మూడు సినిమాలే!

ఇక తాజా ఇంటర్వ్యూలో మహేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నన్ను ప్రభావితం చేసి, కెరీర్‌ను మలుపుతిప్పిన మూడు సినిమాలు ‘మురారి’, ‘పోకిరి’, ‘శ్రీమంతుడు’. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రాలు ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేశాయి. వారికి నచ్చేలా సినిమాలు చేయాలని నైతిక అంశాల ఆధారంగా కథను ఎంపిక చేసుకుంటాను. ఒకే రకమైన పాత్రల్లో నటించను. వ్యక్తిగత విలువలకు దగ్గరగా ఉంటూ, నా స్వభావాన్ని అభిమానులకు తెలియజేసేలా ఉన్న పాత్రలు పోషిస్తా. కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నా. చిత్ర పరిశ్రమలో విజయంపై నా ఆలోచనా సరళి మారింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు ముఖ్యమైనప్పటికీ సినిమా ప్రేక్షకులపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నా. అందులో భాగంగానే ‘గుంటూరు కారం’లో నటించాను. ఈ చిత్రానికి సవాళ్లు ఎదురైనా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇందుకు కారణం నా అభిమానులు’’ అని మహేశ్‌ బాబు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని