Pawan Kalyan: కోలీవుడ్‌కు పవన్‌ కల్యాణ్‌ కీలక సూచన.. దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి

హీరో పవన్‌ కల్యాణ్ తమిళ ఇండస్ట్రీకి సలహా ఇచ్చారు. అన్ని భాషల వాళ్లకు కోలీవుడ్‌లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Published : 26 Jul 2023 10:48 IST

హైదరాబాద్‌: తమిళ చిత్ర పరిశ్రమలో అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని హీరో పవన్ కల్యాణ్ అన్నారు. తమిళ సినిమాల షూటింగ్‌లు ఆ రాష్ట్రంలోనే తీయాలని, అందులో పనిచేసేవారు తమిళులై ఉండాలని ఫెఫ్సీ (ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా) నిబంధన తెచ్చింది. దీనిపై ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. ఈ మేరకు ఆయన కోలీవుడ్‌కు కొన్ని విజ్ఞప్తులు చేశారు.

‘‘టాలీవుడ్‌లో అన్ని భాషల వారు పనిచేస్తారు. తెలుగు పరిశ్రమ అందరికీ ఆహ్వానం పలుకుతుంది. కేరళ నుంచి వచ్చిన సుజిత్‌ వాసుదేవన్‌, ఉత్తరాది నుంచి ఊర్వశీ రౌతేలా, అలాగే పక్క దేశానికి చెందిన కొందరు కాస్టూమ్‌ డిజైనర్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ కూడా ఇదే విధంగా అందరికీ అవకాశాలు కల్పించాలి. అన్ని భాషల వాళ్లు ఉంటేనే అది సినిమా అవుతుంది. కేవలం ఒక ప్రాంతం వాళ్లు మాత్రమే ఉండాలని అనుకోకూడదు. మరింత విస్తృత పరిధిలో ఆలోచిస్తే కోలీవుడ్‌ నుంచి కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలు వస్తాయి. మీరూ అలాంటి గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

ఇది నేను కోరుకున్న జీవితం కాదు: పవన్‌ కల్యాణ్‌

‘‘తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ‘రోజా, ‘జెంటిల్‌మెన్‌’ లాంటి సినిమాలు వచ్చాయంటే అందుకు ప్రధాన కారణం ఏఎం రత్నం. ప్రాంతం, కులం, మతం.. ఇలాంటి పరిధి దాటాలని ఆయన చెప్పారు. కోలీవుడ్‌కు మంచి పేరు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఏఎం రత్నం తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఒకవేళ తమిళనాడులో స్థానిక కార్మికుల సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కారించాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఇతర ఉపాయాలను ఆలోచించాలి’’ అని పవన్‌ కల్యాణ్ కోలీవుడ్‌ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

ఇక  పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ( Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) హీరోయిన్లుగా నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని