Meher Ramesh: ‘వేదాళం’పై కాంట్రవర్సీ కామెంట్స్‌.. మెహర్‌ రమేశ్‌ క్లారిటీ

అజిత్‌ (Ajith) నటించిన ‘వేదాళం’ను ఉద్దేశిస్తూ మెహర్‌ రమేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

Updated : 09 Aug 2023 13:39 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) ప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వేదాళం’ (Vedalam). శివ దర్శకుడు. 2015లో విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడిదే చిత్రానికి రీమేక్‌గా మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) ‘భోళా శంకర్’ (Bhola Shankar) తెరకెక్కించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో ‘వేదాళం’పై మెహర్‌ రమేశ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆ సినిమాలో ప్రేక్షకులు ఇబ్బందిపడేలా కొన్ని సీన్స్‌ ఉంటాయని మెహర్‌ రమేశ్‌ చేసిన వ్యాఖ్యలపై అజిత్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహర్‌ను ఉద్దేశిస్తూ ట్విటర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు.

Bholaa Shankar: అందుకే ఈ గ్యాప్‌.. ‘భోళాశంకర్‌’తో నా కల నెరవేరింది: మెహర్‌ రమేశ్‌

ఇదిలా ఉండగా, తన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో మెహర్‌ రమేశ్‌ స్పందించారు. ‘‘వేదాళం’ నాకెంతో ఇష్టమైన చిత్రం. 2015లో ఈ చిత్రాన్ని చూసినప్పుడు దర్శకుడు శివ వర్కింగ్‌ స్టైల్‌కు ఫిదా అయ్యా. అన్నాచెల్లెలి అనుబంధాన్ని తెరపై చూపించిన విధానం నాకెంతో నచ్చింది. దీనిని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. అలాగే, 2009లో అజిత్‌ నటించిన ‘బిల్లా’ చిత్రాన్ని డార్లింగ్‌ ప్రభాస్‌తో తెలుగులో రీమేక్‌ చేశాను. ఇప్పుడు ఆయన నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వేదాళం’ను మెగాస్టార్‌తో ‘భోళాశంకర్‌’గా రీమేక్‌ చేసే అవకాశం నాకు వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. మెహర్‌ రమేశ్‌ ట్వీట్‌తో అజిత్‌ ఫ్యాన్స్‌ శాంతించారు.

‘భోళా శంకర్‌’కు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు. తమన్నా (Tamannaah) కథానాయిక. కీర్తిసురేశ్‌ ఇందులో సోదరి పాత్రలో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర దీన్ని నిర్మించారు. ఆగస్టు 11న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని