పాపపు కథలు...బతుకు వెతలు

హిజ్రా గుండె చేసిన త్యాగం చెప్పే... ప్రేమతత్వం. పరాయి కులం వాడిని పెళ్లాడిందని తండ్రి కళ్లలో రగిలే... క్రూరత్వం. ఇద్దరు అమ్మాయిలు

Updated : 07 Jan 2021 10:08 IST

హిజ్రా గుండె చేసిన త్యాగం చెప్పే... ప్రేమతత్వం. పరాయి కులం వాడిని పెళ్లాడిందని తండ్రి కళ్లలో రగిలే... క్రూరత్వం. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ముఖం చూపే.. ఛండాలత్వం.చిన్నారిపై జరిగిన మృగతత్వాన్ని నీళ్లతో కడిగేయాలనే తల్లి.. నిస్సహాయత్వం...మనసుల్ని మెలిపెట్టే బాధలు... కళ్లని తడిపేసే వెతలు.. ఈ పాపపు కథలు.

‘పావ కథైగళ్‌’ అంటే తమిళంలో ‘పాపపు కథలు’ అని అర్థం. కులం, మతం, లింగభేదం, పరువు చుట్టూ తిరిగే నాలుగు హృద్యమైన కథల సమాహారం ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. భారతదేశంలో అతి ముఖ్యమైన స్ట్రీమింగుల్లో ఇప్పుడిది ట్రెండింగ్‌లో ఉంది. ఇందులోవేమి గొప్ప కథలు కాదు. గొప్ప ఆలోచన పుట్టించే కథలు. మన చుట్టూ నిత్యం జరిగే కథలే. మనం పెద్దగా పట్టించుకోని కన్నీటి కథలు. పరువు కోసం తాపత్రాయ పడే కుటుంబాల వెనుక ఎంతటి ఘర్షణ ఉంటుందో, పితృస్వామ్య వ్యవస్థ మన మూలల్లో ఇంకా ఎంత బలంగా పాతుకుపోయిందో, హిజ్రాలోని స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో.. తెలియజెప్పే కథలివి. స్త్రీ హృదయాన్ని, వారిపై సమాజంలోని ఉన్న అణిచివేతను ఇంత గొప్పగా ఆవిష్కరించిన సినిమాలూ, వెబ్‌సిరీస్‌లూ ఈ మధ్య రాలేదు. రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌లోని కథలను సుధ కొంగర, గౌతమ్‌ మేనన్, వెట్రిమారన్, విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. సమాజంపై ఎన్నో ప్రశ్నలు వేశారు. ఎంతోమందిని నిలదీశారు. సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశారు.

కన్నీటి చప్పట్లు కురిపించే... తంగం(బంగారం)

ఇది సత్తారు(కాళిదాసు జయరామ్‌) అనే ట్రాన్స్‌జెండర్‌ కథ. తమిళ నాడుకు చెందిన ఓ గ్రామంలో 1980ల్లో జరుగుతుంది. అదే ఊర్లోని చిన్ననాటి స్నేహితుడు శరవణన్‌తో సత్తారు ప్రేమలో ఉంటాడు.  ముంబయికి వెళ్లి అమ్మాయిలా ఆపరేషన్‌ చేసుకొని శరవణన్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ శరవణన్‌ సాహిరాతో ప్రేమలో ఉన్నానని చెబుతాడు. సాహిరా ఎవరో కాదు సత్తారు చెల్లెలే. దీంతో సత్తారు గుండె ముక్కలవుతుంది. ఇలా అరుదైన ముక్కోణపు ప్రేమ కథలా మలుపులు తిరిగిన ఈ కథ చివరకు ఏమైందన్నది చూసి తీరాల్సిందే. సత్తారుగా కాళిదాస్‌ జయరామ్‌ అద్భుతంగా నటించాడు. శంతాను భాగ్యరాజ్, భవాని శ్రీలు వారి పాత్రలను చక్కగా పోషించారు. చాలా చోట్ల కాళిదాస్‌ కన్నీళ్లు పెట్టిస్తాడు. చూస్తున్నంత సేపు గుండెల్లో పచ్చిగాయమేదో మెలిపెడుతున్న భావన  కలుగుతుంది. ఈ నాలుగు కథల్లో కచ్చితంగా తంగమ్‌ వైవిధ్యమైంది, అన్నింటికన్నా ఆర్ధ్రత నిండిన కథ కూడా ఇదే.

రెండు విభిన్న ప్రేమలు.. ఓ నాన్న! లవ్‌ పన్న వుట్రూనమ్‌(ప్రేమిస్తే వదిలేయాలి)

ఇది ఆదిలక్ష్మీ, జ్యోతిలక్ష్మీ అనే ఇద్దరు అక్కాచెల్లెల కథ. మిగతా కథల్లా పూర్తి సీరియస్‌గా కాకుండా కాసింత హాస్యాన్ని జోడించి చెప్పే ప్రయత్నం చేశారు విఘ్నేశ్‌ శివన్‌. వీరసింహన్‌ కులాంతర వివాహమే ఎజెండాగా రాజకీయాల్లో చక్రం తిప్పే ఊరిపెద్ద. అలాంటిది ఆయన కూతురే ఫ్యామిలీ డ్రైవర్‌తో ప్రేమలో పడితే ఏం చేశాడు? మరో కూతురు జ్యోతిలక్ష్మీ(అంజలి), పెనోలోప్‌(కల్కి కొచ్లిన్‌)తో కలిసి ఇంటికొస్తుంది. వీరిద్దరూ లెస్బియన్లు అని తెలుసుకున్నాక కథ ఇంకెన్ని మలుపులు తిరిగింది, ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి? అనేది చూడాల్సిందే. జ్యోతిలక్ష్మీ, ఆదిలక్ష్మీ రెండు పాత్రల్లోనూ అంజలి నటన ఆకట్టుకుంటుంది.

గారాల పట్టి ఆశయాలు ఛిద్రమైతే... వాన్‌ మగల్‌(దేవకన్య)

దీన్ని గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించడమే కాకుండా ఇందులో తండ్రిగానూ నటించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్య(గౌతమ్‌మేనన్‌), మతి(సిమ్రాన్‌) దంపతులకు వైదేహీ, పొన్నుత్తాయి ఇద్దరు కుమార్తెలు. భరత్‌ అనే అబ్బాయి ఉంటాడు. పొన్నుత్తాయి అందరిలాగే జీవితంలో ఎదగాలని కలలు కనే చిన్నారి. అంతకుమించి నాన్నకు గారాల పట్టీ. 12 ఏళ్ల చిన్నవయస్సులో పొన్నుత్తాయి అత్యాచారానికి గురవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంటుంది. ఆ పరిస్థితి నుంచి వారు ఎలా బయటపడ్డారు. పరువు పోతుందని బాధపడే తల్లి ఏం చేసిందన్నది మిగతా కథ. కూతురు బాధను భరించలేని తండ్రిగా గౌతమ్‌ మేనన్‌ బాగా నటించారు. శరీరమే ఒక దేవాలయమని నమ్మే మది(సిమ్రాన్‌) తన కూతురుకు జరిగిన అన్యాయానికి ఎలా స్పందించిందనేది తెర మీద చూడాల్సిందే. కట్టుబాట్లు, సంప్రదాయాలు, పరువును బలంగా నమ్మే సగటు మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో సిమ్రాన్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

సీమంతానికి పిలిచి... ఒరు ఇరవు(ఒక రాత్రి)

వెట్రిమారన్‌ సినిమాలు ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయో తెలిసిందే. ఇదీ అంతే వాస్తవికంగా ఉంటుంది. జానకిరామన్‌(ప్రకాశ్‌రాజ్‌) ఊరి పెద్ద. ఆయనకు నలుగురు కూతుళ్లు. అందులో సుమతి(సాయిపల్లవి) కులాంతర వివాహం చేసుకుని పట్టణంలో కాపురం పెడుతుంది. సుమతి గర్భం దాల్చిందన్న విషయం తెలుసుకున్న జానకిరామన్‌ సీమంతం చేసేందుకు ఇంటికి తీసుకొస్తాడు. సుమతి భర్త మంచినీళ్లిస్తేనే తీసుకోని జానకిరామన్‌ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను అంగీకరించాడా? లేదా? అనేది కథ. తీసే ప్రతికథలో చదువు గొప్పతనాన్ని ప్రస్తావించే వెట్రిమారన్, ఇందులోనూ చదువుకుంటే స్వేచ్ఛ అదే వస్తుందనే డైలాగ్‌ను సుమతితో చెప్పించారు. ఇక తండ్రీకూతుళ్లుగా ప్రకాశ్‌రాజ్, సాయిపల్లవి పోటీపడి నటించారు. గర్భిణీగా సాయిపల్లవి నటన, పతాక సన్నివేశాల్లో ఆమె చెప్పే డైలాగ్స్, బాధను భరిస్తూ కన్నతండ్రిని వేడుకొనే తీరు కంటతడి పెట్టిస్తుంది.

 

అన్ని కథలు చూశాక.. గుండె కాస్త బరువెక్కుతుంది. రక్తం మరుగుతుంది. కళ్లు ఎరబడతాయి. కాళ్లు మనల్ని ఒకచోట నిలువనివ్వవు. పాత్రలు నిద్రలోనూ వెంటాడుతాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని