Miss Shetty Mr Polishetty Review: రివ్యూ: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి.. అనుష్క, నవీన్‌ల మూవీ అలరించిందా?

Miss Shetty Mr Polishetty Review In Telugu: అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 07 Sep 2023 14:06 IST

Miss Shetty Mr Polishetty Review; చిత్రం: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి; నటీనటులు: నవీన్‌ పొలిశెట్టి, అనుష్క, జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి, హర్షవర్ధన్, భద్రమ్‌ తదితరులు; సంగీతం: రధన్‌; నేపథ్య సంగీతం: గోపీసుందర్‌; ఛాయాగ్రహణం: నీరవ్‌ షా; రచన, దర్శకత్వం: పి.మహేష్‌బాబు; నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్‌; విడుదల తేదీ: 07-09-2023

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు నవీన్‌ పొలిశెట్టి. వైవిధ్యమైన నాయికా ప్రాధాన్య చిత్రాలు ఎంచుకుంటూ సత్తా చాటుతున్న నటి అనుష్క. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్‌ నుంచి వచ్చిన కొత్త సినిమానే ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లు వినోదాత్మకంగా కనిపించడం.. అనుష్క-నవీన్‌ల లవ్‌ ట్రాక్‌లో ఓ ఆసక్తికర అంశం దాగి ఉండటం ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. (Miss Shetty Mr Polishetty Review In Telugu) మరి ఈ శెట్టి.. పొలిశెట్టిల కథేంటి? ఇది సినీప్రియుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది?

కథేంటంటే: అన్వి అలియాస్‌ అన్విత రవళి శెట్టి (అనుష్క) మాస్టర్‌ చెఫ్‌. లండన్‌లో ఓ పెద్ద స్టార్‌ హోటల్‌లో పని చేస్తుంటుంది. తనకు ప్రేమ, పెళ్లి, రిలేషన్‌ షిప్స్‌పై ఏమాత్రం నమ్మకం ఉండదు. దీనికి కారణం తన తల్లి (జయసుధ)ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వాడు మోసం చేయడమే. అయితే, తన తల్లి అనారోగ్యంతో కన్నుమూశాక అన్వి ఒంటరవుతుంది. దాని నుంచి బయట పడటానికి తోడు వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. దీనికోసం వీర్య దాత కోసం వెతుకుతుండగా.. స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి (నవీన్‌ పొలిశెట్టి) పరిచయమవుతాడు. తన బిడ్డకు ఎలాంటి తండ్రి కావాలనుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ సిద్ధులో కనిపించడంతో అతని సహాయం తీసుకోవాలని అనుకుంటుంది. అయితే అన్వి తనపై చూపిస్తున్న కేర్‌ను చూసి ఆమెతో ప్రేమలో పడిన సిద్ధు ఓరోజు తనకు ప్రపోజ్‌ చేస్తాడు. కానీ, ప్రేమ, పెళ్లిపై నమ్మకం లేని అన్వి తాను సిద్ధుకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తుంది. తల్లి కావడానికి తనకు సహాయం చేయమని కోరుతుంది. అయితే ఆమె నిర్ణయం తెలిసి సిద్ధు ఒక్కసారిగా కంగు తింటాడు. పెళ్లి చేసుకోకుండా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం సమాజానికి విరుద్ధమని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మరి అన్విత తాను అనుకున్నది సాధించిందా?(Miss Shetty Mr Polishetty Review In Telugu) ఆమె భారత్‌ నుంచి లండన్‌కు ఎందుకు తిరిగి వెళ్లిపోయింది? సిద్ధు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను ఎలా మార్చాడు? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది మిగతా కథ.

ఎలా సాగిందంటే: ప్రేమ.. పెళ్లి అంటే గిట్టని అమ్మాయికి.. ఈ రెండు బంధాల్ని బలంగా విశ్వసించే అబ్బాయికి మధ్య జరిగే ఓ వినూత్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథకు కాస్త బోల్డ్‌ టచ్‌ ఇస్తూనే... మంచి వినోదం.. చక్కటి భావోద్వేగాలు మేళవించి ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో తాను అనుకున్న ఫలితాన్ని సాధించాడు. కథగా చూస్తే ఇది చాలా చిన్న లైన్‌ అయినా వినోదం.. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు కూర్చోబెట్టగలిగేలా చేశాడు. అన్విత ప్రపంచాన్ని.. ఆమె వ్యక్తిత్వాన్ని.. తల్లితో ఉన్న అనుబంధాన్ని పరిచయం చేస్తూ వచ్చే ఆరంభ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. తల్లి అనారోగ్యంతో చావుకు దగ్గరవడం.. తన కోరిక మేరకు అన్వి ఆమెను తీసుకొని భారత్‌కు రావడం.. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే తల్లి కన్నుమూయడం.. ఇలా తొలి 20నిమిషాలు అన్విత పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. తల్లి మరణం తర్వాత ఒంటరి అయిన అన్వి  తాను కూడా తల్లి కావాలని నిర్ణయించుకోవడంతో అసలు కథ మొదలవుతుంది.

ఇక నవీన్‌ పొలిశెట్టి పాత్ర తెరపైకి వచ్చినప్పటి నుంచి అప్పటి వరకు కాస్త సీరియస్‌గా సాగిన కథ ఒక్కసారిగా వినోదాత్మకంగా మారుతుంది. స్టాండప్‌ కమెడియన్‌గా అతని పాత్ర పరిచయ సన్నివేశాలు సరదాగా ఉంటాయి. (Miss Shetty Mr Polishetty Review In Telugu) అన్వి తన జీవితంలోకి వచ్చాక ఓ కన్ఫ్యూజింగ్‌ డ్రామా మొదలవుతుంది. ఆమె అసలు విషయం దాచి పెట్టి తాను అనుకున్న లక్షణాలు సిద్ధులో ఉన్నాయా లేదా? అని తెలుసుకోవడం ప్రారంభించడం.. మరోవైపు ఆమె తన చుట్టూ తిరగడాన్ని సిద్ధు ప్రేమగా భావించడం.. ఈ క్రమంలో వచ్చే కొన్ని ఎపిసోడ్‌లు హిలేరియస్‌గా వర్కవుట్‌ అయ్యాయి. ముఖ్యంగా హోటల్‌లో అన్విత - సిద్ధుల మధ్య వచ్చే ఇంటర్వ్యూ ఎపిసోడ్, హాస్పిటల్‌లో సిద్ధు హెల్త్‌ చెకప్‌ సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే సిద్ధు కుటుంబ నేపథ్యం.. ఇంట్లో వాళ్లకు తాను తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు పరోక్షంగా చెప్పే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. విరామానికి ముందు అన్వితకు సిద్ధు సినిమాటిక్‌ స్టైల్‌లో ప్రపోజ్‌ చేయడం.. వెంటనే ఆమె తనకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణం వినిపించడం.. అది విని సిద్ధు షాక్‌ అవ్వడం.. ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది.

అయితే ప్రధమార్ధమంతా నవ్వుల రైడ్‌లా సాగిన సినిమా.. ద్వితీయార్ధంలో కాస్త భావోద్వేగభరితంగా మారుతుంది. అన్విత షాకింగ్‌ నిర్ణయం విని సిద్ధు కన్ఫ్యూజన్‌లో పడటం.. ఆమెను దూరం చేసుకోలేక తనలో తానే బాధ పడటం.. ఇలా ద్వితీయార్ధంలో తొలి 20నిమిషాలు కథ కాస్త సీరియస్‌గా సాగుతుంది. ఇక ఐయూఐ ప్రక్రియ మొదలయ్యాక సినిమా మళ్లీ వినోదాత్మకంగా మారుతుంది. వీర్యదానం కోసం సిద్ధుని సిద్ధం చేసే తీరు.. ఈ క్రమంలో హాస్పిటల్‌లో అతను చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది.(Miss Shetty Mr Polishetty Review In Telugu)  ఆ తర్వాత అన్వి-సిద్ధు విడిపోవడం నేపథ్యంలో వచ్చే సీన్స్‌ భావోద్వేగభరితంగా ఉంటాయి. అన్వికి దూరమయ్యే ముందు సిద్ధు ‘‘నీ బిడ్డకు తండ్రెవరంటే ఎవరో డోనర్‌ అని చెప్పకు.. నీ అమ్మను ప్రేమించిన గొప్ప ప్రేమికుడని చెప్పు’’ అని అనడం మదిని బరువెక్కిస్తుంది. పతాక సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా.. నాయకానాయికల ఎమోషన్స్‌ కంటతడి పెట్టిస్తాయి.

ఎవరెలా చేశారంటే: స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్‌ పొలిశెట్టిని (Naveen Polishetty) తప్ప మరొకరిని ఊహించుకోలేం. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆ పాత్రను అవలీలగా చేసి చూపించాడు. ప్రేక్షకుల్ని ఆద్యంతం కడుపుబ్బా నవ్వించాడు. పతాక సన్నివేశాల్లో ఎమోషన్‌ను చక్కగా పండించాడు. అన్విత పాత్రలో అనుష్క (Anushka Shetty) ఆద్యంతం చాలా సెటిల్డ్‌గా నటించింది. దర్శకుడు ఆమె పాత్రను చాలా హుందాగా తీర్చిదిద్దారు. ఆమెకు.. నవీన్‌కు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో భావోద్వేగభరితమైన నటనతో ఆమె అందరి మదిని బరువెక్కిస్తుంది. ఆమె తల్లిగా జయసుధ కొద్దిసేపు నిడివి ఉన్న పాత్రలో కనిపించారు. నాజర్, మురళీ శర్మ, తులసి.. తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. అభినవ్‌ గోమఠంకు పెద్దగా నవ్వించే ఆస్కారం దొరకలేదు.

దర్శకుడు తాను రాసుకున్న కథకు కాస్త బోల్డ్‌ టచ్‌ ఇచ్చినా.. ఎక్కడా గీత దాటలేదు. హద్దు మీరకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని వినోదాత్మకంగా తెరపై చూపించారు. సినిమాని ఆరంభించిన తీరు సాదాసీదాగా ఉంటుంది. అనుష్క పాత్ర గతాన్ని చూపించకపోవడంతో ఆమెలోని భయాల్ని ప్రేక్షకులు సరిగ్గా ఫీలవ్వలేరు. అమ్మాయి, అబ్బాయి మధ్య ఏమీ జరగకున్నా.. ఒక్క ముద్దు కూడా పెట్టుకోకున్నా ప్రేమ పుడుతుందని దర్శకుడు చెప్పిన తీరు బాగుంది. రధన్‌ పాటలు వినసొంపుగా ఉన్నాయి. కానీ, గుర్తుంచుకునేలా లేవు. గోపీసుందర్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నీరవ్‌ షా ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం..
  • + నవీన్, అనుష్క నటన
  • + వినోదం.. భావోద్వేగాలు
  • బలహీనతలు
  • - ఆరంభ సన్నివేశాలు
  • - నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: శెట్టి - పొలిశెట్టి.. నవ్విస్తూ మదిని బరువెక్కిస్తారు!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని