Naga Shaurya: ఆ రోజు జరిగిన సంఘటనలో అమ్మాయిదే తప్పు: నాగశౌర్య

Naga Shaurya: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ప్రేమ జంట మధ్య జరిగిన గొడవలో నాగశౌర్య కలగజేసుకుని మాట్లాడిన వీడియో గతంలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనపై ఆయన వివరణ ఇచ్చారు.

Updated : 27 Jun 2023 19:52 IST

హైదరాబాద్‌:  కొన్ని రోజుల కిందట ఓ ప్రేమ జంట రోడ్డుపై గొడవ పడుతుండగా, నాగశౌర్య కలగజేసుకుని వారితో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రోజు జరిగిన సంఘటనపై నాగశౌర్య వివరణ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా పవన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగబలి’ (Rangabali). మంగళవారం చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఒక అబ్బాయి ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే, మీరు అంతలా స్పందించాల్సిన అవసరం ఏముంది. అతడిని కొట్టారా?’ అని అడగ్గా, నాగశౌర్య స్పందించారు.

‘‘ఆ రోజు జరిగింది పూర్తిగా వేరు. ఆ అబ్బాయిని నేను కొట్టలేదు. పనిమీద వెళ్తుండగా, కూకట్‌పల్లిలో నడి రోడ్డుపై ఒక అబ్బాయి ఓ అమ్మాయిని కొడుతూ కనిపించాడు. వెంటనే అక్కడకు వెళ్లి, ‘ఎందుకు కొడుతున్నావ్‌. సారీ చెప్పు’ అని అడిగితే ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా? ‘నా బాయ్‌ఫ్రెండ్‌ కొడితే కొడతాడు.. చంపితే చంపుతాడు..’ అంది. అమ్మాయిలే అలా అంటే ఇక ఏం చెబుతాం. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలకు ఒకటే చెబుతున్నా. మిమ్మల్ని కొట్టే అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. మీకు, మీ ఫ్యామిలీకి అది మంచిది కాదు. ఆ రోజు జరిగిన సంఘటనలో ఆ అబ్బాయిది తప్పుకాదు. కచ్చితంగా అమ్మాయిదే. ఇంకొక రూమర్‌ ఏంటంటే, ప్రచారం కోసం నేనే  ప్లాన్‌ చేసి, అది క్రియేట్‌ చేశానని కొందరు అన్నారు. వాళ్లిద్దరూ ఎవరో కూడా నాకు తెలియదు. ఈ మధ్య కొందరు అమ్మాయిలు తెలియక తప్పు చేస్తున్నారు. మీ జీవితంలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయాన్ని ఆలోచించుకోండి. మంచి వ్యక్తిని ఎంచుకోకుండా అమ్మాయిలే తప్పు చేస్తున్నారు’’ అని నాగశౌర్య వివరణ ఇచ్చారు. ‘మీరెలాంటి వారు’ అని అడగ్గా, ‘నేను కచ్చితంగా మంచివాడినే’ అంటూ చిరు నవ్వులు చిందించారు.

ఇక ‘రంగబలి’ గురించి మాట్లాడుతూ.. గతంలో తాను నటించిన కొన్ని సినిమాలు బాగా ఆడాయి, మరికొన్ని సరిగా ఆడలేదని అన్నారు. మనం నడిచే కాలే తగిలి కొన్ని సార్లు పడిపోతాం కదా, అలాగే తనకూ జరిగిందన్నారు. సినిమాల పరాజయం విషయంలో ఎవరినీ నిందించడం లేదన్నారు. ‘రంగబలి’ విషయంలో నమ్మకం కంటే కూడా ధైర్యంగా ఉన్నట్లు చెప్పారు. తనకు కథ ఎలా చెప్పాడో పవన్‌సినిమాను అలాగే తీశాడని అన్నారు. పేపర్‌ మీద ప్రతి సినిమా హిట్టేనని, ఏ సీన్‌ ఎక్కడ పెట్టాలి?ఏ డైలాగ్‌ ఎలా చెప్పాలి? అనేది సరిగా రాలేకపోతేనే సినిమా ఫ్లాప్‌ అవుతుందని అభిప్రాయపడ్డారు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ  ‘రంగబలి’ నచ్చుతుందన్న ఆయన, ఈ సినిమా విడుదల తర్వాత అందరూ ‘రంగబలి’ గురించే మాట్లాడతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ చనిపోవడం నిజంగా బాధాకరమని నాగశౌర్య విచారం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని