అలాంటి చిత్రం ఆదిత్య369 ఒక్కటే: బాలకృష్ణ

మన దేశంలో సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ, చరిత్ర ఈ మూడింటిని మేళవించి తెరకెక్కించిన చిత్రం ‘ఆదిత్య 369’ ఒక్కటే కావచ్చని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ హీరోగా.......

Published : 17 Jul 2021 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ, చరిత్ర ఈ మూడింటిని మేళవించి తెరకెక్కించిన చిత్రం ‘ఆదిత్య 369’ ఒక్కటే కావచ్చని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఆ చిత్రం విడుదలై నేటికి 30ఏళ్లు. 1991 జూలై 18న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించింది. తెలుగు సినిమాకు ఒక మైలురాయిగా నిలిచింది. కాగా.. ఈ సందర్భంగా బాలకృష్ణ సంతోషం వ్యక్తంచేశారు.

‘‘నేను నటించిన ఆదిత్య 369 విడుదలై నేటికి 30ఏళ్లు దాటింది. ఇంకా ఆదరణ పొందుతూ డిజిటల్ మీడియాలో ఈ తరాన్ని కూడా ఆకర్షిస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రపంచ సినీ చరిత్రలో సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, చరిత్ర.. ఈ మూడు జోనర్స్ మేళవించి తెరకెక్కించిన అతికొద్ది చిత్రాల్లో మన దేశం నుంచి బహుశా ఇదొక్కటేనేమో..! ఇంతటి చిరస్మరణీయమైన దృశ్య కావ్యానికి నన్ను కథానాయకుడ్ని చేసిన దర్శక శాస్త్రవేత్త సింగీతం శ్రీనివాసరావు గారికి, నిర్మాతలు స్వర్గీయ ఎస్పీ బాలు గారికి, కృష్ణప్రసాద్ గారికి, నా ఊపిరితో సమానమైన నా అభిమానులకు, తరం మారినా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సదా కృతజ్ఞుడిని..’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

టైమ్‌ మెషిన్‌ ద్వారా గతంలోకి వెళ్లడం, అక్కడి నుంచి వర్తమానంలోకి రావడం మళ్లీ భవిష్యత్తులోకి వెళ్లడం.. అక్కడ ఎదురయ్యే సంఘటనల కథాంశంతో ఆదిత్య ‘369’ను తెరకెక్కించారు. ఆ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. అమ్రీష్‌ పురి, టిన్నూ ఆనంద్‌, మోహినీ, సుత్తివేలు, సిల్క్‌ స్మిత, తరుణ్‌(బాల నటుడు) కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించగా.. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రచించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో ఎస్‌.అనితాకృష్ణ నిర్మించారు. 110 రోజుల్లో ఈ సినిమాను తెరకెక్కించారట. ఈ సినిమాను రూ.కోటిన్నర ఖర్చుతో రూపొందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని