Kushi Movie: ‘ఖుషి’ ట్రైలర్‌ రాగానే థియేటర్‌ నుంచి నాగచైతన్య వెళ్లిపోయారా?

‘ఖుషి’ ట్రైలర్‌ ప్రసారం కాగానే థియేటర్‌ నుంచి నాగచైతన్య వెళ్లిపోయారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

Updated : 28 Aug 2023 17:20 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ, సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘ఖుషి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతోంది. ఇటీవల ఓ సినిమా చూడటానికి వెళ్లిన నటుడు నాగచైతన్య (Naga Chaitanya) విరామ సమయంలో ‘ఖుషి’ ట్రైలర్‌ ప్రసారం కాగానే,  థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు హల్‌ చల్‌ చేశాయి. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ప్రముఖంగా హెడ్డింగ్‌లు పెట్టి మరీ వైరల్‌ చేశాయి.

సదరు వార్తలపై నాగచైతన్య స్పష్టతనిచ్చారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ..  అవన్నీ చెత్త వార్తలని కొట్టిపారేశారు. ‘‘ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కొన్ని తెలుగు వెబ్‌సైట్స్‌లో రూమర్స్‌ నా దృష్టికి వచ్చాయి. ఆ వార్తలను సరిచేయాల్సిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించాం’అని అన్నారు. 2021లో సమంత-నాగచైతన్యలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. దీనిపై నాగచైతన్య కూడా స్పందించారు. అధికారికంగా తాము విడాకులు తీసుకున్నామని స్వయంగా తెలిపారు. ఎవరి జీవితాలు వాళ్లు బతుకుతున్నామని అన్నారు. సమంత ప్రియమైన వ్యక్తి అని, ఆమె జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.

సమంతకు వీడియో కాల్‌ చేసిన విజయ్ దేవరకొండ.. ఎందుకంటే..?

ఇక వీరి సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం సమంత ‘ఖుషి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ షూటింగ్‌ పూర్తి చేసి, కొన్ని రోజులు సినిమాలకు  విరామం ప్రకటించారు. మరోవైపు దర్శకుడు చందూ మొండేటితో నాగచైతన్య సినిమా చేస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నారు. 2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్లి పాక్‌ కోస్ట్‌ గార్డ్‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. మత్స్యకారుల వలసలు, పాక్‌కు చిక్కడం, అక్కడి నుంచి భారత్‌కు రావడం వంటి ఇతి వృత్తంతో ఇది సిద్ధం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని