Pindam movie ott: ఓటీటీలో ‘పిండం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Pindam movie ott release date: థియేటర్‌లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ‘పిండం’ మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.

Published : 26 Jan 2024 20:17 IST

హైదరాబాద్‌: శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా సాయికిరణ్‌ దైదా తెరకెక్కించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘పిండం’. ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌.. అన్నది ఉపశీర్షిక. యశ్వంత్‌ దగ్గుబాటి నిర్మాత. డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు తెలుగు ఓటీటీ వేదిక ఆహా గుడ్ న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ‘పిండం’ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. (Pindam movie ott release) నల్గొండ జిల్లాలో జరిగిన  ఓ యథార్థ ఘటనను ఆధారంగా చేసుకొని దాని చుట్టూ ఓ కల్పిత కథాంశం అల్లుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కథేంటంటే: అన్న‌మ్మ (ఈశ్వ‌రీరావు) త‌న తండ్రి ద్వారా అబ్బిన తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మ‌లు ఆవ‌హించిన‌ప్పుడు త‌న‌దైన శైలిలో ప‌సిగ‌ట్టి, వాటి నుంచి విముక్తి క‌ల్పిస్తూ స్వాంత‌న చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకొని తాంత్రిక శ‌క్తుల‌పై ప‌రిశోధ‌న చేస్తున్న లోక్‌నాథ్ (శ్రీనివాస్ అవ‌స‌రాల‌) అన్న‌మ్మ వద్దకు వ‌స్తాడు. ఆ క్ర‌మంలో 1990ల నాటి ఓ సంఘ‌ట‌న గురించి చెబుతుంది అన్న‌మ్మ‌. త‌నలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే స‌వాల్ విసిరిన ఆంథోనీ కుటుంబం క‌థ అది. సుక్లాపేట్‌లోని ఓ  రైస్ మిల్లులో అకౌంటెంట్‌గా ప‌నిచేసే ఆంథోనీ (శ్రీరామ్) త‌న భార్య మేరీ (ఖుషి ర‌వి), పిల్ల‌లు సోఫీ, తారల‌తో క‌లిసి ఊరి చివ‌ర‌ ఉండే ఓ ఇంటిని కొని అందులో చేర‌తాడు. ఆ ఇంట్లోకి వెళ్లిన నాటినుంచి గ‌ర్భంతో ఉన్న మేరీ మిన‌హా అందరూ కూడా ఆత్మ‌ల బారినప‌డి ఇబ్బందులు పడతారు. ఆ ఇంటిని వ‌దిలిపెట్టి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా ఆ ఆత్మ‌లు వ‌దిలిపెట్ట‌వు. (Pindam movie) ఇంత‌కీ ఆ ఆత్మ‌లు ఎవ‌రివి? వాటి నుంచి ఆంథోనీ కుటుంబానికి ఎలా విముక్తి లభించింది? ఆత్మ‌ల గ‌తం ఏమిట‌నేది తెర‌పై చూడాల్సిందే.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని